సాక్షి, తాడేపల్లి: వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులను మారిస్తే రామోజీరావు, రాధాకృష్ణలకు నొప్పేంటని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున ప్రశ్నించారు. తాడేపల్లిలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ అభ్యర్థులను చూస్తే రామోజీ రావు, రాధాకృష్ణలకు భయం పుడుతోందని చెప్పారు. అందుకే ఇష్టానుసారం వార్తలు రాస్తున్నారని విమర్శించారు.
ఓసీ నియోజకవర్గాలలో కూడా సీఎం జగన్ ఇతరులకు అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. చంద్రబాబుకు ఆయన పార్టీ ఇక కనుమరుగు అవుతుందనే భయం పుట్టిందన్నారు. టీడీపీకి బీటీమ్ పురంధేశ్వరి పార్టీ బీటీమ్ అన్నారు. చంద్రబాబు కోసం తెగ తాపత్రయం పడుతోందన్నారు. ఆమె ఇంట్లో ఒక్కొకరు ఒక్కొక పార్టీలో ఉన్నారని, దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా పురంధేశ్వరి వైఎస్‌ఆర్‌సీపీ గురించి మాట్లాడుతున్నారని మేరుగ ఫైరయ్యారు.
చంద్రబాబు ఒక పొలిటికల్ బ్రోకర్
‘చంద్రబాబు ఒక పొలిటికల్ బ్రోకర్. సీఎం జగన్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీలకు న్యాయం జరుగుతోంది. అంబేద్కర్ కోరుకున్న పాలన ఏపీలో ఉంది. గతంలో ఇచ్చిన హామీల్లొ ఒక్కదానినైనా చంద్రబాబు నెరవేర్చారా. మా పార్టీ అభ్యర్థులను మారిస్తే మీకు నొప్పేంటి. మా అభ్యర్థులను చూస్తే రామోజీ, రాధాకృష్ణలకు భయం పుడుతోంది. అందుకే ఇష్టానుసారం వార్తలు రాస్తున్నారు. పేదలను చంద్రబాబు ఎప్పుడైనా పట్టించుకున్నారా ..బీసీలు జడ్జిలుగా పనికిరారని లేఖలు రాసింది చంద్రబాబు కాదా’ అని మేరుగ ప్రశ్నించారు.
బాబు రాజకీయ జీవితమంతా పొత్తులే
‘మా పార్టీలో ఎస్సీలను మార్చితే ఇంకో ఎస్సీకే అవకాశం వస్తుంది. అందరికీ అవకాశం కల్పించాలన్నదే జగన్ లక్ష్యం. అందరం కలిసి జగన్‌ని గెలిపిస్తాం. ఎంఎస్ బాబు మా ఎమ్మెల్యే, ఆయన మా వాడు. మా సీఎం జగన్ అందరివాడు, అందరికీ న్యాయం చేస్తారు. ఇప్పుడు టికెట్ రాకపోయినా సరైన రీతిలో జగన్ న్యాయం చేస్తారు. నారా చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం చూస్తే.. ఆయన పొత్తు పెట్టుకోని పార్టీ ఏమైనా ఉందా..? ఆయన కాంగ్రెస్‌తో, బీజేపీతో, కమ్యూనిస్టులతో, ఆఖరుకు జనసేన పార్టీతోనూ పొత్తులు పెట్టుకున్నాడు. ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజల ముందు నిలబడి గెలిచే దమ్ముంటే మూకుమ్మడిగా పార్టీల్ని కూడగట్టి పొత్తులు పెట్టుకోవడం ఎందుకు’ అని మేరుగ నిలదీశారు.
బాబుకు బుద్ధిచెప్పేందుకు ఎస్సీలు సిద్ధం
‘సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసి ఆయన ఏనాడైనా మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల గురించి పట్టించుకున్నావా..? రాజకీయాల్లో మమ్మల్ని ఉద్దేశించి నువ్వు చేసిన హేళనలు, అసమానతలు మాకు గుర్తుకురావని అనుకుంటున్నావా..? ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండగా, మళ్లీ మేము గుర్తుకొస్తున్నామా..? ఒకపక్క, మా జాతి సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తూ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ మా నాయకుడు వైఎస్ జగన్ పనిచేస్తున్నారు. మా కులాన్ని అవహేళన చేసినటువంటి నిన్ను అంత తేలిగ్గా వదులుతామా..? నీకు బుద్ధిచెప్పేందుకు ఎస్సీలంతా సిద్ధంగా ఉన్నారు’అని మేరుగ తెలిపారు.
మీ కుట్రలన్నీ చివరికి నీటిమూటలే..
‘చంద్రబాబు విషకూటమిలో పచ్చమీడియా ప్రధాన భూమిక పోషిస్తోంది. ఈ పచ్చమీడియా రోజూ కారుకూతలు రాస్తూ.. ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు.. జరగనివి కూడా జరిగినట్లు అభూతకల్పనలు, కట్టుకథలతో ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయా వర్గాలను రెచ్చగొడుతూ కార్మిక సంఘాలతో ఉద్యమాలు చేయిస్తున్నారు. మీరెంత విషాన్ని నూరిపోసి, కుట్రలతో దొంగ ఉద్యమాలు చేయించినా అవన్నీ చివరికి నీటిమూటలుగానే తేలుతాయి. మీరు గుడ్డ కాల్చి మామీద వేయడానికి తప్పుడు కార్యక్రమాలు చేయిస్తున్నారనేది ఈ రాష్ట్ర ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారు’ అని మేరుగ అన్నారు.
మళ్లీ సీఎంగా జగనన్నే అనేది ప్రజా నినాదం
‘పేదల ఆకలి చూసి తిండి పెట్టేది ఎవరు..? భావితరాల భవిష్యత్తు కోసం ఎవరు చూస్తున్నారు..? బడుగు, బలహీనవర్గాలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా నిలబెట్టి ప్రోత్సహించే నాయకుడు ఎవరనేది ప్రజల్లో చాలా స్పష్టత ఉంది. అందుకే, వైఎస్‌ఆర్‌సీపీకి రాష్ట్రంలో అడుగడుగునా ఆదరణ లభిస్తోంది. మళ్లీ జగనన్ననే ముఖ్యమంత్రిగా తెచ్చుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. అందుకే, మళ్లీ సీఎం జగనన్ననే అనేది ప్రజా నినాదమైంది. మీ పచ్చమీడియా పైత్యం, ఎన్ని వెర్రితలలేసినా ప్రజలు మీ మాటల్ని, రాతల్ని నమ్మరు గాక నమ్మరు’ అని మేరుగ నాగార్జున అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment