తిరుమల: సినీ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ సోమవారం ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ కారణంగా భక్తులు సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, సామాజిక దూరం పాటిస్తూ చాలా చక్కటి దర్శనం జరిగిందన్నారు. కరోనా నుంచి ప్రజలందరూ విముక్తి కావాలని దేవ దేవుడ్ని ప్రార్ధించినట్లు ఆర్పీ పట్నాయక్ తెలిపారు. (శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ)
హంస వాహనంపై పరమహంస
తిరుమల: తిరుమలేశుని బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం రాత్రి మలయప్ప స్వామివారు హంస వాహనాన్ని అధిరోహించి సర్వవిద్యా ప్రదాయని అయిన సరస్వతీదేవి రూపంలో కటాక్షించారు. చేతిలో వీణ, విశేష దివ్యాభరణాలు, పట్టుపీతాంబరాలు ధరించారు. గుణ, అవగుణ విచక్షణా జ్ఞానానికి సంకేతమైన హంసపై పరమహంస అయిన శ్రీనివాసుడు దర్శనమివ్వడం నయనానందకరం. శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపం నుంచి రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ఏకాంతంగా హంస వాహన సేవను నిర్వహించారు. ఉదయం ఐదు శిరస్సుల శేషుడి నీడలో శ్రీకృష్ణుని రూపంలో మలయప్ప స్వామివారు కనువిందు చేశారు. శ్రీవారి ఆలయంలోని ధ్వజస్తంభం వరకు స్వామివారిని చిన్నశేష వాహనంపై ఏకాంతంగా ఊరేగించారు.
నేటి వాహన సేవల వివరాలు: బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన సోమవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు సింహ వాహనంపై, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ముత్యపు పందిరిలో స్వామివారు ఏకాంతంగా ఊరేగనున్నారు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment