సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్: గోదావరిలో వరద ప్రవాహం మళ్లీ పెరుగుతోంది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా పెన్‌గంగ, ప్రాణహిత నదుల నుంచి గోదావరిలోకి భారీగా వరద ప్రవాహం చేరుతోంది. సోమవారం సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్దకు 4,02,581 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. రాత్రికి మరింత పెరిగే అవకాశం ఉంది. సోమవారం సాయంత్రం 6 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీలోకి 2.44 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. డెల్టా కాలువలకు 8 వేల క్యూసెక్కులు మళ్లించి.. 2.36 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
కృష్ణాలో మరింత తగ్గిన ప్రవాహం
► కృష్ణా నదిలో వరద ప్రవాహం మరింత తగ్గింది. ఆల్మట్టి, నారాయణపూర్‌ల నుంచి, విద్యుత్ కేంద్రాల ద్వారా పరిమిత స్థాయిలో ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 37,297 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రస్తుతం జలాశయంలో 215.3263 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యామ్ నీటిమట్టం 884.90 అడుగులకు చేరుకుంది. రాయలసీమ ప్రాజెక్టుల నీటి వాటా విడుదల కోసం కుడిగట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు.
► నాగార్జున సాగర్‌లోకి 15,357 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే స్థాయిలో కాలువలకు, విద్యుదుత్పత్తికి వినియోగిస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి ప్రవాహం 2,500 క్యూసెక్కులకు తగ్గింది.
► ప్రకాశం బ్యారేజీలోకి 31,630 క్యూసెక్కులు చేరుతుండగా.. డెల్టా కాలువలకు మళ్లించి.. 27,739 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment