సాక్షి, అమరావతి: లాజిస్టిక్ సేవల ద్వారా ఆదాయం పెంపుదలపై ఆర్టీసీ దృష్టి సారించింది. మొదటగా రాష్ట్రంలో ‘డోర్ టు డోర్’ పార్సిల్ సర్వీసు ప్రారంభించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఆర్టీసీలో సాధారణ పార్సిల్ సర్వీసు అందుబాటులో ఉంది. అంటే ఆర్టీసీలోని ఏఎన్‌ఎల్ పాయింట్‌కు వెళ్లి పార్సిల్ బుక్ చేయాలి. దాన్ని తీసుకునేవారు గమ్యస్థానంలోని ఆర్టీసీ బస్ స్టేషన్‌కు వెళ్లి తీసుకోవాలి. కాగా, ప్రస్తుతం ‘డోర్ టు డోర్’ పార్సిల్ సర్వీసు సేవలనూ ప్రవేశపెట్టాలని ఆర్టీసీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. అంటే ఆర్టీసీని సంప్రదిస్తే ఇంటివద్దకే వచ్చి పార్సిల్/కొరియర్ బుక్ చేసుకుని తీసుకెళ్తారు. గమ్యస్థానంలోనూ నిర్ణీత చిరునామాకు వెళ్లి ఆ పార్సిల్/కొరియర్‌ను అందజేస్తారు. తద్వారా తమ వాణిజ్య సేవలను మరింత విస్తరించడంతోపాటు ప్రజలకు చేరువ కావచ్చన్నది ఆర్టీసీ ఉద్దేశం. అందులో భాగంగా మొదట పార్సిల్ ‘డోర్ డెలివరీ’ సేవలను త్వరలో ప్రవేశపెట్టనుంది. తర్వాత రెండుమూడు నెలలకు ‘డోర్ పిక్ అప్’ సేవలను అందించే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి.
పార్సిల్ సేవల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి
లాజిస్టిక్ సేవల ద్వారా ఆర్టీసీకి చెప్పుకోదగ్గ ఆదాయం సమకూరుతోంది. 2019–20లో మొత్తం రూ.97.44 కోట్లు ఆదాయం వచ్చింది. కరోనా పరిస్థితులతో లాక్‌డౌన్, ఇతర ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ 2020–21లో లాజిస్టిక్ సేవల ద్వారా రూ.87.24 కోట్లు ఆదాయం రావడం విశేషం. వాటిలో పార్సిల్ సర్వీసుల ద్వారా రూ.46.42 కోట్లు, కొరియర్ సేవల ద్వారా రూ.1.78 కోట్లు, బల్క్ బుకింగ్‌ల ద్వారా రూ.0.53 కోట్లు, కాంట్రాక్టు వాహనాల ద్వారా రూ.17.31 కోట్లు, ఏజెన్సీ సేవల ద్వారా రూ.21.20 కోట్లు వచ్చాయి.
ఏజెన్సీ ద్వారా పార్సిల్ సేవలు
ఆదాయం పెరిగిన నేపథ్యంలో లాజిస్టిక్ సేవలను మెరుగుపరచాలని ఆర్టీసీ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా తమకున్న వ్యవస్థీకృత సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఈ సేవలను సమర్థంగా నిర్వర్తించవచ్చని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. మొదటగా ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా ‘డోర్ టు డోర్’ పార్సిల్/కొరియర్ సేవలను తీసుకురానుంది. మునుముందు మరిన్ని కొత్త తరహా సేవలను ప్రవేశపెట్టాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది.
ఆర్టీసీ 'డోర్ టు డోర్' పార్సిల్ సర్వీసు
Published Sat, May 1 2021 5:00 AM | Last Updated on Sat, May 1 2021 11:26 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment