ఎన్టీఆర్ జిల్లా మోగులూరులో కరిగిపోతున్న ఇసుక గుట్ట
64.654 మెట్రిక్ టన్నుల ఇసుక మాయం..
ఓ టీడీపీ నాయకుడితో కలిసి అక్రమార్జనకు తెరదీసిన అధికారి..
సాక్షి నెట్‌వర్క్: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం మోగులూరు వద్ద భారీగా నిల్వ ఉంచిన ఇసుక గుట్ట నుంచి పెద్ద మొత్తంలో ఇసుక మాయమైందనే విమర్శలొస్తున్నాయి. గత ప్రభుత్వం నిల్వ చేసిన కొండలా ఉండే ఇసుక గుట్ట క్రమంగా కరిగిపోయింది. అమ్మింది కొంత.. అమ్ముకున్నది కొంత.. ఎగరేసుకుపోయింది మరికొంత.. అధికారులు చెబుతున్న లెక్కలకు.. కళ్లముందు కనిపిస్తున్న వాస్తవానికి పొంతన కుదరకపోవడం ఈ వాదనకు మరింత బలం చేకూరుస్తున్నది.
కృష్ణానది, మున్నేరులకు వచ్చే వరదలు, భారీ వర్షాల సమయంలో ఇసుక కొరత రాకూడదనే సదుద్దేశంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం మోగులూరు వద్ద భారీగా ఇసుక నిల్వ చేసింది. గత నెల 9వ తేదీకి ముందు ఇక్కడ జిల్లా మైనింగ్ అధికారులు లెక్కలు వేసి 1,39,000ల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు ఇసుకను కొలతలు వేసి లిఖితపూర్వకంగా రాసి స్థానిక అధికారులకు అప్పగించారు.
అనంతరం ఇక్కడ గత నెల 8వ తేదీన ఇసుక అమ్మకాలు ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు 44.346 మెట్రిక్ టన్నుల ఇసుక విక్రయించినట్లు అధికారులు తెలిపారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. అసలు కథ ఇక్కడే మొదలైంది. అధికారుల లెక్కల ప్రకారం చూస్తే ఇక్కడ ఇంకా 84.654 మెట్రిక్ టన్నుల ఇసుక ఉండాలి.
కానీ వాస్తవంగా ఉన్న ఇసుక సుమారు 20వేల టన్నులు మాత్రమే ఉంటుందని అధికారులు తాజాగా అంచనాకు వచ్చారు. మిగిలిన 64.654 మెట్రిక్ టన్నుల ఇసుక ఏమైందనేది ప్రశ్నార్థకం. ఇప్పటికే ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో.. ఏమాత్రం తేడా వచ్చినా అందుకు స్థానిక అధికారులదే బాధ్యత అని స్పష్టం చేయడంతో అక్రమార్కులు హడలెత్తిపోతున్నారు.
లెక్క తేలేది ఎలా?
మొదట్లో మైనింగ్ అధికారులు రెండు రోజుల పాటు స్టాక్ పాయింట్ వద్ద ఉన్న ఇసుకను కొలతలు వేశారు. అలా మరో మూడు రోజులు లెక్కలు కట్టిన తర్వాతే ఇసుక నిల్వలను ప్రకటించారు. అయితే ఇప్పుడు వారి లెక్కలకు.. ఉన్న ఇసుకకు భారీగా తేడా రావడంతో.. ఇసుక ఏమైందో అర్థంకాక అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఏది ఏమైనా మోగులూరు స్టాక్ పాయింట్ వద్ద ఇసుక ఎవరినీ బలి తీసుకుంటుందోనన్న ఆందోళనతో స్థానిక అధికారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
టీడీపీ నేతతో చేతులు కలిపిన అధికారి?
మోగులూరు స్టాక్ పాయింట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ పంచాయతీ అధికారి ఓ అధికారపార్టీ నాయకుడితో చేతులు కలిపి అక్రమార్జనకు పాల్పడ్డాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో లారీకి 20 టన్నుల ఇసుక మాత్రమే తరలించేందుకు ప్రభుత్వం అనుమతులివ్వగా.. ఆ అధికారి కాసులకు కక్కుర్తిపడి అదే లారీకి అదనంగా ఐదు బొచ్చలు ఇసుక అదనంగా నింపుతున్నాడు. ఒక బొచ్చ (2.50 మెట్రిక్ టన్నులు) రూ.700 చొప్పున ఒక లారీకి అదనంగా రూ.3,500 ఆ అధికారికి అందుతున్నాయని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment