ప్రజారోగ్యం, మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి | Ministers lashed out at TDP members during question and answer session | Sakshi
Sakshi News home page

ప్రజారోగ్యం, మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి

Published Fri, Mar 17 2023 4:04 AM | Last Updated on Fri, Mar 17 2023 4:07 PM

Ministers lashed out at TDP members during question and answer session - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యం, మహిళా భద్రత, మత్తు పదార్థాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టిందని రాష్ట్ర మంత్రులు చెప్పారు. గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానాలిచ్చారు.

ఇదే సమయంలో ప్రతిపక్ష టీడీపీ సభ్యులు సమాధా­నాలు చెప్పనివ్వకుండా మంత్రులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో మంత్రులు వాస్తవాలు చెబుతుంటే తట్టుకోలేక సభను తప్పుదారి పట్టించేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. సభలో సభ్యు­ల ప్రశ్నలకు మంత్రుల సమాధానాలిలా ఉన్నాయి.

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ మా లక్ష్యం 
రాష్ట్రంలోని ప్రజలందరికీ నాణ్యమైన, ఉచిత వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని 1142 పీహెచ్‌సీలలో 1125 పీహెచ్‌సీలను రూ.670 కోట్లతో ఆధునికీకరించాం. టీడీపీ హయాంలో 5 పీహెచ్‌సీలనే కొత్తగా ఏర్పాటు చేశారు. మా ప్రభుత్వం 88 కొత్త పీహెచ్‌సీలు ఏర్పాటు చేస్తోంది. ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టాం. ప్రతి పీహెచ్‌సీలో కచ్చితంగా 14 మంది వైద్య సిబ్బంది ఉండేలా నియామకాలు చేపట్టాం.

175 రకాల మందులను ఉచితంగా ఇస్తున్నాం. దీంతో ఓపీల సంఖ్య పెరిగింది. పీహెచ్‌సీల్లోనే స్క్రీనింగ్, లేబొరేటరీ సదుపాయాలు తీసుకొచ్చాం. ప్రతి 2 వేల జనాభాకు వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌ తీసుకొచ్చాం. గ్రామాల్లోని చిన్నారుల ఆరో­గ్య రక్షణ మా ఫ్యామిలీ డాక్టర్‌ విధానంలో ఉంది. సింగరాయకొండలో పీహెచ్‌సీని రూ.50 లక్షలతో ఆధునికీకరించాం. ఇక్కడ 60 వేల మంది ప్రజలకు ఒకే పీహెచ్‌సీ ఉంటే దానిని వికేంద్రీకరించాం. పక్కనే పాకా­లలో రూ.2.53 కోట్లతో కొత్తది నిర్మిస్తున్నాం.
– విడదల రజిని, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి 


గంజాయి సాగు నుంచి గిరిజనులకు విముక్తి  
ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో మా ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ పరివర్తన్‌తో అమాయక గిరిజనులను గంజాయి సాగు ఉచ్చు నుంచి కాపాడుతున్నాం. ఆపరేషన్‌ పరివర్తన్‌కు దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. శాటిలైట్‌ ఫొటోల సాయంతో ఏజెన్సీ ప్రాంతాల్లోని 8,554 ఎకరాల్లోని గంజాయి  పంటను ధ్వంసం చేశాం. మాపై విమర్శిస్తున్న ప్రతిపక్షాలు శాటిలైట్‌ చిత్రాలు చూసైనా వాస్తవాలు తెలుసుకోవాలి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 10 ఏజెన్సీ మండలాల్లో గంజాయి సాగు లేకుండా చేశాం.

ఆరు మండలాల్లో గిరిజనులు స్వచ్ఛందంగా సాగును వదిలేశారు. వీరందరికీ స్వయం ఉపాధితో పాటు ఉద్యోగావకాశాలూ కల్పిస్తున్నాం. టీడీపీ హయాంలో 200 ఎకరాల్లో మాత్రమే గంజాయిని ధ్వంసం చేశారు. సరిహద్దు రాష్ట్రాల డీజీపీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి గంజాయి రవాణాను అరికడుతున్నాం. మా ప్రభుత్వం మహిళా రక్షణకు అనేక చర్యలు చేపట్టింది. 18 దిశ పోలీసు స్టేషన్లు, 13 ప్రత్యేక న్యాయ స్థానాలను తెచ్చింది.

లోకేశ్‌ ఆధ్వర్యంలో దిశ బిల్లు ప్రతులను తగలబెట్టిన టీడీపీ నాయకులకు మహిళా రక్షణ గురించి మాట్లాడే అర్హత లేదు. దిశ యాప్‌తో ఆపదలో ఉన్న మహిళలను క్షణాల్లోనే రక్షిస్తున్నాం. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు చదవడం మానేస్తే తప్ప టీడీపీ నాయకులకు వాస్తవాలు బోధపడవు. మహిళలకు అన్యాయం జరిగితే ప్రతిపక్షం బాధితులనే రోడ్డున పడేస్తూ నీచ రాజకీయాలు చేస్తోంది. 
– తానేటి వనిత, హోంశాఖ మంత్రి 


రాష్ట్రమనే తులసి వనంలో టీడీపీ గంజాయి మొక్క 
రాష్ట్రమనే తులసి వనంలో టీడీపీ గంజాయి మొక్కగా మారింది. ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ పరివర్తన్‌ సత్ఫలితాలను ఇస్తుంటే చూసి ఓర్వలేకపోతోంది.
– అబ్బయ్య చౌదరి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే

వైద్య రంగంలో సిబ్బందిని పెంచాలి  
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు తగినట్టుగా సిబ్బందిని పెంచాలి. అన్ని పీహెచ్‌సీలకు సమానంగా రోగులు రారు. రేషనలైజేషన్‌ పేరుతో పీహెచ్‌సీల్లో సిబ్బందిని తగ్గిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలి. నాడు–నేడులో పీహెచ్‌సీల అభివృద్ధితో రోగులు ఇక్కట్లు పడుతున్నారు. – కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ ఎమ్మెల్యే

దిశ బిల్లు చట్టంగా మారేలా చూడాలి
దిశ బిల్లు చట్టంగా రూపుదిద్దుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలి. మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం దిశ బిల్లుకు సవరణలు కోరుతూనే ఉంది. రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయి. దీనిని అరికట్టాలి. 
– ఆదిరెడ్డి భవాని, టీడీపీ ఎమ్మెల్యే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement