పచ్చని పల్లెల్లో చిచ్చు రేపుతారా? | SEC Nimmagadda Ramesh made another controversial decision | Sakshi
Sakshi News home page

పచ్చని పల్లెల్లో చిచ్చు రేపుతారా?

Published Sun, Jan 24 2021 4:16 AM | Last Updated on Sun, Jan 24 2021 12:10 PM

SEC Nimmagadda Ramesh made another controversial decision - Sakshi

సాక్షి, అమరావతి:  పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటి దాకా ఉన్న సంప్రదాయాలకు భిన్నంగా ఏకంగా రాష్ట్ర ఎన్నికల కమిషనరే గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలు ప్రోత్సహించేలా మరో వివాదాస్పద నిర్ణయాన్ని ప్రకటించారు. పంచాయతీ ఎన్నికలంటే స్థానికంగా ఉండే కక్షల చుట్టూ తిరుగుతాయనే విషయం తెలిసిందే. రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా జరిగే ఈ ఎన్నికల కారణంగా గ్రామాలలో కక్షలు, కార్పణ్యాలు పెరగ కూడదని ఏకగ్రీవాలయ్యే పంచాయతీలకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో నగదు పోత్సాహకాలను ప్రకటించడం కొన్ని దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది. దానికి భిన్నంగా ఈసారి ఎన్నికల్లో గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు ఏకగ్రీవంగా ముగియడాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్కుమార్‌ తప్పుపట్టారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఓ పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవం కావడమంటేనే అక్రమాలు చోటు చేసుకున్నట్లని ఆయన అభివర్ణించారు. ఏకగ్రీవం అయ్యే వాటిపై తాను ప్రత్యేక దృష్టి సారిస్తానని, ఒక ఐజీ స్థాయిలో ఉండే అధికారి సహకారంతో ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలని ధృడ సంకల్పంతో ఉన్నట్టు ఆయన ప్రకటించడం వివాదాస్పదమైంది. 

వాస్తవాలకు తిలోదకాలు 
► ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాల వల్ల ఆయా గ్రామాల్లో ప్రజలు ఎన్నిక ఏకగ్రీవం చేసుకోవడం దిశగా మొగ్గు చూపితే, చిన్న చిన్న తగాదాలు ప్రాణాల మీదకు రావడం తగ్గుతుంది.  
► పలు గ్రామాల్లో ఎన్నికల బరిలోకి దిగడానికి చాలా మంది ఇష్టపడరు. డబ్బు ఖర్చు కావడంతో పాటు, మనస్పర్థలు వస్తాయనే భయంతో రాజకీయాలకు దూరంగా ఉంటారు. ఇలాంటి చోట్ల ఆ గ్రామ పెద్దలందరూ ఒక చోట కూర్చొని.. ఎవరు సర్పంచ్‌ అయితే బావుంటుందో ఒక నిర్ణయానికి వస్తారు. తద్వారా ప్రభుత్వం వల్ల ఆ గ్రామానికి అదనంగా వచ్చే ప్రోత్సాహక మొత్తం ఎన్నో పనులకు ఉపయోగపడుతుంది.  
► ఏకగ్రీవాలకు అవకాశం లేకుండా చేస్తే చిన్న చిన్న గ్రామాల్లో ప్రజలు గ్రూపులుగా విడిపోతారు. అప్పటివరకు కలిసిమెలిసి ఉన్న వారు సైతం ఎడమొహం, పెడమొహంతో వ్యవహరిస్తారు. ఎదురుపడినా పలకరించుకోరు. ఎన్నికలు ముగిశాక కూడా ఇదే వాతావరణం ఉంటుంది. దాంతో చిన్న పాటి విషయాలు గొడవలుగా మారే ప్రమాదం ఉంది.  
► ప్రజలు పోటీకి ఇష్టపడని చోట బలవంతంగా పోటీ చేయిస్తే, ఎన్నికల వేళ మాటా మాటా పెరిగి ఘర్షణలు చోటుచేసుకుంటే అందుకు బాధ్యులు ఎవరు? 
► ఈ రోజుల్లో ప్రజలకు రాజకీయ అవగాహన బాగా పెరిగింది. ఎవరినైనా బలవంతంగా పోటీ నుంచి తప్పిస్తే న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా తమకు జరిగిన అన్యాయం గురించి పది మందికీ తెలిసేలా చేస్తున్నారు. ఈ వాస్తవాన్ని ఎన్నికల కమిషనర్‌ విస్మరించి, ఏకగ్రీవాలను తప్పు పడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు.

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. 
గొడవలకు తావు లేకుండా ఏకగ్రీవమైన పంచాయతీకి రూ.20 లక్షల దాకా ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 2020 మార్చి 12న ఉత్తర్వులు జారీ చేసింది. 2 వేల జనాభా లోపు ఉండే గ్రామాల్లో ఎన్నిక ఏకగ్రీవం అయితే రూ.5 లక్షలు.. రెండు వేల నుంచి ఐదు వేల మధ్య జనాభా ఉండే గ్రామాల్లో ఎన్నిక ఏకగ్రీవమైతే రూ.10 లక్షలు.. ఐదు వేల నుంచి పది వేల మధ్య జనాభా ఉండే గ్రామాల్లో ఏకగ్రీవమైతే రూ.15 లక్షలు.. పది వేల జనాభా పైన ఉండే గ్రామాల్లో ఏకగ్రీవాలైతే రూ.20 లక్షలు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని 2020 మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే సమయంలో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ అభినందించారు. ఇప్పుడు అందుకు భిన్నంగా మాట్లాడటం చూస్తుంటే రాజకీయ దురుద్దేశం కనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement