పలమనేరు: చిత్తూరు జిల్లాలోని పలమనేరు, కుప్పం ప్రాంతాలతోపాటు పొరుగునే ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మైలేర్ల (ఎద్దుల పరుగుపందేల) సందడి మొదలైంది. సంక్రాంతంటే ఈ మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రజలకు గుర్తొచ్చేది మైలేర్లే. కనుమ పండుగ నుంచి ఏప్రిల్ వరకు మైలేర్లు జరుగుతాయి. ఈప్రాంతంలో జరిగే మైలేరు పండుగల్లో విజేతలకు మొదటి బహుమతిగా రూ.50 వేల నుంచి లక్ష దాకా ఉండేది. అదే తమిళనాడులో అయితే లారీలు, కార్లు మొదటి బహుమతిగా అందజేస్తున్నారు.
మైలేరు అనే తమిళ పదానికి ఎద్దుల పరుగుపందెం అని అర్థం. తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాంతంలో మైలేర్లు నిర్వహించడం ఆనవాయితీ. దశాబ్దాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. పలువురు తమ ఎడ్లను ఈ పందేలకు సిద్ధం చేస్తున్నారు. ఈ పోటీలో పాల్గొనే ఎద్దును సంరక్షిస్తున్న రైతును గౌరవంగా చూస్తారు. ఇక ఈ పోటీలో తమ గ్రామం ఎద్దు గెలిచిందంటే.. ఆ వూరి వారి ఉత్సాహాన్ని వర్ణించలేం. గెలిచిన ఎద్దుకు గ్రామంలో మెరవణి (ఊరేగింపు) ఉంటుంది.
పండగెద్దులా మజాకా
పండుగ నెల మొదలైనప్పటి నుంచి ఎద్దుకు మంచి మేత పెడతారు. వాటి కొమ్ములను జువ్వుతారు. ఎద్దు కొమ్ములు ఎంత బాగుంటే అంత క్రేజ్. ఇలా సిద్ధం చేసిన ఎడ్లను బాగా అలంకరించి పరుగుపందేలకు తీసుకెళతారు. కొమ్ములకు రంగులు వేసి ప్రభలతో అలంకరించి బెలూన్లు కడతారు. పోటీల్లో ఎద్దుపై యువకులు దెబ్బవేసేందుకు ప్రయత్నిస్తారు కాబట్టి దానికి రక్షణగా బ్లేడులు కట్టిన పరదాలను అమరుస్తారు. కాళ్లకు గజ్జలు కట్టి, గిట్టలకు పసుపు రాసి పూజ చేస్తారు. ఈ ప్రాంతంలో 500 వరకు ఎడ్లను ఈ పందేలకు సిద్ధం చేస్తున్నారు.
పలమనేరు ప్రాంతంలో నిర్వహించే మైలేరు (ఫైల్)
పందెం ఎద్దు ధర రూ. 2 లక్షల నుంచి రూ.5 లక్షలు
పోటీలు జరిగేచోట కిక్కిరిసిన జనం మధ్య అల్లిని (నిర్ణీత ప్రదేశాన్ని) ముందుగా ఎద్దుకు చూపెడతారు. అనంతరం ఆ ఎద్దును మూడుసార్లు పరిగెత్తిస్తారు. ఈ మూడుసార్లలో సరాసరి తక్కువ సెకన్లలో గమ్యం చేరిన ఎద్దు విజేతగా నిలుస్తుంది. ఒక్కో మైలేరులో 500 నుంచి వెయ్యి వరకు ఎద్దులు పాల్గొంటాయి. ఒక్కో ఎద్దుకు ప్రవేశ రుసుము రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు ఉంది. మైలేరులో గెలుపొందిన ఎద్దు ధర అమాంతం పెరుగుతుంది. వీటిని లక్షలు పెట్టి కొనేందుకు పలువురు ముందుకొస్తారు. పలమనేరు ప్రాంతంలో మైలేరు విజేత ధర రూ.2 లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు ఉంది.
మైలేర్లకు పేరొందిన ఊళ్లు..
ఈ ప్రాంతంలో మైలేరు పండుగను గొప్పగా జరుపుకొనే ఊళ్లు చాలా ఉన్నాయి. బైరెడ్డిపల్లె, బంగారుపాళ్యం, మండీపేట కోటూరు, చెత్తపెంట, కాబ్బల్లి, కెంచనబల్ల, రామకుప్పం, మిట్టూరు, శాంతిపురం, కెనమాకులపల్లె, మల్లానూరు, నాయినూరు, గొల్లచీమనపల్లె తదితర గ్రామాల్లో మైలేర్లు నిర్వహిస్తారు. సరిహద్దులోని తమిళనాడులో బొరుగూర్, పర్చూరు (ఇక్కడ మొదటి బహుమతి లారీ, బుల్లెట్) గుడియాత్తం, ఆంబూరు, నాట్రాంపల్లె, పేర్నంబట్, పల్లికొండ, వేలూరు, క్రిష్ణగిరి, సేలం, ధర్మపురి తదితర ప్రాంతాల్లో నిర్వహిస్తారు. కర్ణాటకలోని దూలపల్లెలో ఈ పోటీ పెద్ద ఎత్తున జరుగుతుంది. దూలపల్లెలో పోటీలను తిలకించేందుకు ఆ రాష్ట్ర మంత్రులు కూడా హాజరవుతుంటారు.
Comments
Please login to add a commentAdd a comment