సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా నగరాలు, పట్టణాల్లోని రోడ్లకు మరమ్మతులు చేపట్టేందుకు మునిసిపల్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వర్షాలు తగ్గిన వెంటనే పనులు ప్రారంభించేందుకు అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. గత ప్రభుత్వం మునిసిపాలిటీల్లో అసంపూర్తిగా నిర్వహించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కాలువలు, ఇతర పనుల వల్ల చిన్నపాటి వర్షాలకే రోడ్లు దెబ్బతింటున్నాయి. దీనికి తోడు గతంలో ఎన్నడూ లేనివిధంగా రెండేళ్లుగా కురుస్తున్న భారీ వర్షాలకు రహదారులు దెబ్బతిని పట్టణ ప్రాంత ప్రజలు అవస్థలు పడ్డారు.
1,500 కి.మీ. మేర మరమ్మతులు
రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభు త్వం రూ.500 కోట్లు వెచ్చించనుంది. దీన్లో విజ యవాడ, గుంటూరు, విశాఖపట్నంసహా 17 నగరపాలక సంస్థల్లో చేపట్టే పనులకు రూ.350 కోట్లు వెచ్చిస్తారు. మిగిలిన 106 స్పెషల్, సెలక్షన్, ఫస్ట్, సెకండ్, థర్డ్ గ్రేడ్ మునిసిపాలిటీలు, నగర పంచాయతీలకు రూ.150 కోట్లు కేటాయించారు. మొత్తంగా 1,500 కిలోమీటర్ల మేర రహదారులకు మరమ్మతులు చేపట్టేందుకు మునిసిపల్ ప్రజారోగ్య ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి ప్రతిపాదనల్ని సిద్ధం చేసి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు.
వర్షాలు తగ్గిన వెంటనే చేపడతాం
నగరాలు, పట్టణాల్లో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టడానికి సిద్ధమవుతున్నాం. ఈ నెలాఖరు నాటికి సాంకేతికపరమైన కార్యక్రమాలు పూర్తి చేసి.. వచ్చే నెలలో వర్షాలు తగ్గిన వెంటనే పనులు ప్రారంభిస్తాం.
– డాక్టర్ వి.చంద్రయ్య, ఈఎన్‌సీ, ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగం
Comments
Please login to add a commentAdd a comment