
సాక్షి, అమరావతి: చిట్‌ఫండ్ చట్ట నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన సమాచారం, రికార్డులు ఇవ్వకపోవడంతో అధికారులు చట్టపరంగా చేస్తున్న సోదాలపై మార్గదర్శి చిట్‌ఫండ్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. అధికారులపై, ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ, తమ కంపెనీ విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు చేపట్టకుండా అధికారులను నియంత్రించాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. చట్టనిబంధనల ప్రకారం నడుచుకునేలా అధికారులను ఆదేశించాలంటూ మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ బి.శ్రీనివాసరావు వ్యాజ్యంలో కోరారు.
ఈ వ్యాజ్యం మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ దొనడి రమేశ్ ముందు విచారణకు వచ్చింది. విచారణను కొద్దిసేపు వాయిదా వేయాలని మార్గదర్శి తరఫు న్యాయవాది ఎం.ఆర్.కె.చక్రవర్తి కోరారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరించారు. మధ్యాహ్నం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు లేచి నిల్చోగానే.. న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ స్పందిస్తూ నాట్ బిఫోర్ (నేను ఈ వ్యాజ్యాన్ని విచారించను) అని స్పష్టం చేశారు.
ఇందుకు కారణాలేమిటో మాత్రం తెలియజేయలేదు. బుధవారం విచారణ జాబితాలో ఈ వ్యాజ్యాన్ని చేర్చాలని రిజిస్ట్రీని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ వ్యాజ్యాన్ని మరో న్యాయమూర్తికి నివేదించేందుకు వీలుగా ఈ కేసు ఫైల్‌ను ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని పేర్కొన్నారు. జస్టిస్ రమేశ్ న్యాయమూర్తి కావడానికి ముందు తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ)గా బాధ్యతలు నిర్వర్తించారు. 2014 నుంచి 2019 వరకు అప్పటి అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌తో కలిసి పనిచేశారు.