
వైఎస్ జగన్‌కి కారంచేడు పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ నర్తు భాస్కరరావు కృతజ్ఞతలు తెలుపుతూ వీడియో సందేశం పంపించారు.
సాక్షి, కారంచేడు(ప్రకాశం): సీఎం వైఎస్ జగన్‌కి కారంచేడు పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ నర్తు భాస్కరరావు కృతజ్ఞతలు తెలుపుతూ మంగళవారం వీడియో సందేశం పంపించారు. డాక్టర్ భాస్కరరావు కోవిడ్ విధుల్లో ఉండగా ఏప్రిల్ 24న కరోనా సోకింది. ఆయన భార్య డాక్టర్ బొమ్మినేని భాగ్యలక్ష్మి విజయవాడ, ఆ తరువాత మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాద్ తరలించారు.
అక్కడ పరీక్షించిన వైద్యులు ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని, వాటిని మార్చాలని అందుకు రూ.1.50 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం విషయాన్ని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన మంత్రి బాలినేని విషయాన్ని ముఖ్యమంత్రికి చెప్పడంతో..భాస్కరరావు వైద్య ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని సీఎం హామీ ఇచ్చారు.
గత నెల 14న హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్‌లో ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ తరువాత సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ వీడియో రికార్డు చేసి దాన్ని భాస్కరరావు ఆయన భార్య డాక్టర్ భాగ్యలక్ష్మితో ‘సాక్షి’కి పంపించారు. వైద్య ఖర్చుల కోసం సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.