నవంబర్‌లో లక్షమందితో కృతజ్ఞత సభ | Representatives of APMPDO Association expressed gratitude Towards CM Jagan | Sakshi
Sakshi News home page

నవంబర్‌లో లక్షమందితో కృతజ్ఞత సభ

Published Wed, Aug 18 2021 2:56 AM | Last Updated on Wed, Aug 18 2021 8:57 AM

Representatives of APMPDO Association expressed gratitude Towards CM Jagan - Sakshi

క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను సత్కరిస్తున్న ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్, ఏపీ ఎంపీడీవోల సంఘం ప్రతినిధులు

సాక్షి, అమరావతి: దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఎంపీడీఓల పదోన్నతి సమస్యను పరిష్కరించినందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్, ఏపీ ఎంపీడీవో అసోసియేషన్‌ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఫెడరేషన్‌ చైర్మన్‌ కాకర్ల వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో వారు సీఎంను కలిసి ఆయనను ఘనంగా సత్కరించారు. అనంతరం మీడియాతో వెంకటరామిరెడ్డి మాట్లాడారు. 

పాతికేళ్ల నుంచి అపరిష్కృతంగా..
పదోన్నతులు లేకుండా ఎంపీడీవోలు పాతికేళ్లుగా ఇబ్బందులు పడుతున్నారని.. తమ ఆవేదనను సీఎం జగన్‌కు తెలుపగా సమస్యను పరిష్కరిస్తానని కొద్ది రోజుల క్రితమే హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. అన్నట్లుగానే అతితక్కువ కాలంలో ఎంపీడీవోలకు పదోన్నతులు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో దాదాపు 300 మంది ప్రమోషన్లు పొందుతున్నారని ఆయన వివరించారు. దీనివల్ల పంచాయతీరాజ్‌ శాఖలోని 13 కేడర్లకు చెందిన 2,500 మంది కిందిస్థాయి సిబ్బందికీ ప్రమోషన్ల అవకాశం కల్గిందని ఆయన తెలిపారు. మరో పదిరోజుల్లో ఉత్తర్వులు రానున్నాయన్నారు.

అలాగే, అక్టోబర్‌ 2న గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది సర్వీసులను పర్మినెంట్‌ చేస్తారని వెంకటరామిరెడ్డి చెప్పారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని అందరితో కలిపి నవంబర్‌లో లక్షమంది ప్రభుత్వోద్యోగులతో విజయవాడలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞత సభను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం కరోనాతో ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని.. పరిస్థితి మెరుగయ్యాక ఉద్యోగుల సమస్యలు, పీఆర్సీ పరిష్కరిస్తామని సీఎం జగన్‌ తమకు హామీ ఇచ్చారని.. ఆయనపై తమకు అపారమైన నమ్మకం, గౌరవం ఉన్నాయన్నారు.

నమ్మకం పోతున్న సమయంలో న్యాయం
ఏపీ రాష్ట్ర ఎంపీడీవోల అసోసియేషన్‌ అధ్యక్షులు వై. బ్రహ్మయ్య మాట్లాడుతూ.. తమలో కొంతమంది ఇప్పటికే రిటైరయ్యారని.. నమ్మకంపోతున్న ఈ సమయంలో సీఎం జగన్‌ దేవుడిలా న్యాయం చేశారని తెలిపారు. గతంలో దివంగత సీఎం వైఎస్సార్‌ తమకోసం కృషిచేశారని.. ఇప్పుడు ఆయన తనయుడు తమ కోరికలను అమలుచేశారన్నారు. ఎన్నో ఏళ్లుగా పదోన్నతులులేక ఇబ్బందులు పడ్డామని.. ఈ సమయంలో సీఎం తీసుకున్న నిర్ణయం తమకు ఎంతో సంతోషం కలిగించిందన్నారు. నిజానికి నాలుగు నెలల వ్యవధిలోనే ఫైల్‌ ఆమోదం పొందడం గొప్ప విషయమని బ్రహ్మయ్య తెలిపారు.

ఎంపీడీవోలు అందరం నూరుశాతం బాధ్యతతో పనిచేసి, ప్రజలకు ప్రభుత్వ పథకాలను చేరువ చేస్తామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఎంపీడీవోలు అందరి తరçఫున ఆయన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర ఎంపీడీవో అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ జీవీ నారాయణరెడ్డి, ఎంపీడీవోల సంఘం ప్రతినిధులు కేఎన్‌వీ ప్రసాదరావు, పెన్నా రాఘవేంద్రనాథ్, మహిళా కార్యదర్శి నాతి బుజ్జి, కే శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement