పీవీకే నాయుడు కాంప్లెక్స్ నమూనా
సాక్షి, నెహ్రూనగర్: గుంటూరు నగరం నడిబొడ్డున పీవీకే (పి.వెంకట కృష్ణమనాయుడు) నాయుడు కాంప్లెక్స్ నిర్మాణానికి బీజం పడింది. రూ.130 కోట్లతో అత్యాధునిక హంగులతో జీ ప్లస్ 8తో పాటు రెండు సెల్లార్ల (పార్కింగ్)తో భవన సమూదాలకు సంబంధించిన ప్లాన్‌లకు మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆమోదం తెలిపారు. మంగళవారం విజయవాడలోని ఆయన క్యాంపు కార్యాలయంలో డీఎంఏ ఎంఎం నాయక్, నగర మేయర్ కావటి మనోహర్‌నాయుడు, నగర కమిషనర్ చల్లా అనూరాధ, నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ సూపరింటెండెంట్ దాసరి శ్రీనివాసరావు, ఇన్‌చార్జి సీపీ హిమబిందుతో కలిసి పీవీకే నాయుడు మార్కెట్‌పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
పీవీకే నాయుడు మార్కెట్‌కు ఘన చరిత్ర
పి.వెంకట కృష్ణమనాయుడు (పీవీకే నాయుడు) 1945లో సుమారు ఎకర 60 సెంట్ల భూమిని గుంటూరు నగరపాలక సంస్థకు ఉచితంగా అందజేశారు. సదరు ప్రాంతంలో నగరపాలక సంస్థ షాపులు నిర్మించి వ్యాపారస్తులకు అద్దెకు ఇచ్చి వారి నుంచి అశీలు రూపంలో ఏడాదికి సుమారు రూ.20 లక్షలు వసూలు చేసేది. భవనం శిథిలావస్థకు చేరడంతో 2015లో పీవీకే నాయుడు మార్కెట్‌ను నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేశారు.
మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో భేటి అయిన డీఎంఏ ఎంఎం నాయక్, నగర మేయర్ కావటి, నగర కమిషనర్ అనూరాధ, నగరపాలక సంస్థ అధికారులు
కాంప్లెక్స్‌పై పవర్‌పాయింట్ ప్రజంటేషన్
జీ ప్లస్ 8తో పాటు గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ (ఉచితంగా)తో పాటు 11 శ్లాబులతో ఈ కాంప్లెక్ నిర్మాణానికి అవసరమైన నమూనాను ఏపీ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెట్ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు.
వ్యాపారస్తులకు రెండు ఫ్లోర్‌లు
గతంలో పీవీకే నాయుడు మార్కెట్‌లో వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులకు నూతనంగా నిర్మించే కాంప్లెక్స్‌లో రెండు ఫ్లోర్‌లు కేటాయించనున్నారు. మిగిలిన ఫ్లోర్లలో నగరపాలక సంస్థ కార్యాలయంతో పాటు, ఇతర కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్వహణకు ఇవ్వనున్నారు. ఒక్కో ఫ్లోర్ 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణం, మొత్తం 11 శ్లాబులకు కలిపి 5 లక్షలకు పైచిలుకు చదరపు అడుగుల విస్తీర్ణంలో కాంప్లెక్స్ నమూనాకు మంత్రి ఆమోదం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment