‘2,640 గెలిచాం.. కాదని నిరూపించండి’ | Sajjala Ramakrishna Reddy Counter attack on Chandrababu Election Statement | Sakshi
Sakshi News home page

‘2,640 గెలిచాం.. కాదని నిరూపించండి’

Published Fri, Feb 12 2021 6:44 PM | Last Updated on Fri, Feb 12 2021 7:12 PM

Sajjala Ramakrishna Reddy Counter attack on Chandrababu Election Statement - Sakshi

తాడేపల్లి: ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు చంద్రబాబు పరిస్థితి ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా ఎవరో ఒకరిపై నిందలు వేయడం ఆయనకు అలవాటని చెప్పారు. ఏదైనా వైఫల్యాలను పక్క వారిపై వేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య అని తెలిపారు. కాదు కూడదు అంటే ప్రజలదే తప్పు అంటాడని పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2,640 పంచాయతీల్లో తమ మద్దతుదారులు గెలిచారని ఇది తప్పని ఎవరైనా నిరూపించండి అంటూ సవాల్‌ విసిరారు.

టీడీపీ చెప్పిన లెక్కలను తాము ప్రశ్నించామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. 1,055 స్థానాలు ఎక్కడ గెలిచారో చెప్పమని అడిగామని తెలిపారు. మిగిలిన 500 ఎక్కడ ఉన్నాయో టీడీపీ చెప్పాలని ప్రశ్నించారు. తాము నిరూపిస్తామనేసరికి చంద్రబాబు మాట మార్చాడని మండిపడ్డారు. ఇందులో ఏది నిజం..? గెలుపా.. ఎన్నికల సంఘం వైఫల్యమా..? సందేహాలు వ్యక్తం చేశారు. ఆయనకున్న అధికారాలను విచక్షణతో వాడాల్సింది పోయి ఏకపక్షంగా వ్యవహరించారని సజ్జల ఆరోపించారు. అధికార పక్షానికే కాళ్లూచేతులూ కట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మీకు ఎలా కావాలంటే అలా ఆడుతూ వచ్చాడని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీయడానికి ఎంతగా వాడుకోవాలో వాడుకున్నారని చంద్రబాబు తీరుపై సజ్జల మండిపడ్డారు. కలెక్టర్లను బెదరగొట్టారు.. ఆలయాలకు వెళ్లి మొక్కులు మొక్కారని నిమ్మగడ్డ వ్యవహారాన్ని గుర్తుచేశారు. ఎప్పుడూ జరిగే విధంగా 14-15 శాతం ఏకగ్రీవాలయ్యాయని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు.

కాదని నిరూపించండి
పంచాయతీ ఎన్నికల్లో పరువుపోవడంతో ఇప్పుడు ఉన్నట్లుండి ఎన్నికల సంఘంపై దాడి మొదలుపెట్టారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మొదటి దశ ఫలితాలు చూసి చంద్రబాబు మాట మార్చారని తెలిపారు. ఇప్పుడు ఎన్నికల సంఘంపైనే కాదు గవర్నర్‌పై కూడా ఫిర్యాదు చేశాడని పేర్కొన్నారు. కేంద్ర బలగాలు కావాలని కోరాడు.. ఐక్య రాజ్యసమితి శాంతి సైన్యం కావాలని అడగలేదు.. సంతోషమని ఎద్దేవా చేశారు. గెలిచిన తమ పార్టీ మద్దతుదారుల వివరాలతో మొత్తం ఒక వెబ్‌సైట్ కూడా అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. 2,640 పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు గెలిచారని సజ్జల ప్రకటించారు. వాటిలో చాలా వరకు ఫొటోలతో సహా వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచినట్లు వివరించారు. దానిలో ఉన్న సమాచారం తప్పని ఎవరైనా ఛాలెంజ్ చేయవచ్చని సవాల్‌ విసిరారు.

వచ్చే ఎన్నికల్లో కూడా మాదే విజయం
ఇన్ని పంచాయతీలు గెలుచుకున్నప్పటికీ వైఎస్సార్సీపీ పతనం ప్రారంభమైందని చంద్రబాబు అనడం విడ్డూరంగా ఉందన్నారు.  కింద పడి కూడా పైచేయి తనదేనని చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం ఆయనకు అలవాటేనన్నారు. మోదీని తిట్టినా హత్తుకున్నా ఆయనకే సాధ్యమని పేర్కొన్నారు. చారిత్రక కర్తవ్యమంటూ రాహుల్‌తో జతకట్టడం ఆయనకే చెల్లిందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కూడా తమ పార్టీ విజయదుందుభి మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతే రెండు మాటలు మాట్లాడవచ్చు.. మరీ ఇంతగా అబద్ధాలు చెప్పడం సరికాదని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఎవరూ వేలెత్తి చూపలేని విజయం మాదని, నమ్మితే ఎంతగా గుండెల్లో పెట్టుకుంటారని నిరూపించారని ఎన్నికల ఫలితాలపై సజ్జల తెలిపారు.

ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తే ధిక్కరణ అంటూ నోటీసులు ఇస్తున్నారని, ఇప్పటికీ రాష్ట్ర ఎన్నికల అధికారిపై తమకు గౌరవం ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తోకకుక్కను ఆడించినట్లు కనిపించిందని ఎద్దేవా చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ వెళ్లడం ఆగిపోయి 12 రోజులైందని తెలిపారు.  విశాఖ ఉక్కుపై తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నీ చెప్పారని తెలిపారు. సీఎం జగన్‌ క్షుణ్నంగా లేఖ రాశారని.. చేయాల్సినదంతా చేస్తున్నాం.. చేస్తామని చెప్పారు. ఒక ప్రభుత్వం ఏమేమి చేయాలో అన్ని చేస్తామని స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement