సమావేశంలో మాట్లాడుతున్న పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్
సాక్షి, అమరావతి: ఏపీలో కాలుష్యానికి తావులేని పర్యావరణహిత పెట్టుబడులకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 2070 నాటికి కర్బన ఉద్గారాలు లేకుండా చేయాలన్న లక్ష్యంలో భాగంగా గ్రీన్ ఎనర్జీతో పాటు ఎలక్ట్రికల్ వాహన రంగాన్ని పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్)తో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ‘షేపింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది మొబిలిటీ’ పేరుతో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ వర్చువల్ సమావేశాన్ని నిర్వహించింది.
చదవండి: అరచేతిలో 87 రకాల సేవలు.. ఈ యాప్ ఉంటే మీ వెంట పోలీస్ ఉన్నట్టే!
ఇందులో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి. సృజన, ఏపీ ఈడీబీ సీఈఓ జవ్వాది సుబ్రమణ్యంలతో పాటు 60కిపైగా ఎలక్ట్రిక్ వాహన రంగానికి చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
అత్యధిక పెట్టుబడులు ఆకర్షించేలా చర్యలు
ఈ సందర్భంగా అమర్‌నాథ్ మాట్లాడుతూ.. 2025 నాటికి ఎలక్ట్రిక్ వాహన రంగంలో భారత్‌లోకి రూ.50,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారని, ఇందులో అత్యధిక భాగం రాష్ట్రానికి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకోసం మూడంచెల విధానంలో ముందుకెళ్తున్నామని, 2029 నాటికి దేశంలో అత్యధిక పెట్టుబడులు ఆకర్షించే రాష్ట్రంగా.. 2050 నాటికి అంతర్జాతీయంగా పెట్టుబడులకు అత్యంత అనువైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అమర్‌నాథ్ తెలిపారు. ఇందుకు అనుగుణంగా పారిశ్రామిక కారిడార్లలో మౌలిక వసతులు అభివృద్ధి చేస్తున్నామన్నారు.
జీడీపీ 5 శాతం పెరుగుతుంది
జవ్వాది సుబ్రమణ్యం మాట్లాడుతూ.. ఒకపక్క ఎలక్ట్రిక్ వాహన అమ్మకాలు దేశంలో గణనీయంగా పెరుగుతున్నప్పటికీ అదే సమయంలో ఏటా 20 లక్షల మంది వాయు కాలుష్యంవల్ల మరణించడం ఆందోళన కలిగించే అంశమన్నారు. గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా వీటిని అరికట్టవచ్చని, తద్వారా దేశ జీడీపీ మరో 5 శాతం పెరుగుతుందన్నారు. పెట్టుబడులకు రాష్ట్రం చాలా అనువైనదని, సింగిల్ విండో విధానంలో కేవలం 21 రోజుల్లోనే అనుమతులను మంజూరు చేస్తున్నట్లు జవ్వాది తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహంలో భాగంగా చార్జింగ్ స్టేషన్లు వంటి కీలక మౌలిక సదుపాయాల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారిస్తోందన్నారు.
2030 నాటికి గ్రీన్ ఎనర్జీ వాటా 45శాతం
ప్రస్తుతం రాష్ట్ర ఇంధన వినియోగంలో 30 శాతం వరకు సౌర, పవన విద్యుత్ నుంచి సమకూర్చుకుంటున్నామని, 2030 నాటికి గ్రీన్ ఎనర్జీ వాటాను 45 శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు విజయానంద్ తెలిపారు. ఎలక్ట్రిక్ వాహన రంగంలో రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను వినియోగించుకోవాల్సిందిగా పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి. సృజన కోరారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిక్ వాహన రంగానికి చెందిన పలువురు ప్రతినిధులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి వ్యక్తంచేశారు.
ఏపీకి నీతిఆయోగ్ సలహాదారు ప్రశంస
ఇక ఏదైనా అనుకుంటే దానిని వెంటనే చేయడంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ ముందుంటుందని సమావేశంలో నీతి ఆయోగ్ సలహాదారు సుదేందు సిన్హా ప్రశంసించారు. ఒక ఆలోచన వస్తే వెంటనే ఆచరణలో పెట్టడంలోగానీ, ఒక బృందాన్ని ఏర్పాటుచేసుకుని ప్రణాళికతో లక్ష్యాన్ని చేరడంలోగానీ ఏపీ తీరు ఆదర్శమని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఏపీ మార్గదర్శిగా నిలుస్తుందని సిన్హా అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment