
సాక్షి, మైలవరం: మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మైలవరం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేవినేని ఉమాపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజకీయాల్లోకి రాకూడదంటూ ఉమా చేసిన వ్యాఖ్యలకు కౌంటరిస్తూ.. గతంలో రాజమండ్రి మాజీ ఎంపీ మురళీమోహన్‌కి, నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్యకు టీడీపీ ఎందుకు టికెట్ ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. నోటికి అడ్డూ అదుపూ లేకుండా మాట్లాడుతున్న ఉమా.. ఎన్ని సోడాలు కొట్టి ఎమ్మెల్యే అయ్యాడో చెప్పాలని నిలదీశారు.
నీ వదిన చావుకు కారణం నువ్వే అని ప్రజలందరూ అనుకుంటున్నారు, దీనికి సమాధానం ఏంటి. చెరువు మాధవరంలో సొంత పార్టీ కార్యకర్తనే ఆదుకోలేని నువ్వు, రాజకీయాలు చేయడం మానుకుంటే మంచిదని వసంతకృష్ణప్రసాద్ హితవుపలికారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను విమర్శించడం నీలాంటి పనీ పాటా లేని వాళ్లకు అలవాటైపోయిందని ఆయన మండిపడ్డారు. కోవిడ్ పరీక్షల విషయంలో కానీ.. కోవిడ్ నియంత్రణలో కానీ.. తమ ప్రభుత్వం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని గుర్తు చేశారు. గొల్లపూడిలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా దిశా యాప్ ఆవిష్కరణ చేయడం ఆనందకరమని, మహిళలంతా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment