
ములకలచెరువు మండలంలో రోడ్డు పక్కన నాటిన మొక్కలు
సాక్షి,చిత్తూరు: జిల్లాలోని రహదారులు పచ్చ తోరణంతో కొత్త శోభను సంతరించుకోనున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ‘జగనన్న పచ్చతోరణం’ కార్యక్రమానికి ఆదివారం శ్రీకారం చుడుతోంది. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి సంరక్షించేందుకు నిర్ణయించింది. మొక్కను నాటినప్పటి నుంచి చెట్టయ్యే వరకు సంరక్షించేలా ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేసింది. తిరుపతి మినహా మిగిలిన 13 నియోజకవర్గాల్లో జగనన్న పచ్చతోరణం పక్షోత్సవాలను నిర్వహించనున్నారు. జిల్లాలో 6,10,510 మొక్కలను 15 రోజుల్లో నాటేలా అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. రహదారులకు ఇరువైపులా 1,526.28 కిలోమీటర్ల వరకు మొక్కలను నాటుతారు. ఆగస్టు ఒకటి నుంచి 15లోపు మొక్కలు నాటడం పూర్తికాకుంటే మరోవారం రోజుల్లో పూర్తి చేయాలన్నది లక్ష్యం.
మొక్కకు రూ.385 ఖర్చు
ఉపాధి హామీ పథకం నిధులతో ‘జగనన్న పచ్చతోరణం’ పథకాన్ని అమలు చేస్తున్నారు. నాటే మొత్తం మొక్కలకు రూ.23,50,46,350 ఖర్చు చేయనున్నారు. ఒక్కో మొక్కకు ఏడాదికి రూ.385 ఖర్చు చేస్తారు. చిన్న మొక్కలను నాటితే త్వరగా ఎదిగే అవకాశం లేదని గుర్తించిన ప్రభుత్వం ఒక్కో మొక్క 6 నుంచి 10 అడుగుల ఎత్తు, రెండేళ్ల వయసు కలిగినవి నాటేందుకు నిర్ణయించింది. ఒక మొక్క కొనుగోలుకు రూ.95, నాటడానికి రూ.110, క్రిమిసంహారక మందు పిచికారీకి రూ.10, నెలకు నిర్వహణ రూ.10, నీటికి రూ.20, ఫెన్సింగ్‌కు రూ.140 చొప్పున మొత్తం రూ.385 ఖర్చు చేస్తారు.
లక్ష మొక్కలు సిద్ధం
పచ్చతోరణం పక్షోత్సవాలకు జిల్లాలో లక్ష మొక్కలను సిద్ధం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి అవసరమైన మొక్కలను దశలవారీగా తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాజమండ్రితో పాటు తమిళనాడులోని పుదుకోట్టై నుంచి మొక్కలను కొనుగోలు చేసి తరలిస్తున్నారు. ప్రస్తుతానికి నిర్దేశించిన ప్రణాళిక మేరకే కాకుండా అదనంగా మరో లక్ష మొక్కలు నాటేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రయోగాత్మకంగా తంబళ్లపల్లెలో ప్రారంభం
తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఎమ్మెల్యే ద్వారకనాథ రెడ్డి ఈ పచ్చతోరణాన్ని ప్రయోగాత్మకంగా మొదలుపెట్టారు. ఇప్పటికే పలు చోట్ల రోడ్డుపక్కన మొక్కలు నాటే ప్రక్రియను చేపట్టారు. రాజమండ్రి నుంచి తెప్పించిన మొక్కలను రహదారులకు ఇరువైపులా నాటి సంరక్షించే పనులపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించారు.