బాధితుల సమస్యలు ఆలకిస్తున్న ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్
కోనేరు సెంటర్: జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం జరిగిన ప్రతి రోజు స్పందనలో ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన బాధితుల నుంచి అర్జీలు అందుకున్నారు. సమస్య ఎలాటిదైనా చట్టపరిధిలో పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రతి రోజు స్పందనలో ప్రజా సమస్యలకు పరిష్కారం దొరుకుతుండటంతో బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
చదవండి: దేవుడిలా ఆదుకున్న పోలీస్.. ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ప్రశంసలు
ఆస్తి కోసం బిడ్డలు ఇబ్బంది పెడుతున్నారంటూ వృద్ధులు, అధికకట్నం కోసం అత్తింటి వేధింపులు అధికం అయ్యాయంటూ వివాహితులు, ఉద్యోగం పేరిట మోసం చేశారంటూ నిరుద్యోగులు, ప్రేమ పేరుతో వంచన చేశారంటూ అమాయపు ఆడపిల్లలు ఇలా అనేక మంది ఫిర్యాదులు చేసేందుకు ఎస్పీ కార్యాలయంలో బారులు తీరుతున్నారు. ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ అదే స్థాయిలో స్పందిస్తూ సమస్యలు పరిష్కరిస్తుండటంతో బాధితులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
శనివారం జరిగిన ప్రతి రోజు స్పందనలో దాదాపు 25 మందికిపై బాధితులు ఎస్పీని కలిసి తమ తమ సమస్యలు చెప్పుకుని న్యాయం కోరారు. స్పందించిన ఎస్పీ బాధతులకు తప్పకుండా న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. గూడూరు మండలం పోలవరం గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు ఎస్పీని కలిసి తన ఇద్దరు కుమారులు ఆస్తి కోసం తనను అనేక అవస్థలు పెడుతున్నారని వారిపై చర్యలు తీసుకుని తనకు రక్షణ కల్పించాలని వేడుకుంది. అలాగే కోడూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తాను వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తుంటానని సరిహద్దుదారుడు తన పొలంలో పురుగుమందు పిచికారీ చేసే క్రమంలో తన పంట మొత్తం నాశనం అయిందని అదేమని అడిగితే తనపై దాడి చేసి కొట్టాడని అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు. స్పందించిన ఎస్పీ ఫిర్యాదులన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి పరిష్కరిస్తానని బాధితులకు హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment