కరోనా వేళ ‘సంక్షేమం’ భేష్‌ | Sajjala Ramakrishna reddy comments On Welfare Programs of CM Jagan | Sakshi
Sakshi News home page

కరోనా వేళ ‘సంక్షేమం’ భేష్‌

Published Tue, Jun 8 2021 6:14 AM | Last Updated on Tue, Jun 8 2021 6:14 AM

Sajjala Ramakrishna reddy comments On Welfare Programs of CM Jagan - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా సెకండ్‌ వేవ్‌తో దేశమంతా వణికిపోతున్న ప్రస్తుత తరుణంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేయడం అభినందనీయమని సీపీఐ ప్రతినిధులు కొనియాడారు. వీటి ద్వారా ఎంతోమంది పేద ప్రజలు లబి్ధపొందారని వారు తెలిపారు. అలాగే, కరోనా థర్డ్‌ వేవ్‌లో చిన్న పిల్లలపై ప్రభావం చూపుతుందన్న ముందస్తు అంచనాల మేరకు, పిల్లల కోసం ప్రత్యేకంగా మూడు కేర్‌ సెంటర్లు ఏర్పాటుచేయాలని సీఎం జగన్‌ ఉన్నతాధికారులను ఆదేశించటాన్ని కూడా వారు ప్రశంసించారు.

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం సీపీఐ ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయింది. ప్రజల అవసరాలు, సమస్యల ఆధారంగా ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవటాన్ని వారు కొనియాడారు. పోలవరం నిర్వాసితులకు ఇవ్వాల్సిన మొత్తాన్ని వెంటనే అందజేసి, వారికి తగిన వసతులు కల్పించాలని, పెట్రోలు ధరలు తగ్గించేందుకు సీఎం జగన్‌ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కూడా వారు విజ్ఞప్తి చేశారు. అలాగే, రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికుల ఇన్సూరెన్స్‌ క్లెయిమ్స్‌ పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేసేలా సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లాలని కూడా వారు విజ్ఞప్తి చేశారు.

సీపీఐ నేతల విన్నపాలకు సజ్జల సానుకూలంగా స్పందించి సీఎం దృష్టికి తీసుకెళ్తానని వారికి హామీ ఇచ్చారు. అంతకుముందు.. సీపీఐ నేతలు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు లేళ్ల అప్పిరెడ్డితో భేటీ అయ్యారు. సజ్జలను కలిసిన వారిలో పి. హరినాథరెడ్డి, గుజ్జుల ఓబులేసు, మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్‌ తదితరులున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement