సాక్షి, అమరావతి: చిన్నతనంలోనే స్మార్ట్ ఫోన్ను వినియోగించడం మొదలుపెట్టిన వారికి యవ్వనంలో మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయని ఓ అధ్యయనం వెల్లడించింది. స్మార్ట్‌ఫోన్ ఎంత ఆలస్యంగా అలవాటు చేసుకుంటే అంత మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆ అధ్యయనం హెచ్చరించింది.
వాషింగ్టన్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ సపియన్ ల్యాబ్స్ ‘గ్లోబల్ మైండ్ ప్రాజెక్టు’లో భాగంగా 41 దేశాల్లో 18–24 ఏళ్ల మధ్య వయసున్న 27,969 మందిపై అధ్యయనం చేసింది. వీరిలో చిన్న వయసులోనే స్మార్ట్ ఫోన్ వినియోగించడం మొదలు పెట్టిన వారి మానసిక స్థితి బలహీనంగా ఉందని పేర్కొంది.
యువకుల కంటే యువతుల్లోనే ఎక్కువ మానసిక రుగ్మతల ప్రభావాన్ని గుర్తించింది. ఉత్తర అమెరికా, యూరప్, లాటిన్ అమెరికా, ఓషియానియా, దక్షిణాసియా, ఆఫ్రికా ప్రాంతాల్లోని యువత మానసిక స్థితిగతులను 47 అంశాల ఆధారంగా లెక్కించారు.
వయసు పెరిగితే దుష్ప్రభావం తక్కువ
యువకులు 6 ఏళ్ల వయసు నుంచి ఫోన్ వాడకం మొదలు పెట్టిన వారు 42 శాతం, 18 ఏళ్ల వయసుల్లో ఫోన్ వాడకం మొదలు పెట్టిన వారిలో 36 శాతం మానసిక అనారోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు గుర్తించారు. అయితే మహిళల్లో ఆరేళ్ల వయసు నుంచి ఫోన్ వాడుతున్న వారిలో 74 శాతం, వయోజనులైన తర్వాత 46 శాతం వివిధ మానసిక సమస్యలతో బాధపడుతున్నారు.
వయసు పెరిగిన తర్వాత స్మార్ట్‌ఫోన్ వినియోగం మొదలైతే దాని దు్రష్పభావం కొంత వరకు తక్కువగా ఉన్నట్టు అధ్యయనంలో తేలింది. అలాగే పురుషుల్లో ఆత్మవిశ్వాసం, సామాజిక దృక్పథం, ఇతరులతో సానుకూల సంబంధాలు కలిగి ఉండే సామర్థ్యాలు పెరిగినట్లు, మహిళల్లో మానసిక స్థితి, స్థితప్రజ్ఞత మెరుగ్గా ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది. ముఖ్యంగా ఆత్మహత్య ఆలోచనలు, దుందుడుకు భావాలు, వాస్తవికత నుంచి వేరుగా ఉన్నారనే భావనలు గణనీయంగా తగ్గాయి.
వారంలో ఒక రాత్రి నిద్ర కోల్పోతున్నారు
స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్న 10 ఏళ్ల వయసు్కల్లో 12.5 శాతం మంది నోటిఫికేషన్లు చూసుకోవడానికి అర్ధరాత్రి మేల్కొంటున్నారు. దీంతో సగటున వారానికి ఒక రాత్రి నిద్ర కోల్పోతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. వాస్తవానికి సామాజిక మాధ్యమాల్లో రోజుకు మూడు గంటలు గడిపే కౌమారదశ పిల్లల్లో డిప్రెషన్, ఆందోళన లక్షణాలు ఎక్కువగా ఉండటంతో పాటు రెట్టింపు మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.
విద్యార్థుల్లోని 13–17 ఏళ్ల మధ్య వయసు్కల్లో దాదాపు 95 శాతం మంది సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే భారతదేశంలో సుమారు 200 మిలియన్ల మంది చిన్నారులు, తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ల వినియోగంపై అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment