పేట్రేగిపోతున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు
హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న సింహపురి
వైఎస్సార్‌సీపీ వర్గీయులపై భౌతికదాడులు
ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసాలు
చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న పోలీసులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జరిగిన మరుసటి రోజు నుంచి జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పేట్రేగిపోయి ప్రవర్తిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా రెండు వారాలుగా జిల్లాలో టీడీపీ మూకలు సాగిస్తున్న భౌతిక దాడులు, ఆస్తుల విధ్వంసాలు, అరాచకాలు, దాషీ్టకాలతో సామాన్య ప్రజలు వణికిపోతున్నారు. ఇళ్లల్లోకి చొరబడి మహిళలనే విచక్షణ మరిచి ఆటవికంగా హింసకు పాల్పడుతున్నారు. మరో వైపు ప్రభుత్వం నిర్మించిన సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లపై శిలఫలకాల ధ్వంసాలు కొనసాగిస్తూనే ఉన్నారు.
ప్రభుత్వ స్థలాల కబ్జా సాగిస్తున్నారు. జగనన్న లేఅవుట్లలో పేదలు నిర్మించుకుంటున్న ఇళ్లను కూల్చేశారు. పారీ్టలో క్రియాశీలకంగా పనిచేసిన నేతల ఆస్తులను కాల్చి బూడిద చేశారు. వీరి ఆటవిక చర్యలను అడ్డుకునేందుకు సాహించలేక మౌనంగా రోధిస్తున్నారు. గతంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడలేదని ప్రజలు గుర్తుచేస్తున్నారు. వైఎస్సార్‌సీపీకి ఓటు వేయకపోయినా.. సంక్షేమ పథకాలు అందించారని ప్రజలు అంటున్నారు. నారా రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారా? అని మండిపడుతున్నారు.
వైఎస్సార్‌సీపీ నేత కారు అద్దాలు ధ్వంసం
వెంకటాచలం పోలీస్‌స్టేషన్ ఎదుటే వైఎస్సార్‌సీపీ కార్యకర్త దూడల మనోజ్‌కుమార్ తన కారును పోలీస్‌స్టేషన్ బయట నిలిపి లోపలికి వెళ్లారు. ఆ కారును టీడీపీ కార్యకర్తలు సండి సురేష్ బాలిబోయిన మహేష్ ధ్వంసం చేశారు. పోలీస్‌స్టేషన్ ఎదుటే ఈ ఘటన జరిగినా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది.
వీఎస్‌యూనూ వదలని మూకలు
కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరుతో సెంట్రల్ లైబ్రరీ శిలాఫలకాలను టీడీపీ నాయకులు గడ్డపారతో శిలాఫలకాలను ధ్వంసం చేశారు. దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పరిపాలనా భవనం వద్దకు చేరుకుని, ఆయన విగ్రహాన్ని భవనంలో ఎలా ఏర్పాటు చేస్తారని అధికారులతో వాగ్వాదానికి దిగారు. పరిపాలన భవనంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగించాలని, లేకుంటే తామే ధ్వంసం చేస్తామని అధికారులను హెచ్చరించారు.
నవరత్నాల బోర్డు ధ్వంసం
రామాయపట్నం గ్రామ సచివాలయంపై ఉన్న నవరత్నాల బోర్డును టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. తాడుకట్టి పైకెక్కి ధ్వంసం చేశారు.
వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై దాడి
నెల్లూరు నగరంలోని చంద్రబాబునగర్‌కు చెందిన 29వ డివిజన్ వైఎస్సార్‌సీపీ కార్యకర్త సాజిద్‌పై స్థానిక టీడీపీ కార్యకర్త హమీద్ తన అనుచరులతో కలిసి దాడి చేశారు. వీరి నుంచి తప్పించుకుని ఆస్పత్రికి వెళ్తున్న సాజిద్‌ను మార్గమధ్యలో అటకాయించి మరోమారు విచక్షణరహితంగా దాడి చేశారు. అప్పుడు కాదురా...ఇప్పుడు మిమ్మల్ని ఎవరూ కాపాడతారు.. వైఎస్సార్సీపీకి చెందిన కొందరి లిస్టు తమ వద్ద ఉందని.. వీరందరికీ ఇదే గతిపడుతుందని బెదిరించారు.
వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు
కావలి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నివాసం ముందు టీడీపీ నేతలు, కార్యకర్తలు కవి్వంపు చర్యలకు పాల్పడ్డారు. డీజే పెట్టి, బాణసంచా పేలుస్తూ రామిరెడ్డి ఇంటి గేటును కాళ్లతో తన్నుతూ వీరంగం సృష్టించారు. దగదర్తిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త కాండ్ర శ్రీనివాసులు ఇంటికి సంబంధించిన నిర్మాణాన్ని జేసీబీతో కూల్చేశారు. తడకలూరుకు చెందిన వైఎస్సార్‌సీపీ సర్పంచ్ ఆత్మకూరు గిరినాయుడిపై దాడికి తెగబడ్డారు. దీంతో గిరినాయుడి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఎంపీపీ తాళ్లూరు ప్రసాద్‌నాయుడి ఇంటి ఎదుట కవి్వంపు చర్యలకు పాల్పడి బాణసంచా కాల్చి ఇంట్లో వేశారు.
ద్విచక్ర వాహనం దహనం
కావలి నియోజకవర్గంలోని దగదర్తి మండలం యలమంచిపాడులో స్థానిక టీడీపీ నాయకులు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త షేక్ మస్తాన్‌పై దాడికి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన తల్లి షేక్ బీబీపైన కూడా దాడి చేశారు. 75 ఏళ్ల వయస్సున్న వృద్ధురాలు అనే కనికరం కూడా లేకుండా తలపైన దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. అదే రోజు తడకలూరులో టీడీపీ నాయకులు స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యకర్త యలమా వెంకటేశ్వర్లుకు చెందిన ద్విచక్ర వాహనాన్ని పెట్రోల్ పోసి తగుల బెట్టారు.
ఆర్బీకే శిలాఫలకం ధ్వంసం
ఉలవపాడు మండలం ఆత్మకూరులో నిర్మించిన రైతు భరోసా కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి వేళ ధ్వంసం చేశారు. దీంతో పాటు రూమ్ తాళాన్ని సైతం పగలగొట్టారు. రూమ్ లోపల ఉన్న ఫ్యాన్‌ను సైతం ఎత్తుకెళ్లారని, టీడీపీ కార్యకర్తలు ఈ పనిచేసి ఉండొచ్చని.. దీనిపై ఫిర్యాదు చేయనున్నామని కాంట్రాక్టర్ తెలిపారు.
వైఎస్సార్‌సీపీ నేతపై దాడి
బుచ్చిరెడ్డిపాళెం మండలం జొన్నవాడలో వైఎస్సార్‌సీపీ నేతలు గిరికృష్ణ, మురళీకృష్ణ ఇంటిపై 15 మంది టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. విచక్షణా రహితంగా కొట్టి భయానక వాతావరణాన్ని సృష్టించారు. దాదాపు 15 మందికిపైగా టీడీపీ కార్యకర్తలు బైక్‌లపై తన ఇంటి ముందు పెద్ద శబ్దాలు చేస్తూ.. బయటకు రా నీ అంతు చూస్తామంటూ బెదిరించారు. తన తల్లి గుండెజబ్బుతో బాధపడుతోందని చెప్పినా, వినిపించుకోకుండా పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి తన ఇంటిపై వేశారని తెలిపారు. అర్ధరాత్రి 11 గంటల సమయంలో మరోసారి వచ్చి కర్రలతో విచక్షణరహితంగా కొట్టారు. అంతటితో ఆగకుండా త్వరలోనే చంపేస్తామని తనను బెదిరించారు. ఈ విషయమై పోలీస్‌స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.
ట్రాక్టర్, ఆక్వా సామగ్రి దహనం
తోటపల్లిగూడూరు మండలంలోని కోడూరు పంచాయితీకి చెందిన వైఎస్సార్‌సీపీ నేత కావల్‌రెడ్డి రంగారెడ్డికి చెందిన ఓ ట్రాక్టర్, ఏయిరేటర్ల, ఇతర ఆక్వా సామగ్రిని టీడీపీ వర్గీయులు దహనం చేశారు. మాజీ మంత్రి కాకాణి సమీప బంధువైన రంగారెడ్డి గడిచిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయానికి తీవ్రంగా శ్రమించారు. ఇది గిట్టని స్థానిక టీడీపీ నాయకులే అధికార అండతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో దాదాపు రూ.50 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.
జగనన్న లేఅవుట్లోని నిర్మాణ ఇల్లు ధ్వంసం
దుత్తలూరు మండలం ఏరుకొల్లు పంచాయతీలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎస్సీలకు ఇచ్చిన జగనన్న లేఅవుట్‌లోని నిర్మాణంలో ఉన్న తొమ్మిది ఇళ్లను అదే పంచాయతీ రావిళ్లవారిపల్లికి చెందిన పిడికిటి వెంకటేశ్వర్లు జేసీబీతో ధ్వంసం చేశాడు. ఏరుకొల్లు ఎస్సీ కాలనీ సమీపంలో జగనన్న లేఅవుట్ ఏర్పాటు చేసి 36 ఇళ్లు మంజూరు చేయగా వాటిలో 20 నిర్మాణాలు చేపట్టి పునాది దశలో ఉన్నాయి. ఎస్సీ కాలనీ వాసులు వైఎస్సార్‌సీపీకి ఓటేశారని అక్కసుతో 9 ఇళ్ల నిర్మాణాలను జేసీబీతో ధ్వంసం చేశాడు. ఇదేమని ప్రశి్నస్తే మీ దిక్కున్న చోట చెప్పుకోండని బెదిరించాడని ఎస్సీ కాలనీవాసులు తెలిపారు. ధ్వంసం చేసిన తొమ్మిది ఇళ్లలో 6 కాంట్రాక్టర్ నిర్మించగా 3 ఇళ్లు సొంతంగా నిర్మించుకుంటున్నారు.
వైఎస్సార్‌సీపీ వర్గీయులపై దాడులు
చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన రోజు అనంతసారం మండలం శంకరనగరం గ్రామంలో వైఎస్సార్‌సీపీ నేత, సర్పంచ్ ఇంటి వద్ద టీడీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ నేతలపై మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారు. వారి ఇంట్లోకి టీడీపీ నేతలు చొరబడి టీవీలు, ఫ్రిజ్‌లను ధ్వంసం చేశారు. సర్పంచ్ వరలక్ష్మి నివాసం వద్ద డీజే, బాణసంచా కాల్చుతూ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించారు. టీడీపీ నేతలు సర్పంచ్ వరలక్ష్మి ఇంట్లోకి చొరబడి మారణాయుధాలతో దాడి చేశారు. సర్పంచ్‌పై దాడికి తెగబడ్డారు. ఇంట్లో చొరబడి ధ్వంసం ఆస్తులు చేశారు. ఆ పక్క ఇంట్లోనే ఉన్న సర్పంచ్ బంధువు రవికుమార్‌రెడ్డి, అడ్డుకోబోయిన ఆయన బావ మరిది నాగసునీల్‌రెడ్డి, మామ రామసుబ్బారెడ్డిపై గొడ్డలితో దాడి చేశారు. ఇంట్లోని వృద్ధులని కూడా చూడకుండా ఇద్దరు మహిళలపై దాడికి పాల్పడ్డారు.
వైఎస్సార్‌సీపీ జెండా స్థూపం ధ్వంసం
నెల్లూరు నగరంలోని 54వ డివిజన్ జనార్దన్‌రెడ్డికాలనీలో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌సీపీ జెండాను, స్థూపాన్ని, శిలాఫలకాన్ని కొందరు ధ్వంసం చేశారు. తెలుగుదేశం పార్టీ వారే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపించారు.
వైఎస్సార్‌సీపీ నేత ఇల్లు ధ్వంసం
కావలి పట్టణం 13వ వార్డు పుల్లారెడ్డినగర్‌లో వైఎస్సార్‌సీపీ నేత శ్రీనివాసులురెడ్డి ఇంటి నిర్మాణ పనులను ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు శనివారం జేసీబీతో ధ్వంసం చేశారు. రెవెన్యూ అధికారులు జారీ చేసిన పట్టా ఉన్నప్పటికీ అధికారులు ఇంటి నిర్మాణ పనులను తొలగించారు.
మహిళపై టీడీపీ కార్యకర్త దాడి
పంచాయతీ నిధులతో నిర్మించిన రచ్చబండను టీడీపీ కార్యకర్త ధ్వంసం చేస్తుండగా అడ్డుకున్న మహిళపై ఇనుప రాడ్‌తో దాడికి తెగబడిన ఘటన వెంకటాచలం మండలం కసుమూరులో జరిగింది. పది మందికి ఉపయోగపడే రచ్చబండను ధ్వంసం చేసి ఇంటి నిర్మాణం చేసుకోవడం ఏమిటని స్థానికంగా నివాసం ఉంటున్న ఉప్పు చెంగమ్మ ప్రశ్నించడంతో సదరు టీడీపీ కార్యకర్త షేక్ మస్తాన్ ఆమె తలపై రాడ్డుతో దాడి చేశాడు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మహిళపై జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment