వరద బాధితులకు నిత్యావసరాల పంపిణీలో తీవ్ర జాప్యం
రెండు రోజులుగా రోడ్లపైనే రేషన్ వాహనాలు
లోడింగ్‌లోనూ.. రూట్ మ్యాప్ ఇవ్వడంలోనూ నిర్లక్ష్యమే
తిండీతిప్పలు లేకుండా ఆకలితో అలమటించిన డ్రైవర్లు
తొలుత ఇంటింటికీ రేషన్ అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం
∙చౌక దుకాణాల వద్దే రేషన్ తీసుకోవాలన్న సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: వరద సహాయక కార్యక్రమాల్లో ఆర్భాటపు ప్రకటనలు తప్ప.. ఆచరణలో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. నిత్యావసరాల పంపిణీ విషయంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. బుధవారం సాయంత్రం సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశంలో రేపటి (గురువారం) నుంచే వరద ముంపు బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేస్తామని ప్రకటించారు. దీంతో గురువారం మొత్తం బాధితులంతా సహాయం కోసం ఎదురు చూశారు.
తీరా సాయంత్రానికి.. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియా ముందుకు వచ్చి రేపు (శుక్రవారం) ఉదయం 10 గంటల నుంచి నిత్యావసరాలు అందిస్తామని మరో ప్రకటన చేశారు. కానీ, క్షేత్ర స్థాయిలోకి వెళ్లి నిత్యావసరాలు అందించాల్సిన వాహనాలు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కూడా లోడింగ్ అవుతూనే కనిపించాయి.
రూట్‌మ్యాప్ లేకుండా ఎలా?
ఎండీయూ వాహనాలు చేరుకోవాల్సిన గమ్యస్థానాల వివరాలను వీఆర్వోలు ఇస్తారంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు చెబుతూనే ఉన్నారు. కానీ, ఉదయం 11 గంటలకు లోడింగ్ చేసుకున్న వాహనాలు రూట్‌మ్యాప్ లేక రాత్రయినా సరే ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఎండీయూ వాహనాల్లోనే రెండు లక్షల మంది లబ్ధిదారులకు ఇంటి వద్దే, వలంటీర్లు, సచివాలయ సిబ్బంది నిత్యావసరాలు అందిస్తారని ప్రభుత్వం ప్రకటించింది.
అయితే దీనికి విరుద్ధంగా శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు చౌక దుకాణాల వద్దే రేషన్ ఇస్తామని ప్రకటించడం గమనార్హం. ఇప్పటికీ చాలా కాలనీల్లో మోకాలి లోతుపైగా నీళ్లు నిలిచి ఉన్నాయి. ఇక చాలా మంది బాధితులు ఇళ్లు వదిలి వెళ్లిపోయారు. ఇలాంటి పరిస్థితులను పట్టించుకోకుండా ప్రభుత్వం నిత్యావసరాలపై నిర్ణయం తీసుకుంది. చౌకదుకాణాలే నీటమునినగిప్పుడు నిత్యావసరాలను ఎలా పంపిణీ చేస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
ఎండీయూల ఆకలి వెతలు..
వరద బాధితులకు సాయం కోసం వచ్చిన ఎండీయూ వాహనాల ఆపరేటర్లను ప్రభుత్వం గాలికొదిలేసింది. రెండు రోజులుగా తిండితిప్పలు లేక.. నీళ్లు అందించే నాథుడు లేక తీవ్ర అవస్థలు పడ్డారు. గురువారం మధ్యాహ్నం విజయవాడ నగరానికి చేరుకున్న ఎండీయూలకు శుక్రవారం సాయంత్రం వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆహారం అందలేదు. ‘సాయం చేద్దామని వచ్చాం.. మేమే వరద బాధితులుగా మిగిలాం’ అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.
చాలా మంది ఎండీయూ ఆపరేటర్లు షుగర్, బీపీ తదితర దీర్ఘకాలిక అనారోగ్య బాధితులు ఉన్నారు. ఆహారంతో పాటు మందులకు కూడా దొరక్క వారు నానా అవస్థలు పడ్డారు. దీనికితోడు వరద సహాయక చర్యలకు వచ్చిన ఎండీయూలకు ఎటువంటి రెమ్యూనరేషన్ ప్రకటించలేదు. చాలా వాటిల్లో అరకొరగానే ఆయిల్ కొట్టించి పంపించారు. సొంత ఖర్చులతో ఆయిల్ పట్టించుకుని వచ్చామని, రాకపోతే ఎక్కడ టార్గెట్ చేస్తారేమో అని భయపడ్డామని కొందరు చెప్పారు.
1,100 రేషన్ వాహనాల రాక
వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసరాల పంపిణీకి వివిధ జిల్లాల నుంచి సుమారు 1,100 ఎండీయూ(రేషన్ పంపిణీ వాహనాలు) వాహనాలను తీసుకొచ్చినట్టు సమాచారం. గురువారం మధ్యాహ్నం విజయవాడకు చేరుకున్న వాహనాలు శుక్రవారం సాయంత్రం వరకు రోడ్లపైనే దర్శనమిచ్చాయి. ఏలూరు రోడ్డు, బీఆర్‌టీఎస్ రోడ్డుకు ఇరువైపులా ఎండీయూ వాహనాలు నిలిపారు. ఒక్కో వాహనంలో 40 మంది బాధితులకు సరుకులు పంపిణీ చేసేలా విధులు కేటాయించారు.
ఇందులో 25 కిలోల బియ్యం బస్తాలు, రెండు కిలోల చొప్పున బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, కిలో చొప్పున కందిపప్పు, పంచదార, లీటర్ పామాయిల్ ప్యాకెట్లను బ్యాగుల్లో వేసి ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు. అయితే ఉదయం నుంచి ఎండీయూల్లో బియ్యం బస్తాలు లోడ్ చేసినప్పటికీ.. ఇతర నిత్యావసరాల బ్యాగులు రాలేదు. కానీ, మంత్రులు మాత్రం పత్రికల్లో వార్తల కోసం ఉత్తుత్తినే జెండాలు ఊపి వాహనాలు ప్రారంభించినట్టు చేశారని బాధితులు విమర్శిస్తున్నారు.
మంచినీళ్లు ఇచ్చే నాథుడు లేడు
ఎండీయూ వ్యవస్థ వృథా అన్నారు. వరద బాధితుల కోసం మేమే రెండు రోజులుగా రోడ్లపై పడి ఉన్నాం. గురువారం సాయంత్రం విజయవాడకు వచ్చాం. మా వాహనంలో శుక్రవారం మధ్యాహ్నమైనా సరుకులు లోడింగ్ పూర్తి కాలేదు. ఎవరిని అడగాలో తెలియడం లేదు. మాకు కనీసం అన్నం పెట్టి, – దేవదానం, ఎండీయూ ఆపరేటర్, గుంటూరు గోరంట్ల
మేమే బాధితులుగా మారాం..
బియ్యం బస్తాలు వేశారు. మిగిలిన సరుకుల సంచులు ఇవ్వలేదు. వాటిని ఇచ్చినా ఎక్కడికి వెళ్లాలో వేరే ఎవరో వచ్చి చెబుతారట. వాళ్లు ఎవరో.. ఎప్పుడొస్తారో తెలీదు. ఉదయం టిఫిన్ లేదు.. మధ్యాహ్నం భోజనం లేదు. రాత్రి నిద్రలేదు. సహాయం చేయడానికి వచ్చి మేమే వరద బాధితులుగా మారిపోయాం. – శంకర్, ఎండీయూ ఆపరేటర్, నూజివీడు
Comments
Please login to add a commentAdd a comment