విద్యార్థినుల వాష్‌రూమ్‌ల్లో సీక్రెట్ కెమెరాలు.. 300 వీడియోలు రికార్డు
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో దారుణం
ఈ ఘటన వెనుక అధికార పార్టీకి చెందిన నేతలు
కాలేజీ నిర్వాహకులు టీడీపీ ప్రముఖుల సన్నిహితులే
ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిని తండ్రి టీడీపీ నేత
కప్పిపుచ్చి పక్కదారి పట్టించేందుకు సర్కారు యత్నాలు
అర్థరాత్రి కరెంట్ ఆపేసి రహస్యంగా పోలీసుల తనిఖీలు..
స్నానాల గదుల్లో షవర్లు ఊడదీసి గుట్టుగా తరలింపు
వీడియోలు బయటకు లీకైనట్లు తల్లడిల్లుతున్న విద్యార్థినులు.. వారం క్రితమే యాజమాన్యం దృష్టికి తెచ్చినాపట్టించుకోకుండా నోరు నొక్కే యత్నాలు
ఫేక్ న్యూస్ అంటూ తొలుత బుకాయింపు.. గద్దింపులు.. బెదిరింపులు.. ప్రశ్నించిన విద్యార్థులపై ఎదురు కేసులు పెడతామంటూ హెచ్చరికలు
నిద్రాహారాలు లేకుండా వర్షంలోనూ విద్యార్థినుల ఆందోళన.. ప్రజా సంఘాల మద్దతు
న్యాయం చేయాలంటూ మంత్రిని నిలదీయడంతో కళాశాల వద్ద తీవ్ర ఉద్రిక్తత
న్యూడ్ వీడియోలు ఇతరకాలేజీల విద్యార్థుల ఫోన్లలో ప్రత్యక్షమైనట్లు మాకు ఫోన్లు చేసి చెబుతున్నారు..!! డబ్బులు తీసుకొని వీడియోలు షేర్ చేస్తున్నారు.
ఆందోళన, కేసులు అంటే మీ భవిష్యత్తు దెబ్బతింటుంది.. మీరు, మీ తల్లిదండ్రులు కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది.. సర్టిఫికెట్లు ఇవ్వరు అని బెదిరిస్తున్నారు. సీఎం చంద్రబాబు తక్షణమే వచ్చి దీనికి సమాధానం చెప్పాలి – గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినుల ఆక్రోశం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: వేలాది మంది విద్యార్థినులు చదువుతున్న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల వాష్ రూమ్‌లలో రహస్య కెమెరాలు అమర్చిన ఘటన తీవ్ర కలకలం రేపగా.. అధికార యంత్రాంగం ద్వారా దీన్ని కప్పిపుచ్చేందుకు సర్కారు విఫలయత్నం చేసింది. కాలేజీ నిర్వాహకులు టీడీపీ ప్రముఖులకు సన్నిహితులు కావడంతో దీన్ని పక్కదారి పట్టించేందుకు శతవిధాలా ప్రయత్నించింది.
వాష్ రూమ్‌లో రహస్య కెమెరాలు అమర్చి వీడియోలను చిత్రీకరించారంటూ విద్యార్థినులు గురువారం రాత్రి నుంచి నిద్రాహారాలు లేకుండా తల్లడిల్లుతుండగా.. అర్ధరాత్రి హాస్టల్‌లో విద్యుత్తు సరఫరా నిలిపివేసి పోలీసులు గుట్టుగా తనిఖీలు నిర్వహించడం.. స్నానాల గదిలో షవర్లు ఊడదీసి తరలించడం ఈ అనుమానాలకు బలం చేకూర్చుతోంది.
సీక్రెట్ కెమెరాలపై ఓ విద్యార్థిని వారం క్రితమే ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం... ఎదురు కేసులు పెడతామని బెదిరించడం.. సాహసించి మీరు ఫిర్యాదు చేసినా ఉదయానికల్లా ఆ వార్త ఫేక్ న్యూస్ అవుతుందని విద్యార్థులను వార్డెన్ హెచ్చరించడం.. మర్నాడు ఉదయం అధికారులు కూడా అది ఫేక్ న్యూస్ అని తొలుత బుకాయించడం గమనార్హం. ఇంత దారుణంజరిగితే సమస్యను చిన్నదిగా చూపేందుకు ప్రభుత్వ పెద్దలు యత్నించడం నివ్వెరపరుస్తోంది. దాదాపు 1,500 మంది విద్యార్థినులు ఉంటున్న చోట జరిగిన ఈ దారుణం వెనుక అధికార పార్టీకి చెందిన ముఖ్యులు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.
వందల వీడియోలు...!
రహస్య కెమెరాలతో ఇప్పటివరకు 300 మంది విద్యార్థినుల వీడియోలు చిత్రీకరించినట్లు తెలియడంతో గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. నిద్రాహారాలు లేకుండా వర్షంలోనూ హాస్టల్ వద్ద బైఠాయించి న్యాయం కావాలంటూ నినదించారు. తరగతులను బహిష్కరించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు బాయ్స్ హాస్టల్ వద్దకు చేరుకుని ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిని అదుపులోకి తీసుకుని ఫోన్, ల్యాప్‌టాప్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
ఒంగోలు విద్యార్థిని తండ్రికి టీడీపీ అండదండలు ఉండటంతో యాజమాన్యం వారితో కుమ్మక్కై విచారించకుండా హాస్టల్‌లో ఉంచి సకల సౌకర్యాలు కల్పిస్తోందని ఇతర విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలంటూ ఆందోళన చేస్తున్న తమను సర్టిఫికెట్లు ఇవ్వబోమని, మార్కులు వేయమని బెదిరిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
కళాశాల వద్ద ఉద్రిక్తత..
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల వద్ద విద్యార్థులు సైతం విద్యార్థినులతో కలసి ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. న్యాయం చేయాలంటూ రోడ్డు మీద బైఠాయించారు. విద్యార్థి సంఘాలు, స్వచ్ఛంద సంఘాలు వారి ఆందోళనకు మద్దతు పలకడంతో కళాశాల వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. విద్యార్థులతో కళాశాల యాజమాన్యం, పోలీసులు చర్చలు జరపగా నిందితులను కఠినంగా శిక్షిస్తేనే ఆందోళన విరమిస్తామని తేల్చి చెప్పారు.
మంత్రి కొల్లు రవీంద్ర, కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎస్పీ ఆర్.గంగా«దరరావు, ఎమ్మెల్యేలు వర్ల కుమార్‌రాజా, యార్లగడ్డ వెంకట్రావ్, కాగిత కృష్ణప్రసాద్ కళాశాల వద్దకు చేరుకుని విద్యార్థినులతో పలు దఫాలు చర్చలు జరిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కళాశాల యాజమాన్యం, వార్డెన్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇవ్వగా యాజమాన్యంపై తమకు నమ్మకం లేదని, రెండు రోజులుగా విషయం తెలిసినా కాలయాపన చేసిందని విద్యార్థినులు పేర్కొన్నారు.
గురువారం రాత్రి నుంచి భోజనం, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం చేయకుండా, వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వారంతా మెయిన్ గేట్ వద్ద బైఠాయించారు. కెమెరాలు అమర్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ విద్యార్థిని తండ్రి పలుకుబడి ఉన్న టీడీపీ నేతగా చెబుతున్నారు. అధికార పార్టీ నేత కావడంతో ఈ దారుణాన్ని కప్పిపుచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు.
వారం క్రితమే తెలిసినా..
వాష్ రూమ్‌ల్లో సీక్రెట్ కెమెరాల వ్యవహారాన్ని ఓ విద్యార్థిని వారం రోజుల క్రితమే కాలేజీ యాజమాన్యం దృష్టికి తెచ్చినా నిర్లిప్తంగా వ్యవహరించింది. ‘నిన్న సాయంత్రం 5 గంటలకు మరోసారి ఫిర్యాదు చేస్తే విచారణకు నెల సమయం కావాలన్నారు. ఫేక్ న్యూస్ అంటూ మళ్లీ రాత్రి ప్రచారం చేశారు.
యాజమాన్యం దృష్టికి తెచ్చిన విద్యార్థినిని, తండ్రిని పిలిపించండంటూ రివర్స్ కేసులు పెడతామని బెదిరించారు. మేమేం తప్పు చేశాం? ’ అని ఆ విద్యార్థిని ప్రశ్నిస్తోంది. కాగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థినిని శుక్రవారం రాత్రి 10.15 గంటలకు కళాశాల యాజమాన్యం రహస్యంగా బయటకు
పంపించేసింది.
ఆ కాలేజీ టీడీపీ నేత బంధువుదే
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ టీడీపీ నేత, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే భార్య గద్దె అనూరాధకు చెందిన బంధువుది కావడంతో పచ్చ గద్దలు రంగంలోకి దిగాయి. వాష్ రూమ్‌లలో రహస్య కెమెరాలు లేవని అధికారులతో చెప్పించే యత్నం చేశారు. విద్యార్థుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవ్వడంతో కథ అడ్డం తిరిగింది. గురువారం రాత్రి నుంచి ఈ ఘటనపై విద్యార్థులు అందోళన చేస్తున్నప్పటికీ విషయం బయటకు పొక్కకుండా ఆరోపణలు ఎదుర్కొంటున్న అమ్మాయి తండ్రి కీలక పాత్ర పోషించారు.
అమ్మాయి తండ్రికి సైతం టీడీపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందువల్ల ఆయన కాలేజీ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి, సీసీ కెమెరాల విషయాన్ని పక్క దారి పట్టించే యత్నం చేశారు. ఓ దశలో తన కూతురి జోలికి వస్తే కాలేజీ పరువు తీస్తానని హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో కాలేజీ యాజమాన్యం.. విద్యార్థిని తండ్రితో కుమ్మక్కు అయ్యింది. టీడీపీ నేతలు, అధికారులు కాలేజి వద్దకు వచ్చి కేసు తీవ్రతను తగ్గించే యత్నం చేశారు.
ఆధారాలు నేరుగా నాకు పంపండి: సీఎం చంద్రబాబు
గుడ్లవల్లేరు కళాశాల విద్యార్థినుల వద్ద ఆధారాలుంటే నేరుగా తనకే పంపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఎవరూ అధైర్య పడవద్దని, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. శుక్రవారం ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
రహస్య కెమెరాలపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇంట్లో ఆడబిడ్డకు కష్టం వస్తే ఎలా స్పందిస్తామోఅంతే సీరియస్‌గా స్పందించి నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. విద్యార్థుల ఫిర్యాదును యాజమాన్యం నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణపైనా విచారణ జరపాలన్నారు. ప్రతి మూడు గంటలకు ఒకసారి ఘటనపై తనకు రిపోర్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు.
అర్ధరాత్రి కరెంట్ ఆపేసి..
గురువారం అర్ధరాత్రి హాస్టల్‌లో విద్యుత్తు సరఫరా నిలిపివేసి కనీసం జనరేటర్ ఆన్ చేయకుండా బాత్ రూమ్‌లలో పోలీసులు తనిఖీ చేశారని విద్యార్థినులు పేర్కొంటున్నారు. బాత్ రూమ్‌లో షవర్స్ మాత్రమే ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నిస్తున్నారు. షవర్లలో రహస్య కెమెరాలున్నట్లు పేర్కొంటున్నారు.
జేఎన్‌టీయూకే బృందం విచారణ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జేఎన్‌టీయూకే అనుబంధ కళాశాల కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల బాలికల వసతి గృహంలో రహస్య కెమెరాల ఘటనపై విచారణ కమిటీని నియమించినట్లు వర్సిటీ వీసీ మురళీకృష్ణ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఎంపవర్‌మెంట్ డైరెక్టర్ యు.వి.రత్నకుమారి, ఐటీ ఇన్‌ఫ్రాస్టక్చర్ డైరెక్టర్ ఎ.ఎస్.ఎన్.చక్రవర్తి, ఇన్‌చార్జి రిజిస్ట్రార్ రవీంద్రనాథ్‌తో ఈ కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కమిటీ సభ్యులు కళాశాలకు వెళ్లి వివరాలు సేకరించి నివేదిక తయారు చేస్తారని వీసీ మురళీకృష్ణ తెలిపారు.
ప్రజా సంఘాల మద్దతు..
సాక్షి ప్రతినిధి, విజయవాడ: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఆందోళన చేస్తున్న విద్యార్థినులకు ఏబీవీపీ, వివిధ ప్రజా సంఘాల నేతలు మద్దతు పలికారు. ఏబీవీపీ జిల్లా జాయింట్ సెక్రటరీ మాగంటి వెంకట గోపి, బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు సీహెచ్ లీలాకుమారి, యువమోర్చా మహిళా జిల్లా సెక్రటరీ వి.అభినందన ఆందోళనలో పాల్గొన్నారు. వేల మంది విద్యార్థినులు ఉంటున్న హాస్టల్‌లో రహస్య కెమెరాల అంశం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తెచ్చి కారకులకు కఠిన శిక్షలు పడేవరకు పోరాడతామన్నారు.
విచారణకు నెల పడుతుందన్నారు.. తెల్లవారగానే ఫేక్ అంటున్నారు
రహస్య కెమెరాల గురించి కళాశాల యాజమాన్యానికి చెబుతున్నా పట్టించుకోలేదు. గురువారం రాత్రి గొడవ చేస్తే కళాశాల వారితోపాటు పోలీసులు వచ్చారు. దీనిపై ఫిర్యాదు చేస్తే విచారణకు నెల రోజులు పడుతుందని పోలీసులు చెప్పారు. మా వసతి గృహాల్లోని రెండు షవర్లను ఊడపీక్కుని తీసుకుపోయారు. తెల్లవారగానే అదంతా ఫేక్ న్యూస్‌గా కొట్టేశారు.
అసలు వాటిని ఎందుకు తీసుకువెళ్లారు. వాటిల్లో కెమెరాలు ఉండబట్టే కదా వారు తీసుకువెళ్లింది. అలా తీసుకువెళ్లింది కేసును తప్పుదోవ పట్టించడానికేనా?. నిఘా కెమెరాలు ఉన్నాయా.. లేదా.. అని క్లారిటీ ఇవ్వకుండా పోలీసులు సైతం అనుమానాలకు తావిచ్చేలా వ్యవహరించడం దారుణం.
విచారణ సమయంలో సైతం పోలీసులు మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. బయట అందరిలో ఒక విధంగా మాట్లాడుతున్నారు. లోపల విచారణ సమయంలో బెదిరింపులకు దిగుతున్నారు. మాపై ఎదురు కేసులు పెడతామని భయపెడుతున్నారు. మేము ఏం పాపం చేశాం. రక్షణ కోరితే ఈ విధంగా బాధపెట్టడం ఏమిటి. వీరి బెదిరింపులు ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. –కళాశాల విద్యార్థినులు
జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయండి
విద్యాసంస్థల్లో జరుగుతున్న వరుస ఘటనలపై దృష్టిపెట్టాలి
తల్లిదండ్రుల అసోసియేషన్ డిమాండ్
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, విద్యా సంస్థల్లో ఘటనలు విద్యార్థుల తల్లిదండ్రులకు తీవ్ర ఆందోళన కల్గిస్తున్నాయని, తమ బిడ్డల రక్షణకు జ్యుడిíÙయల్ కమిషన్‌ను ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల అసోసియేషన్ (ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు మలిరెడ్డి కోటారెడ్డి, అధ్యక్షుడు నరహరి శిఖరం, కార్యదర్శి జి.ఈశ్వరయ్య శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
లైంగిక దాడులు, విషాహారం, ఆరోగ్య సమస్యలు, మానసిక, శారీరక ఒత్తిళ్లు, దాడులు, ఆత్మహత్యల నుంచి విద్యార్థులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యా సంస్థలు, వసతి గృహాల్లో తమ బిడ్డలకు రక్షణ కల్పించి తమకు భరోసా ఇవ్వాలన్నారు. ఏ విద్యాసంస్థలోనైనా, హాస్టళ్లలో అయినా లైంగిక దాడులు, అనారోగ్యం, మానసిక, శారీరక ఒతిళ్లు, ఆత్మహత్యలు వంటి ఘటనలు జరిగితే సంబంధిత అధికారులు, యాజమాన్యాలను బాధ్యులను చేయాలని డిమాండ్ చేశారు.
ఇంటి ముఖం పట్టిన విద్యార్థులు
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల లేడీస్ హాస్టల్ విద్యార్థినులు భయం.. భయంగా గడుపుతున్నారు. అత్యవసరమైనప్పటికీ టాయిలెట్స్‌కు వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో విద్యార్థినులు ఇళ్లకు వెళ్లిపోతున్నారు. క్యాంపస్ నుంచి హాస్టల్‌కు 200 మీటర్ల దూరం ఉంది. పొలాల్లో ఉన్న తారు రోడ్డుపైనే విద్యార్థులు వెళ్లాల్సి ఉంది.
పొలాల్లో నాలుగు అడుగుల ఎత్తు గడ్డి మొక్కలు పెరిగాయి. పాములు, విషకీటకాలు సంచరిస్తుంటాయని, రాత్రి సమయంలో వెళ్లాలంటే భయపడుతున్నామని విద్యార్థినులు చెబుతున్నారు. హాస్టల్ కాంపౌండ్ ప్రధాన గేటుకు సైతం లైటు ఏర్పాటు చేయలేదని వాపోతున్నారు.
హోంమంత్రి రాజీనామా చేయాలి
విద్యార్థినుల హాస్టల్ వీడియోల వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తన పదవికి రాజీనామా చేయాలి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు, ఆడపిల్లలపై అకృత్యాలు మితిమీరాయి. గుడ్లవల్లేరు ఘటనపై నిష్పాక్షికంగా దర్యాప్తు చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షించాలి. – తోట సంగమేశ్వరరావు, జాతీయ కార్యదర్శి, కమ్యూనిస్టు ఇండియా
ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి
ఈ ఘటనపై టీడీపీ కూటమి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. శ్రావణ శుక్రవారం రోజున వందల మంది ఆడపిల్లల గౌరవ మర్యాదలను కాపాడే ప్రయత్నం చేయకుండా, అక్కడ అసలు ఏం జరగలేదని కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని పక్కదారి పట్టిస్తుంది. ఇంత పెద్ద ఘటన జరిగినా, కనీసం మానవత్వంతో స్పందించలేని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ బాధ్యతారాహిత్యాన్ని రాష్ట్రంలో మహిళలందరూ ముక్తకంఠంతో ఖండించాలి. – పోతిన మహేష్, వైఎస్సార్‌సీపీ నేత
సుమోటోగా విచారణ
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలోని లేడీస్ హాస్టల్ వాష్ రూమ్‌లో హిడెన్ కెమెరాలు పెట్టడం దారుణం. కళాశాలను సందర్శించి, విద్యార్థినిలతో మాట్లాడాను. ఈ ఘటనపై సుమోటోగా విచారణకు ఆదేశిస్తున్నాం. హాస్టల్‌లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని, కానీ బాత్‌రూమ్‌లో రహస్య కెమెరాలు మాత్రం పని చేస్తున్నాయని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేయాలి. – గజ్జల వెంకటలక్ష్మి, ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్
దోషులను కఠినంగా శిక్షించాలి
గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో గరల్స్ హాస్టల్ వాష్ రూమ్స్‌లో హిడెన్ కెమెరాల ఘటన అత్యంత బాధాకరం. ఇటువంటి ఘటనలు సిగ్గుతో తలదించుకునే పరిస్థితిలు కల్పిస్తున్నాయి. ఈ ఘటనకు కారణమైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టి నిందితులను శిక్షించాలి. – పురందేశ్వరి, ఎంపీ, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు
సమగ్ర దర్యాప్తు చేయాలి
గుడ్లవల్లేరు ఘటనతోపాటు రాష్ట్రంలో హాస్టళ్లు, గురుకులాల్లో జరుగుతున్న ఘటనలకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు బాధ్యత వహించాలి. హోం మంత్రిగా మహిళ ఉన్నప్పటికీ తగు చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం. – రాజు నాయక్, అధ్యక్షుడు, గిరిజన ప్రజా సంఘం
జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి
విద్యార్థినులు ఉండే హాస్టల్ బాత్‌రూమ్స్‌లో సీసీ కెమెరాలు పెట్టి వీడియోలు తీయడంపై జ్యుడిíÙయల్ ఎంక్వైరీ చేయించాలి. ఈ ఘటనను నిరసిస్తూ రాత్రి నుంచి విద్యార్థినులు ఆందోళన చేస్తున్నా యాజమాన్యానికి పట్టకపోవడం శోచనీయం. – ఆర్సీపీ రెడ్డి, సీపీఎం కృష్ణా జిల్లా నాయకుడు
అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం
ఇక్కడ ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయో స్వయంగా చూశా. ప్రస్తుతం పిల్లలు వాష్ రూమ్స్‌కు పోవాలంటే భయపడుతున్నారు. తక్షణమే న్యాయం జరగాలి. నా పిల్లలు ఇద్దరూ కూడా న్యాయవాదులే. ఈ విషయమై అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తా. – శలంకాయల లీలాకుమారి, కృష్ణా జిల్లా అధ్యక్షురాలు, బీజేవైఎం
అసలేం జరిగిందో బయట పెట్టాలి
కళాశాల ఘటనపై పూర్తి విచారణ చేపట్టాలి. రాత్రి పోలీసులు వాష్‌రూంలోని షవర్లను తీసుకువెళ్లారని విద్యార్థినులు చెబుతున్నారు. ల్యాప్‌టాప్‌లు, ఫోన్లను సీజ్ చేశామని పోలీసులు చెబుతున్నారు. వాటిలో ఏం ఉందో మహిళా అధికారులు, మహిళా నేతల ఎదుట బహిర్గత పరచాలి. – వెంకట్ గోపి, జిల్లా కార్యదర్శి, ఏబీవీపీ
దీని వెనుక ఎవరున్నా చర్యలు తీసుకోవాలి
విద్యార్థినుల వసతి గృహం ఎక్కడో పొలాల్లో చివరన ఉంది. ఎవరికి ఏం జరిగినా తెలియనంత దూరంలో ఉంది. ఇప్పుడు జరిగింది కూడా అదే. ఈ ఘటన వెనుక ఎవరున్నా వదిలిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే విద్యార్థినులకు న్యాయం జరుగుతుంది. – వీరమల్లు అభినందన, కృష్ణాజిల్లా కార్యదర్శి, బీజేవైఎం
కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్ ఘటన ప్రభుత్వ వైఫల్యమే. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యావ్యవస్థ సర్వనాశనమైంది. దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలి. విద్యావ్యవస్థను గాడిలో పెట్టాలి. – పుత్తా శివశంకర్, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతిని«ధి
ఆడపిల్లలకు రక్షణ క ల్పించాలి
లేడీస్ హాస్టల్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం దారుణం. కళాశాలలో నా మేనకోడలు కూడా విద్యనభ్యసిస్తోంది. బాత్‌రూమ్‌లో కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల కనీసం వాష్‌రూమ్‌కి కూడా వెళ్లనని ఫోన్ చేసి నా సోదరుడికి చెబుతోంది. మీరు వచ్చి తీసుకెళ్లిపోండంటూ ఏడుస్తోంది. లేదంటే చనిపోతానని చెబుతుంది. నా∙మేనకోడలికే కాదు అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్లకు న్యాయం చేయాలి. – రజనీ, అడ్వొకేట్
Comments
Please login to add a commentAdd a comment