వర్షాల పేరుతో రైతు నోట్లో మట్టి
బయట మార్కెట్‌లో కిలో రూ.20 దాకా ఉన్నా పండించిన రైతుకు నిరాశే
గత్యంతరం లేక పారబోసి కన్నీళ్లతో టమాట రైతన్నలు తిరుగుముఖం
మచ్చలు, తేమ సాకుతో మండీలో ‘నో సేల్’ ముద్ర వేస్తున్న వ్యాపారులు
అనంతపురం టమాట మార్కెట్‌లో మాయాజాలం
అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి చిత్తూరు జిల్లా తర్వాత అనంతపురం టమాట సాగుకు పెట్టింది పేరు. ఏటా ఖరీఫ్‌లో 35 వేల ఎకరాలు, రబీలో 20 వేల ఎకరాలు వెరసి 55 వేల ఎకరాల్లో రైతులు టమాట పండిస్తున్నారు. ఎకరాకు సగటున 15 టన్నుల దిగుబడితో ఏటా 6.5 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తోంది. ఇక్కడ పండించే టమాట ఎక్కువగా కోల్‌కతా, నాగ్‌పూర్, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌తో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుకు ఎగుమతి అవుతోంది.
వార్షిక టర్నోవర్ రూ.400 కోట్లకు పైగా ఉన్నట్లు ఉద్యానశాఖ నివేదిక వెల్లడిస్తోంది. సాధారణ పద్ధతితో ఎకరా టమాట సాగుకు రూ.40 వేల నుంచి రూ.50 వేలు ఖర్చు అవుతుండగా ట్రెల్లీస్ (కట్టెలు) విధానంలో రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడి పెడుతున్నారు. కనగానపల్లి, రామగిరి, తనకల్లు, కళ్యాణదుర్గం, బ్రహ్మసము్ర దం, కుందుర్పి, శెట్టూరు, రాయదుర్గం, ముదిగుబ్బ, నల్లచెరువు, ఓడీ చెరువు, కదిరి, పెనుకొండ, అమడగూరు, బత్తలపల్లి, ధర్మవరం, చెన్నేకొత్తపల్లి, గుంతకల్లు, కూడేరు, అనంతపురం, రాప్తాడు, శింగనమల ప్రాంతాల్లో సాగు అధికంగా ఉంది.
మార్కెట్ మాయాజాలం
అనంతపురం నగర శివారు కక్కలపల్లి వద్ద కమీషన్ ఏజెంట్లు, కొనుగోలుదారులు, దళారులు పెద్ద ఎత్తున మండీలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి 70 నుంచి 80 శాతం మంది రైతులు అమ్మకాలకు ఇక్కడికే వస్తుంటారు. కిలో కనీసం రూ.10 నుంచి రూ.12 పలికితేకానీ పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. కూలీల ఖర్చు, రవాణా, ట్రేల బాడుగ, కమీషన్ ఖర్చులు అధికంగా ఉండటంతో టమాట రైతులకు నష్టాలు తెచ్చిపెడుతున్నాయి. అయితే ఒక్కసారైనా మంచి ధరలు పలికితే బయట పడతామనే ఆశతో రైతన్నలు టమాట సాగునే నమ్ముకున్నారు.
ఇదే అదనుగా దళారులు వారి నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. బయట మార్కెట్‌లో కిలో రూ.20 వరకు విక్రయిస్తున్నా టమాటా రైతుకు తీవ్ర నిరాశే ఎదురవుతోంది. ప్రస్తుతం మండీకి రోజూ 4 వేల మెట్రిక్ టన్నుల నుంచి 4,800 మెట్రిక్ టన్నుల వరకు సరుకు వస్తోంది. ‘నో సేల్’ కింద పెట్టిన టమాటాలను చేసేదేమీ లేక రైతులు పారబోసి ఉత్త చేతులతో ఇంటి దారి పడుతున్న దుస్థితి నెలకొంది.
సోమవారం 15 కిలోల బాక్సు గరిష్ట ధర రూ.330 పలికింది. చాలా వాటిని బాక్సు రూ.150 నుంచి రూ.200 లోపే కొంటున్నారు. ఇక సీ గ్రేడ్ టమాటాలు రూ.100 వరకు పలుకుతున్నాయి. ‘నో సేల్’ వాటికి కనీస ధర కూడా ఇవ్వకుండా మండీ నిర్వాహకులు, వ్యాపారులు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు.
రగిలిన రైతన్నలు
రాప్తాడు రూరల్: నాణ్యత సాకుతో టమాటాలు కొనుగోలు చేయకపోవటాన్ని నిరసిస్తూ రైతన్నలు సోమవారం అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి మండీ వద్ద ఆందోళనకు దిగారు. సమీపంలోని 44వ నంబరు జాతీయ రహదారిపైకి చేరుకుని బైఠాయించడంతో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు లోడింగ్ కోసం బయటి వాహనాలు కాకుండా స్థానికంగా బాడుగకు తీసుకోవాలంటూ లారీ అసోసియేషన్ ప్రతినిధులు కూడా ఆందోళన నిర్వహించారు. అనంతరం పోలీసుల చొరవతో ఆందోళన విరమించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామానికి చెందిన యువ రైతు చిన్ని క్రిష్ణ 160 ట్రేల టమాటాను అనంతపురం శివారులోని కక్కలపల్లి మండీకి తెచ్చాడు.
నాణ్యత వంకతో వేలంపాట దారులు సరుకు కొనడానికి ఇష్టపడలేదు. దీంతో ఏం చేయాలో రైతుకు పాలు పోలేదు. చాలాసేపు ఎదురుచూసి చివరకు ట్రేలను మళ్లీ వాహనంలో ఎక్కించి బయట పారబోశాడు. రిక్త హస్తంతో ఇంటికి చేరాడు. ఎకరాకు రూ.50 వేల చొప్పున రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టినట్లు రైతు నిర్వేదం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment