నాడు: టీడీపీ హయాం నుంచి అధ్వానంగా ఉన్న పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని మొగిలిపాడు నుంచి పలాసకు వెళ్లే రహదారి గత చిత్రమిది. వాహన చోదకులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు.
నేడు: ఇప్పుడా రోడ్డు పరిస్థితి పూర్తిగా మారింది. ప్రస్తుత ప్రభుత్వం రూ.40లక్షలతో డబుల్ లైన్ సీసీ రోడ్డు వేసింది. మొగిలిపాడు నుంచి పలాస వరకు అద్భుతమైన రోడ్డు నిర్మించింది.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రహదారుల విషయంలో ప్రతిపక్షాలు దుష్రచారం చేస్తున్నాయి. చేసిన మంచిని వదిలేసి ఇంకా ఎక్కడో మిగిలిన రోడ్లను, అవి కూడా నిర్మాణం చేపడుతున్న దశలో ఫొటోలు తీసి అటు టీడీపీ, ఇటు జనసేన రాజకీయ పక్షాలు దుష్ప్రచారానికి దిగుతున్నాయి. వారికి వత్తాసు పలుకుతూ ఎల్లో మీడియా భూతద్దంలో అబద్ధాలను చూపిస్తోంది. గత ప్రభుత్వంలో నాసిరకంగా వేసిన కొన్ని రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయి. నాటి పాలకులు కాంట్రాక్టర్లుగా అవతారమెత్తి, నాణ్యత లేని రోడ్లు వేసి వదిలేశారు. ఇప్పుడవి పాడయ్యాయి. అవి కూడా ఎల్లో మీడియాకు కనబడలేదు. వాటిని కూడా వైఎస్సార్‌సీపీ ఖాతాలో వేసి పచ్చరాతలు రాస్తున్నాయి.
టీడీపీ నేతలే కారణం..
అధికారంలోకి వచ్చాక నాలుగేళ్ల వరకు రోడ్ల జోలికి టీడీపీ ప్రభుత్వం పోలేదు. ఎన్నికలకు ముందు హడావుడిగా రోడ్లు మంజూరు చేసింది. అవి కూడా టీడీపీ కాంట్రాక్టర్లకు కట్టబెట్టింది. టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకటరావు ఫ్యామిలీ, అనుచరులే దాదాపు రోడ్లు వేశారు. కాంట్రాక్ట్‌లు దక్కించుకుని, నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలిచ్చి, నాసిరకం పనులు చేపట్టి కోట్లు కొల్లగొట్టారు. దీంతో వేసిన కొన్ని నెలలకే రోడ్లు పాడయ్యాయి. రోడ్లు కోసం ఖర్చు పెట్టిన నిధులన్నీ కాంట్రాక్టర్ల పరమయ్యాయి. టీడీపీ హయాంలో వేసిన ఏ రోడ్డు చూద్దామన్నా ఇదే దుస్థితి. ఇప్పుడు వాటిని పట్టుకుని అదే టీడీపీ నేతలు, ఎల్లోమీడియా రాద్ధాంతం చేస్తున్నారు.
‘దారి’కి తెస్తుంటే..
టీడీపీ చేసిన తప్పులను సీఎం వైఎస్ జగన్ సరిదిద్దుతున్నారు. టీడీపీ నేతల అక్రమాలకు పాడైన రోడ్లను బాగు చేస్తున్నారు. అంతేకాకుండా దశాబ్దాలుగా పాడైన రోడ్లకు మోక్షం కలిగించారు. కరోనా తదితర విపత్కర పరిస్థితులు, మరోవైపు వర్షాలు వెంటాడుతున్నా ప్రణాళికాబద్ధంగా రోడ్లు నిర్మిస్తున్నారు. ఆర్‌అండ్‌బీ పరిధిలో రూ.121.40కోట్లతో 174 రోడ్ల పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేశారు. ఇప్పటికే 70 రోడ్లు పూర్తయ్యాయి. మరో 83 రోడ్లు ప్రగతిలో ఉన్నాయి. 21 రోడ్ల పనులు ప్రారంభించాల్సి ఉంది.
పంచాయతీ రాజ్ పరిధిలో రూ.522.78 కోట్లతో 358 రోడ్లను వేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో రూ. 60 కోట్లతో 150 గిరిజన ప్రాంతాలకు తారు రోడ్లు నిర్మిస్తున్నారు. వర్షాలు పడుతుండటంతో కాస్త జాప్యం జరుగుతోంది. వర్షాల నేపథ్యంలో రోడ్లు వేస్తే మళ్లీ అవి పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇంత జరుగుతుంటే... రోడ్లన్నీ ఈ మూడేళ్లలో పాడైపోయినట్టు.. గతంలో వేసిన రోడ్లు నాసిరకంగా లేనట్టు టీడీపీ, జనసేన దుష్ప్రచారం చేస్తున్నాయి.
తస్మాత్ జాగ్రత్త..
వానా కాలంలో ఓ పార్టీ గుడ్ మార్నింగ్ సీఎం అంటూ పనిగట్టుకుని దుష్ప్రచారానికి పూనుకుంటే.. కొందరు యువకులు దాని కోసం బాగున్న రోడ్లను తవ్వేసి, రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉందంటూ ఫొటోలు తీసి పెడుతున్నారు. వీరి పట్ల కూడా జనం అప్రమత్తంగా ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment