ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు పరుగులు తీస్తున్న కృష్ణమ్మ
సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో/మహారాణిపేట (విశాఖ దక్షిణ)/చిలకలపూడి (మచిలీపట్నం): ఈశాన్య బంగాళాఖాతంలో మంగళవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో బుధవారం ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతోందని విశాఖ వాతావరణ కేంద్రం, భారత వాతావరణ విభాగం– అమరావతి తెలిపాయి. రానున్న 24 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడి పశ్చిమం వైపు కదిలే అవకాశం ఉందని వెల్లడించాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తా తీరం వెంట బలమైన గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. బుధ, గురువారాల్లో రాష్ట్రమంతా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
► కృష్ణా జిల్లా వ్యాప్తంగా మంగళవారం 3.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గూడూరు మండలంలో 17.0 మిల్లీమీటర్లు, అత్యల్పంగా చాట్రాయి మండలంలో 1.2 మిల్లీమీటర్ల వర్షం పడింది.
► అల్పపీడన ప్రభావంతో గుంటూరు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడ్డాయి. గుంటూరు నగరంలో కురిసిన వర్షాలకు డ్రెయిన్లు పొంగి పొర్లాయి.
► తడి వాతావరణం ఉండటంతో పశ్చిమ డెల్టా ప్రాంతంలో వెద పద్ధతిలో వరి పంట సాగులో జాప్యం జరుగుతోంది.
► పత్తి పొలాలు ఉరకెత్తడంతో కొన్నిచోట్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment