
రాజమండ్రి (తూర్పుగోదావరి జిల్లా): ఆంధ్రప్రదేశ్ వరప్రదాయినిగా పిలిచే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2022 నాటికి పూర్తవుతుందని డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ (డీడీఆర్‌పీ) చైర్మన్ ఏబీ పాండ్యా ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టులోని పలు విభాగాల్లో చేపట్టిన పనులను ప్రాజెక్టు అథారిటీ సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్‌తో పాటు ఇతర సభ్యులతో కలిసి ఆయన శుక్రవారం పరిశీలించిన విషయం తెలిసిందే. దీనిపై శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలవరం పనులపై పీపీఏ సభ్యులు, కేంద్ర జలసంఘం సభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులతో రాజమహేంద్రవరంలో ఏబీ పాండ్యా అధ్యక్షతన సమీక్ష చేశారు.
ఈ సందర్భంగా ఏ.బి. పాండ్యా మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు 48 గేట్లుకుగానూ 29 గేట్లు అమరిక పూర్తయిందని, మిగిలిన గేట్లు అమరికపై అధికారులకు పలు సూచనలు చేశామన్నారు. పోలవరం గేట్లు ప్రపంచంలోనే అతి పెద్దవిగా పేర్కొన్నారు. పోలవరంలో 52 మీటర్ల ఎత్తున స్పిల్వే పిల్లర్ల నిర్మాణం పూర్తయ్యిందని తెలిపారు. స్పిల్ వే బ్రిడ్జి 1,128 మీటర్లుకుగాను 1,105 పూర్తి చేసినట్లు తెలిపారు. 48 గేట్లకుగాను 29 గేట్లు బిగింపు పూర్తయిందని వివరించారు.
గేట్లకు హైడ్రాలిక్ సిలిండర్లు, పవర్ ప్యాక్‌లు అమర్చే పనులు వేగంగా సాగుతున్నాయని పాండ్యా తెలిపారు. పోలవరం స్పిల్ వే నిర్మాణంలో కీలకమైన 192 గడ్డర్లు అమరిక నేటితో పూర్తయిందని అధికారులు వివరించారు. ప్రధానంగా ఐదు అంశాలపై సమావేశంలో చర్చించారు. వరదల సమయంలో కోతకు గురైన ఎడమ గట్టు పరిరక్షణ విషయం కూడా చర్చకు వచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను మేఘా ఇంజినీరింగ్ సంస్థ చేపట్టిన విషయం తెలిసిందే. సమావేశంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్, జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఇంజనీర్ ఇన్ చీఫ్ సి. నారాయణ రెడ్డి , పోలవరం ప్రాజెక్ట్ ఎస్ఈ నరసింహమూర్తి, మేఘా ఇంజనీరింగ్ సంస్థ డైరెక్టర్ సీహెచ్ సుబ్బయ్య, జీఎం సతీశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.