సాక్షి, విజయవాడ: అధికారంలో ఉండగా రైతుల గురించి పట్టించుకోని చంద్రబాబునాయుడు ఇప్పుడు విడ్డూరంగా మాట్లాడుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. రైతు కుటుంబంలో పుట్టి వ్యవసాయం దండగన్న బాబుకి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి చాలా వ్యత్యాసం ఉందన్నారు. టీడీపీ రైతులను మోసం చేస్తే మానవీయకోణంలో ఆలోచిస్తూ ఉదారంగా వ్యవహరిస్తున్న పార్టీ తమదన్నారు. సోమవారం విజయవాడ రైతు శిక్షణా కేంద్రంలో కృష్ణా జిల్లా ఇంచార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన జిల్లా సమీక్ష కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మరో మంత్రి కొడాలి నాని, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. మూడు గంటలపాటు సాగిన ఈ సమీక్షలో తొమ్మిది అంశాలపై చర్చించారు. జిల్లాలో అభివృద్ధి, ప్రజాసమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పలు సూచనలు ఇచ్చారు.
జిల్లాలో కురిసిన వర్షాల వల్ల, నివర్ తుపాన్ వల్ల రైతులు ఎక్కువగా నష్టపోయారని, వారిని ఆదుకోవాల్సిన భాద్యత తమపై ఉందని మంత్రులు అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిధులంతా జిల్లా అభివృద్దిపై దృష్టిపెట్టాలని సూచించారు. పంటలు నష్టపోయిన ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ 10వ తేదీకల్లా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ రోజూ వ్యవసాయశాఖ అధికారులతో జాయింట్ కలెక్టర్‌లు టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహించి ఏ ఒక్క రైతు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
రైతులను ఆదుకోవడంలో అధికారులు ఉదారంగా, మానవత్వంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి శాసనసభలో కూడా చెప్పారు కాబట్టి అధికారులు అందుకు అనుగుణంగా పనిచేయాలన్నారు. ఎన్యూమరేషన్ సక్రమంగా చేయాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. ఏ ఒక్క రైతుకు నష్టం జరగదని, నష్టపరిహారం కూడా వెంటనే అందజేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాల వల్ల ఏర్పడ్డ సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలన్నారు. రైతులను మోసం చేసిన టీడీపీకీ.. వారికి అండగా నిలుస్తున్న వైఎస్సార్ సీపీకి చాలా వ్యత్యాసం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment