
అంబేడ్కర్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో మంత్రి మేరుగ
మధురవాడ (భీమిలి): ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలతో అద్భుత పాలన అందిస్తుంటే.. అది చూసి ఓర్వలేక 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు రాజకీయ దాడులు, అరాచకాలతో ఏపీని రావణ కాష్టంగా మార్చేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. శనివారం మధురవాడ రిక్షా కాలనీలో బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడారు.
తమకు మంచి భోజనం, నాణ్యమైన విద్య అందడంతో పాటు ఉపాధ్యాయులు కూడా చాలా బాగా చూసుకుంటున్నారని విద్యార్థులు చెప్పారు. అయినా మరింత నాణ్యమైన భోజనం అందించేందుకు త్వరలో మెనూ మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని మంత్రి మేరుగ చెప్పారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. మూడేళ్ల పాటు ప్రతి పక్షం అన్నది ఎక్కడుందో తెలీదని.. ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు మీ అంతు చూస్తాననడం, ఫ్లెక్సీలు చించడం, ముఖ్యమంత్రిని తిట్టించడం, దాడులు వంటివి చేయిస్తున్నారన్నారు. ‘చంద్రబాబూ.. నీ రథ చక్రాలు ఊడిపోతున్నాయని తెలిసి ఈ విధంగా చేస్తున్నావు.
జగన్‌మోహన్‌రెడ్డి రథ చక్రాలు కింద నలిగిపోయావు. రాబోయే రోజుల్లో నీకు పుట్టగతులు ఉండవు’ అని హెచ్చరించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటింటికీ వెళ్తుంటే ప్రజలు నీరాజనాలు పడుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీకి ఓటేసిన వారికి కూడా ఇంటికి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతోందని, వారంతా సంతోషంగా ఉన్నారన్నారు. ఇది చూసి చంద్రబాబుకు వణుకు పుడుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment