సాక్షి, అమరావతి: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా విశాఖ పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఖండించారు. చెప్పుడు మాటలు విని తప్పుడు ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురద చల్లేందుకు సాహసించడం మంచిది కాదని హితవు పలికారు. ఈ ప్రయత్నాలు బెడిసికొడతాయని బీజేపీని హెచ్చరించారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నాగేశ్వరరావు విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్రంలో పాలనపై ఒకవైపు మీరే కితాబులిస్తూ అవినీతి అని ఎలా మాట్లాడతారని అభ్యంతరం తెలిపారు. గతంలో అమిత్‌షా తిరుపతి వచ్చినప్పుడు చంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ నేతలు, కార్యకర్తలు రాళ్లు విసిరి తరిమేశారని గుర్తు చేశారు. ప్రధాని మోదీని నోటికొచ్చినట్లు దూషించింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. ‘మోదీకి భార్యా పిల్లల్లేరు. మోదీ రూ.2 లక్షల కోట్ల ఆస్తిపరుడు‘ అని విమర్శించిన చంద్రబాబు యూటర్న్ తీసుకుని బీజేపీ జపం చేస్తున్నారని దుయ్యబట్టారు. అమరావతి పెద్ద స్కామ్ అని, సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది బీజేపీ కాదా? అని సూటిగా ప్రశ్నించారు.
అమిత్‌షా నోట విభజన హామీల ప్రస్తావనేది?
‘ఐదేళ్ల టీడీపీ హయాంలో ఇసుక దందాలు అంతా ఇంతా కాదు. ఇందులో నాటి మిత్రపక్షమైన బీజేపీకి కూడా భాగస్వామ్యం ఉంటుంది కదా? రాష్ట్ర ఖజానాకు ఎలాంటి ఆదాయం రాలేదు. ఇప్పుడు ఇసుకపై రూ.వేల కోట్ల ఆదాయాన్ని ఖజానాకు జమ చేస్తున్నాం. అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచాం. రూ.2.16 లక్షల కోట్లు డీబీటీ ద్వారా పారదర్శకంగా అందచేస్తే ఇక అవినీతి జరిగిందెక్కడ?’ అని మంత్రి కారుమూరి ప్రశ్నించారు. అందరి కళ్ల ముందే జరిగిన అమరావతి భూముల కుంభకోణాన్ని వదిలేసి విశాఖలో భూ దోపిడీకి పాల్పడ్డారనే నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
ఆధారాలుంటే బయట పెట్టాలని సవాల్ చేశారు. ‘అమిత్‌షా నోట విభజన హామీల ప్రస్తావనేది?’ అని ప్రశ్నించారు. ‘విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కనీసం ప్రస్తావించలేదు. విశాఖ రైల్వేజోన్ గురించి మాట్లాడలేదు. విశాఖ మైట్రోలైన్ ఊసే లేదు. తగుదునమ్మా అంటూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురద జల్లేందుకు మాత్రం సిద్ధపడ్డారు. ఆ వేదికపై ఉన్న వారంతా టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారే. అలాంటి వారు చెప్పే చాడీలు విని సీఎం జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా? వాస్తవాల్ని తెలుసుకుని మాట్లాడాలి’ అని కారుమూరి సూచించారు. సీఎం జగన్ నేతృత్వంలో సింగిల్‌గా పోటీకి దిగి 175 స్థానాలనూ గెలిచి తీరతామని ధీమా వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment