
సాక్షి, అమరావతి: సంప్రదాయేతర, పునరుత్పాదక ఇంధన వనరుల విభాగం (నెడ్‌క్యాప్) రాష్ట్రంలో ఏడు ప్రాంతాల్లో పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. వీటి సామర్థ్యం 6,300 మెగావాట్లు. వీటి ఏర్పాటుకు సమగ్ర నివేదిక (డీపీఆర్) రూపొందించేందుకు నెడ్‌క్యాప్ టెండర్లు పిలిచింది. ఏడు కంపెనీలు సాంకేతిక బిడ్‌కు అర్హత సాధించాయి. త్వరలో ఆర్థిక బిడ్ తెరిచి టెండర్లు ఖరారు చేస్తామని, డీపీఆర్ ప్రక్రియ పూర్తయ్యాక నిర్మాణ పనులు చేపడతామని నెడ్‌క్యాప్ ఎండీ రమణారెడ్డి తెలిపారు.
కోతలకు అవకాశం లేకుండా..
పీక్ డిమాండ్ (ఎక్కువ వినియోగం ఉండే సమయం)లో విద్యుత్‌కు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఈ సమయంలో విద్యుత్ ఉత్పత్తి అందుబాటులో ఉంటే కోతలకు ఆస్కారం ఉండదు. సోలార్, పవన విద్యుత్ ఉత్పత్తి సమయంలో వినియోగం తక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్‌కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ కేంద్రాల నిర్మాణం ఇలా..
నీటి రిజర్వాయర్ల దగ్గర ఎత్తయిన ప్రదేశంలో ప్రత్యేకంగా నీటి నిల్వ కోసం ఓ రిజర్వాయర్‌ను నిర్మిస్తారు. కిందకు వెళ్లిన నీటిని పంపుల ద్వారా ఎగువ ప్రాంతంలో ఉన్న రిజర్వాయర్‌లోకి పంపుతారు. నాన్ పీక్ అవర్స్ (డిమాండ్ లేని సమయం)లో సౌర, పవన విద్యుత్‌తో దిగువన ఉన్న నీటిని ఎగువన ఉన్న రిజర్వాయర్‌కు తరలిస్తారు. దీనివల్ల అవసరమైనప్పుడు జల విద్యుత్‌కు అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో డిమాండ్ ఉండే సమయంలో పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది.
దీంతో ఎక్కువ ధరకు బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ను కొనే ఇబ్బంది తప్పుతుంది. సౌర, పవన విద్యుత్‌లనూ మనమే ఉపయోగించుకోవచ్చు. ఈ కేంద్రాల కాలపరిమితి దాదాపు 80 ఏళ్లు. నిర్మాణ వ్యయం తొలి 25 ఏళ్లలోనే తీరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. తర్వాత చౌకగా జలవిద్యుత్ అందుతుంది. కాగా రాష్ట్రంలో 29 ప్రాంతాల్లో 32 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ కేంద్రాల ఏర్పాటుకు అవకాశాలున్నట్లు గుర్తించారు.
ప్రాంతం | జిల్లా | సామర్థ్యం |
గండికోట రిజర్వాయర్ | వైఎస్సార్ | 600 |
అవుకు రిజర్వాయర్ | కర్నూలు | 800 |
సోమశిల రిజర్వాయర్ | నెల్లూరు | 1,200 |
చిత్రావతి రిజర్వాయర్ | అనంతపురం | 500 |
ఎర్రవరం | విశాఖపట్నం | 1,000 |
బోదూరుగెడ్డ రిజర్వాయర్ | విజయనగరం | 1,200 |
కర్రివలస | విజయనగరం | 1,000 |