సాక్షి, అమరావతి: చిట్‌ఫండ్ చట్టం నిబంధనలను అనుసరించనందుకు తమకు ఎలాంటి పెనాల్టీ విధించకుండా, అధికారులు చట్ట నిబంధనల ప్రకారం నడుచుకునేలా ఆదేశించాలంటూ మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టులో దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాల్లో వాదనలు శుక్రవారం ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
తమ వ్యవహారంలో అధికారులు నిబంధనల మేరకు నడుచుకునేలా ఆదేశాలు జారీ చేయాలంటూ మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థ అధీకృత అధికారి బి.శ్రీనివాసరావు దాఖలు చేసిన పిటిషన్, అనుబంధ వ్యాజ్యాలపై జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి శుక్రవారం విచారణ జరిపారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థ చట్ట నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుండటం వల్లే సోదాలు చేపట్టామన్నారు.
ఇటీవల చాలా కంపెనీలు ప్రజల నుంచి సేకరిస్తున్న సొమ్ము విషయంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నాయని, అలాంటి పరిస్థితులు ప్రజలకు రాకూడదన్న ఉద్దేశంతోనే మార్గదర్శి వ్యవహారంలో చర్యలు చేపట్టామన్నారు. ప్రజల నుంచి చిట్ రూపంలో సేకరించిన డబ్బును ఓ ప్రత్యేక ఖాతాలో జమ చేయాలని, మార్గదర్శి అందుకు విరుద్ధంగా కార్పొరేట్ ఖాతాలో జమ చేస్తోందని తెలిపారు. ఆ సొమ్మును ఉషాకిరణ్ మూవీస్, ప్రియా ఫుడ్స్, ఉషోదయా పబ్లికేషన్స్, రమాదేవి ట్రస్ట్ వంటి అనుబంధ కంపెనీలకు, ఇతర అవసరాలకు మళ్లిస్తోందని, ఎన్నో ఏళ్ల నుంచి ఈ తంతు సాగుతోందని నివేదించారు. ఇది ప్రజలను, చట్టాన్ని మోసం చేయడమేనన్నారు. ప్రతి చిట్ ఆస్తి, అప్పుల పట్టీని రిజిస్ట్రార్‌కు సమర్పించాలని, మార్గదర్శి ఆ పని కూడా చేయడంలేదని చెప్పారు.
ప్రజలు ఏ రకంగానూ మోసపోకూడదనే ఉద్దేశంతోనే మార్గదర్శి రికార్డులన్నింటినీ పరిశీలిస్తున్నామని, చిట్‌ఫండ్ కంపెనీ రికార్డులను పరిశీలించే అధికారం అధికారులకు ఉందని తెలిపారు. మార్గదర్శి హెడ్ ఆఫీస్ హైదరాబాద్‌లో ఉంది కాబట్టి ఏపీలోని ఆ సంస్థ కార్యాలయాల్లో సోదాలు చేయకూడదనడం విడ్డూరంగా ఉందన్నారు. ఏ చట్ట నిబంధనలూ వర్తించవన్నట్లు మార్గదర్శి వ్యవహరిస్తోందన్నారు. కొత్త చిట్ ప్రారంభించేందుకు అనుమతి కోరుతూ ప్రతిపాదనలు సమర్పించినప్పుడు పాత చిట్ రికార్డులు పరిశీలించే అధికారం రిజిస్ట్రార్‌కు ఉందన్నారు.
కొత్త చిట్‌కు అనుమతివ్వాలా లేదా అన్నది పూర్తిగా రిజిస్ట్రార్ విచక్షణపై ఆధారపడి ఉంటుందన్నారు. చిట్‌కు అనుమతివ్వాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించడానికి వీల్లేదన్నారు. ప్రజల క్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు కక్ష సాధింపు ఎలా అవుతుందని అన్నారు. రికార్డులు అడుగుతుంటే కుంటి సాకులతో తప్పించుకుంటున్నారని వివరించారు. రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ వద్ద అన్ని డాక్యుమెంట్లను సమర్పించిన తరువాత వ్యాపారం కొనసాగించవచ్చని చెప్పారు. ఈ కేసులో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని ఆయన కోర్టును అభ్యర్థించారు.
అంతకు ముందు మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. రిజిస్ట్రార్ నిబంధనల ప్రకారం నడుచుకోవడంలేదన్నారు. కార్పొరేట్ ఆఫీస్, బ్రాంచ్ ఆఫీసుల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను కోరజాలరన్నారు. చిట్ డబ్బుపై సెక్యూరిటీ మొత్తాన్ని రిజిస్ట్రార్ వద్ద జమ చేస్తున్నామని తెలిపారు. ఫోర్‌మెన్ సెక్యూరిటీ ఇవ్వాలని చట్టంలో ఎక్కడా లేదన్నారు. ఎలాంటి ఫిర్యాదు లేకపోయినా అధికారులు సోదాల పేరుతో ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ముందుగా నోటీసు ఇవ్వకుండా, కారణాలు చెప్పకుండా కొత్త చిట్‌కు అనుమతిని తిరస్కరించడం చట్ట విరుద్ధమన్నారు. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment