వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీతోఫా చెక్కును లబ్ధిదారులకు అందజేస్తున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: పేదవాడి తలరాత మార్చే అస్త్రం చదువేనని గట్టిగా నమ్ముతూ.. మనందరి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడి గెలవాలనే చదువులు ఇవ్వడానికి సర్కారు తాపత్రయ పడుతోందన్నారు. 2022 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 4,536 మంది లబ్ధిదారులకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద రూ.38.18 కోట్ల ఆర్థిక సాయాన్ని శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్ నొక్కి జమ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పెళ్లిళ్లు చేసుకున్న పిల్లలందరికీ దేవుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా డబ్బులను వచ్చే త్రైమాసికం నుంచి పెళ్లి కూతుళ్ల తల్లుల బ్యాంకు ఖాతాల్లో వేస్తామని తెలిపారు. తల్లులను ప్రోత్సహిస్తేనే ప్లిలలు కనీసం పదో తరగతి వరకు చదువుతారనే కారణంతోనే చాలా మందితో సలహాలు, సూచనలు తీసుకున్నాకే ఇలా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పిల్లలను చదివించడానికి వెచ్చించే మొత్తం ఎంతైనా సరే ఖర్చు కింద భావించడం లేదని, దాన్ని పిల్లలకిచ్చే ఆస్తి కింద ఈ ప్రభుత్వం భావిస్తోందని స్పష్టం చేశారు. పిల్లల చదువుల కోసం ఇవాళ మనం వేసే అడుగుతో పదేళ్ల తర్వాత వారికి మంచి భవిష్యత్ ఉంటుందన్న ధృక్ఫథం, ఆలోచనతో ముందుకు సాగాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం ఇంకా ఏమన్నారంటే..
మూడు నెలలకొకమారు అమలు
– అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో పెళ్లి చేసుకున్న వారు.. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు నెల రోజుల పాటు అవకాశం ఇచ్చి, ఫిబ్రవరిలో సాయం అందిస్తున్నాం. ఏటా ప్రతి మూడు నెలలకొకసారి ఈ కార్యక్రమం జరుగుతుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో పెళ్లి చేసుకున్న వారు ఏప్రిల్ ఆఖరు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే నెలలో ప్రోత్సాహకం అందిస్తాం.
– పిల్లలు బాగుండాలనే తపన, తాపత్రయంతో ఆ కుటుంబాల్లో సభ్యుడిగా ఈ పథకానికి వయస్సుతో పాటు చదువు కూడా అర్హతగా నిబంధన విధించాం. మంచి చదువుల తర్వాత పెళ్లి చేసుకుంటే ఆ కుటుంబంలో తర్వాతి తరం ఆటోమేటిక్‌గా చదువుల బాట పట్టేలా గొప్ప సంప్రదాయానికి నాంది పలికాం. పిల్లల చదువులను ప్రోత్సహించడంతో పాటు బాల్య వివాహాలను నివారించడం, డ్రాపౌట్స్ లేకుండా బడులలో చేరే వారి శాతాన్ని పెంచే కార్యక్రమాలు చేస్తున్నాం.
ఉన్నత విద్య దిశగా అడుగులు
– వివాహానికి చెల్లెమ్మలకు కనీస వయసు 18 సంవత్సరాలు, తమ్ముళ్లకు 21 సంవత్సరాలుగా నిర్ణయించడంతో పాటు పదో తరగతి పాస్ సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాలని చెప్పాం. దీంతో ఈ ప్రోత్సాహకం ఒకటి ఉందన్న భావనతోనైనా పదో తరగతి చదవించాలన్న నిర్ణయానికి వస్తారు.
– ఆ తర్వాత.. పెళ్లికి 18 ఏళ్లు నిండాలి కాబట్టి.. ఇంటర్ మీడియట్ చదువుతారు. దీనికోసం ఎలాగూ అమ్మఒడి పథకం ఉంది. ఆ తర్వాత విద్యా దీవెన, వసతి దీవెన పథకాలున్నాయి కాబట్టి డిగ్రీ వరకు చదివించడానికి అడుగులు ముందుకు వేస్తారు. తద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు భవన నిర్మాణ కార్మికుల్లో ఆడ పిల్లలున్న కుటుంబాలకు మంచి జరుగుతుంది.
– ఉన్నత విద్య తర్వాత ఉద్యోగాల దిశగా అడుగులు వేయిస్తూ చేయి పట్టుకుని నడిపిస్తున్నాం. వీటితో పాటు ప్రపంచ స్థాయి విద్య కోసం వేరే దేశాల్లోని అత్యంత ఉత్తమ కాలేజీల్లో సీట్లు సంపాదించుకునే వారికి.. విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా రూ.1.25 కోట్ల వరకు మంజూరు చేస్తూ మద్దతుగా నిలుస్తున్నాం. సత్య నాదెళ్ల తరహాలో దేశం గర్వించదగ్గ రీతిలో వాళ్లు ఉండాలని ఈ పథకాన్ని తీసుకొచ్చాం.
– వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలతో పాటు ఈ పథకాలన్నింటినీ అమలు చేయడం ద్వారా విద్యా రంగంలో పిల్లలకు మంచి జరగాలని, వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలని అడుగులు ముందుకు వేస్తున్నాం. ఇవాళ లబ్ధి పొందిన 4,536 మందిని పారదర్శకంగా ఎంపిక చేశాం. అర్హులు ఎవరూ మిస్ కాకూడనే ఉద్దేశంతో గ్రామ సచివాలయాల్లోనే దరఖాస్తు పెట్టుకునే వెసులుబాటు కల్పించాం. మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా అక్కడే తీసుకునే అవకాశం కల్పించాం. లంచాలకు, వివక్షకు తావు లేకుండా వలంటీర్ మీ అందరి చేయిపట్టుకుని నడిపించి, సాయం చేసేలా కార్యక్రమాలు చేస్తున్నాం.
ప్రపంచంతో పోటీ పడి గెలవాలి
– ఇవాళ మన పిల్లలు వాళ్ల ఊరి పిల్లలతోనే, పక్క ఊరి పిల్లలలతోనే పోటీ పడటం లేదు. ఇవాళ ప్రపంచమంతా పోటీలో ఉంది. ప్రపంచంలో మన పిల్లలను ఎక్కడైనా సరే నిలబెట్టించి, ప్రపంచంతో పోటీ పడి గెలిచే పరిస్థితులు ఉన్న చదువులు మనం ఇవ్వగలిగితేనే వారి భవిష్యత్ బాగు పడుతుంది.
– అందుకే ఈ మూడున్నరేళ్లలో ప్రతి అడుగు ఆ దిశాగానే వేస్తున్నాం. తల్లులను ప్రోత్సహించి పిల్లలను బడికి ప్రోత్సహించేలా అమ్మఒడి పథకం నుంచి మొదలు పెడితే.. అంగన్‌వాడీలలో పిల్లలకు ఇచ్చే పౌష్టికాహారంలో నాణ్యతను పెంచుతూ సంపూర్ణ పోషణ అందిస్తున్నాం. రోజుకొక మెనూతో స్కూళ్లలో గోరుముద్ద అమలు చేస్తున్నాం.
– పిల్లలకు స్కూళ్లు తెరవగానే పుస్తకాలు, నోట్‌బుక్స్, షూస్, సాక్సులు, యూనిఫామ్‌లు, బ్యాగుతో సహా విద్యాకానుక కిట్ ఇస్తున్నాం. ఇంగ్లిష్ మీడియం, ఒక పేజీ తెలుగు, ఒక పేజీ ఇంగ్లిషుతో కూడిన బైలింగువల్ పాఠ్య పుస్తకాలు, 6 వతరగతి మొదలు ఆ పై ప్రతి తరగతిని డిజిటలైజ్ చేస్తున్నాం. నాడు–నేడు కార్యక్రమం చేపట్టిన స్కూళ్లలో ప్రతి తరగతి గదిలో ఇంటరాక్టివ్ ప్లాట్ ఫ్యానెల్స్(ఐఎఫ్‌పి)ను ఏర్పాటు చేస్తున్నాం. ఇంగ్లిష్ మీడియంతో సీబీఎస్‌ఈ సిలబస్ తీసుకొస్తున్నాం. 8వ తరగతిలోకి అడుగు పెట్టిన ప్రతి విద్యార్ధికి ట్యాబ్‌ను అందించడంతో పాటు బైజూస్ కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో కూడా పిల్లలకు చదువుకునే వెసులుబాటు కల్పించాం. నాడు–నేడుతో స్కూళ్ల రూపురేఖలను పూర్తిగా మార్పు చేస్తున్నాం.
అప్పుడు, ఇప్పుడు ఇదీ పరిస్థితి
– గతంలో పెళ్లిళ్లు చేసుకుంటే అరకొరగా సొమ్ములు ఇవ్వడంతో పాటు అవి కూడా సక్రమంగా ఇవ్వని పరిస్థితి. ఎన్నికల్లో మేలు జరగాలన్న ఉద్దేశంతో కేవలం ఫౌడర్ కోటింగ్‌లా చేశారు. 2018లో ఏకంగా 17,709 మంది పెళ్లిళ్లకు రూ.68.68 కోట్లు ఇస్తామని చెప్పి పూర్తిగా ఈ పథకానికే ఎగనామం పెట్టారు.
– గత ప్రభుత్వంలో ఎస్సీలకు రూ.40 వేలు, ఎస్టీలకు రూ.50 వేలు ప్రకటించి, ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఇవాళ మనం వారికి రూ.లక్ష వరకు పెంచి సాయం అందిస్తున్నాం. ఎస్సీలు, ఎస్టీలు కులాంతర వివాహం చేసుకుంటే గతంలో రూ.75 వేలు ఇస్తామన్న మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఇప్పుడు మనం దాన్ని రూ.1.20 లక్షలకు పెంచి అమలు చేస్తున్నాం. గతంలో బీసీలకు రూ.35 వేలు ఇస్తామని ప్రకటిస్తే.. దానిని మనం రూ.50 వేలకు పెంచి అమలు చేస్తున్నాం.
– బీసీల కులాంతర వివాహాలకు వాళ్లు రూ.50 వేలు ప్రకటిస్తే మనం రూ.75 వేలు ఇస్తున్నాం. మైనార్టీలకు గత ప్రభుత్వం రూ.50 వేలు ప్రకటిస్తే మనం రూ.లక్ష ఇస్తున్నాం. వికలాంగులకు గత ప్రభుత్వం రూ.లక్ష ఇస్తామని ప్రకటించి ఎగురగొట్టి వారికి అన్యాయం చేస్తే.. మనం ఇప్పుడు వారికి రూ.1.50 లక్షలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. భవన నిర్మాణ కార్మికులకు గత ప్రభుత్వం రూ.20 వేలు ప్రకటిస్తే.. మనం ఇప్పుడు వారికి రూ.40 వేలు ఇస్తూ శ్రీకారం చుట్టాం.
– ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, బీసీ సంక్షేమం, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి జయలక్ష్మి, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఏఎండి ఇంతియాజ్, సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ కె హర్షవర్ధన్, మైనార్టీ సంక్షేమ శాఖ డైరెక్టర్ జి సి కిషోర్ కుమార్, వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ ఎస్ షన్ మోహన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పిల్లలకు చదువు అనే ఆస్తిని మనం ఇవ్వలేకపోతే వారి జీవితాలను ఏ రకంగానూ బాగు పరచలేం. ‘మ్యారేజెస్ కెన్ వెయిట్ బట్ ఎడ్యుకేషన్ కెనాట్’ అన్నట్లు పెళ్లిళ్ల కోసం వేచి ఉండవచ్చు కానీ.. చదువు కోసం వేచి ఉండలేము అనే నానుడిని గుర్తుంచుకోవాలి. అందుకోసమే మనందరి ప్రభుత్వం పిల్లల చదువుల కోసం ఎంత ఖర్చు అయినా సరే అంటూ ఎంతగానో తాపత్రయ పడుతోంది. విప్లవాత్మక పథకాలు, కార్యక్రమాలతో చేయి పట్టుకుని నడిపిస్తోంది. ఇందులో భాగంగానే వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలకు కనీసం పదో తరగతి పాసవ్వాలంటూ నిబంధన పెట్టింది.
– ముఖ్యమంత్రి వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment