మిలాన్‌.. విశాఖ చరిత్రలో మైలు రాయి  | Milan milestone in history of Visakhapatnam | Sakshi
Sakshi News home page

మిలాన్‌.. విశాఖ చరిత్రలో మైలు రాయి 

Published Mon, Feb 28 2022 2:17 AM | Last Updated on Mon, Feb 28 2022 8:55 AM

Milan milestone in history of Visakhapatnam - Sakshi

వేడుకలను తిలకిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ దంపతులు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మొట్టమొదటి సారిగా విశాఖ సాగర తీరంలో మిలాన్‌–2022 నిర్వహణ చరిత్రలో మైలు రాయిగా నిలిచిపోతుందని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. తూర్పు నావికాదళంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్‌ఎస్‌ విశాఖ చేరడం మనకు గర్వకారణమని పేర్కొన్నారు. విశాఖ సాగర తీరంలో 39 దేశాలతో కలసి భారత నావికాదళం, తూర్పు నావికాదళం నిర్వహించిన విన్యాసాలు.. దేశ సైన్యం పట్ల మరింత నమ్మకాన్ని, అభిమానాన్ని పెంచుతాయని చెప్పారు.

విశాఖలోని ఆర్కే బీచ్‌లో మిలాన్‌–2022 వేడుకలను ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా ప్రారంభించారు. అంతకుముందు సీఎం దంపతులు డాక్‌ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా ఐఎన్‌ఎస్‌ విశాఖను జాతికి అంకితం చేశారు. కొత్తగా నావికాదళంలో చేరిన ఐఎన్‌ఎస్‌ వేలా జలాంతర్గామిని సందర్శించారు. అక్కడి నుంచి ఆర్కే బీచ్‌కు చేరుకుని.. మిలాన్‌ వేడుకల్లో భాగంగా సిటీ పరేడ్‌ను ప్రారంభించారు. దాదాపు గంటకుపైగా సాగిన సైనిక విన్యాసాలు, సిటీ పరేడ్‌ను సీఎం దంపతలు ఆసాంతం ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే..
సముద్రంలో కళ్లు మిరుమిట్లు గొలుపుతున్న లేజర్‌ షో 

విశాఖ ప్రజలకు గర్వకారణం
► వైజాగ్‌.. సిటీ ఆఫ్‌ డెస్టినీ తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం. ఈ ప్రాంతం సంప్రదాయానికి ప్రతీక. విశాఖ చరిత్రలో ఇది మైలురాయి. ఇది అరుదైన యుద్ధ నౌకల విన్యాసాల పండగ. ఈ మిలాన్‌లో 39 దేశాలు పాల్గొనడం గర్వకారణం.  
► పూర్తి స్వదేశీయంగా యుద్ధ నౌక ‘ఐఎన్‌ఎస్‌ విశాఖ’ను రూపొందించడం ఎంతో సంతోషం. ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం యుద్ధ నౌక కొద్ది నెలల క్రితం నావికాదళంలో చేరింది. ఇది విశాఖ ప్రజలకు గర్వకారణం. పీ 15 బీ క్లాసెస్‌ గైడెడ్‌ మిసైల్‌ స్టెల్త్‌ డిస్ట్రాయర్‌ సాంకేతికతో పనిచేసే ఈ యుద్ధ నౌక తూర్పు నావికాదళంలోకి చేరడం ఎంతో గర్వకారణం. 
► నౌక పై భాగంలో మన విశాఖపట్నంలో ప్రకృతి ప్రసాదంగా ఏర్పడిన డాల్ఫిన్‌ నోస్‌ని.. రాష్ట్ర మృగం కృష్ణ జింకని ప్రత్యేకంగా ముద్రించారు. ధన్యవాదాలు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్‌ఎస్‌ వేలా జలాంతర్గామి కూడా తూర్పు నావికాదళంలో చేరడంతో ఈ ప్రాంత రక్షణలో మరో అధ్యాయం ప్రారంభమైంది. 
యుద్ధ నౌకలు, నేవీ హెలికాప్టర్ల విన్యాసాలు

ఈ స్నేహ బంధం కొనసాగాలి 
► మిలాన్‌–2022 విన్యాసాలతో విశాఖ ప్రజలకు ఉత్సాహంతో పాటు.. దేశ రక్షణకు నిరంతరం పాటు పడుతున్న సైన్యం మీద గౌరవం, అభిమానం, నమ్మకం మరింత పెరుగుతుంది. 
► మొట్టమొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వం, ఇండియన్‌ నేవీ సంయుక్త నిర్వహణలో మిలాన్‌ వేడుకలకు విశాఖ  కేంద్రం కావడం ఆనందంగా ఉంది. ఇక్కడి ఆతిథ్యం మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఈ సంప్రదాయాన్ని కొనసాగిద్దాం. 
► సిటీ పరేడ్‌లో పాల్గొన్న ఇండియన్‌ కోస్ట్‌గార్డ్, ఏపీ పోలీస్, ఫైర్‌ సర్వీస్‌ సీకేడెట్, ఎన్‌సీసీ, బ్యాండ్‌ ట్రూప్, కల్చరల్‌ ట్రూప్స్, స్నేహ పూర్వక దేశాల ప్రతినిధులకు ధన్యవాదాలు. ఇదే స్నేహ బంధం కొనసాగాలని కోరుకుంటున్నాను. 
► భారత నౌకాదళానికి ప్రత్యేకంగా తూర్పు నావికాదళంతో పాటు అనేక దేశాల నుంచి వచ్చి ఈ విన్యాసాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక అభినందనలు. భారత నౌకాదళాధిపతి అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్, తూర్పు నౌకాదళాధిపతి వైస్‌ అడ్మిరల్‌ బిస్వజిత్‌ దాస్‌గుప్తా, ఈ వేడుకల్లో పాల్గొన్న అంబాసిడర్లు, అధికారులు, ఇతర దేశాల ప్రతినిధులకు ధన్యవాదాలు.   

(మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 


యుద్ధ నౌకలు, నేవీ హెలికాప్టర్ల విన్యాసాలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement