గత టీడీపీ ప్రభుత్వం పల్స్ సర్వే పేరిట ప్రతి కుటుంబం వ్యక్తిగత వివరాలు సేకరించడానికి రెండేళ్ల సమయం తీసుకుంది. అయితే.. ప్రతి వలంటీర్ తన పరిధిలోని 50 కుటుంబాల సమాచారాన్ని రెండు నెలల్లోనే సేకరించారు.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సేవలను, సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థకు ఏడాది కాలం పూర్తయింది. ‘ఆ పనులకు ప్రత్యేకంగా వలంటీర్లు అవసరమా?’ అని విమర్శించిన ప్రతిపక్షాల నోళ్లు మూతపడేలా వలంటీర్ల వ్యవస్థ అద్భుత విజయాన్ని అందుకుంది. అన్ని రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచింది. వలంటీర్ వ్యవస్థ ఏర్పాటుతో పథకాల అమలులో మునుపెన్నడూ లేనంత వేగం పెరిగింది. దేనికీ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనేలేదు.. ప్రభుత్వ పథకం తమకు అందాలంటే చేతులు తడపాల్సిన అవసరమూ లేదు.. ఏ నాయకుడి చుట్టూ ప్రదక్షిణలూ అక్కర్లేదు. అవినీతిరహితంగా, కులమతప్రాంతాలకతీతంగా లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి సంక్షేమ పథకాలను అందించడం దేశంలోనే ఇదే ప్రథమం. ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.61 లక్షల మంది వలంటీర్లు ప్రభుత్వాన్ని ప్రజల ముంగిటకే తీసుకెళ్లారు.
4.5 కోట్ల మంది లబ్ధిదారుల ఎంపికలో..
రైతు భరోసా, అమ్మఒడి, మత్స్యకార భరోసా, కాపు నేస్తం, నేతన్న నేస్తం, జగనన్న చేదోడు, వాహనమిత్ర, జగనన్న తోడు, వైఎస్సార్ చేయూత ఇలా అనేక పథకాలకు దాదాపు 4.5 కోట్ల మంది లబ్ధిదారుల ఎంపికలో వలంటీర్లదే కీలకపాత్ర. వివిధ పథకాల ద్వారా రూ.59 వేల కోట్ల ప్రభుత్వ సాయాన్ని అందించారు. అర్హత ఉంటే పది రోజుల్లోనే పింఛన్, రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందిస్తున్నారు. వలంటీర్ల సేవలతో 10.52 లక్షల మందికి కొత్తగా పింఛన్లు, రెండు లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు మంజూరయ్యాయి.
అవ్వాతాతల కన్నీళ్లు తుడిచి..
కదల్లేని స్థితిలో ఉన్న అవ్వాతాతలు ప్రతి నెలా పింఛన్ డబ్బుల కోసం ఊళ్లో పంచాయతీ ఆఫీసు దాకా వెళ్లి అక్కడ గంటల తరబడి వేచి చూసే దుస్థితి వలంటీర్ల వ్యవస్థతో తప్పింది. ప్రతి నెలా 1న తెల్లవారుజాముకల్లా అవ్వాతాతల ఇంటి వద్దనే వలంటీర్లు డబ్బులు అందిస్తున్నారు.
కరోనాపై పోరులో వలంటీర్లదే కీలకపాత్ర
వలంటీర్లు ప్రతి ఇంటికీ వెళ్లి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఐదుసార్లు తెలుసుకున్నారు. కరోనా సోకినవారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించడంలో వలంటీర్ల కృషికి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. నిరుపేదలకు ప్రభుత్వం రూ.1,000 సాయం చేసినప్పుడు లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment