Supreme Court Of India On YS Viveka Murder Case CBI Investigation - Sakshi
Sakshi News home page

అయినా.. సీబీఐ తీరు మారలేదు 

Published Tue, Apr 18 2023 3:14 AM | Last Updated on Tue, Apr 18 2023 3:33 PM

Supreme Court Of India On YS Viveka Case CBI Investigation - Sakshi

సాక్షి, అమరావతి: ‘న్యాయం జరగటమే కాదు. న్యాయం జరుగుతున్నట్లు కనిపించాలి’ ‘ఈ కేసులో రాజకీయ కోణాన్ని నిరూపించే ఒక్క ఆధారాన్ని కూడా సీబీఐ సేకరించలేదు. సీబీఐ దర్యాప్తు సమగ్రంగా లేదు’... ఇవీ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇటీవల రెండు సందర్భాల్లో దేశ సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు. సీబీఐ విచారణ తీరుపై ఈ వ్యాఖ్యలు చేయటంతోనే సుప్రీంకోర్టు సరిపెట్టలేదు. దర్యాప్తు ఎలా చేయాలో స్పష్టత ఇస్తూ... దర్యాప్తు అధికారిని మార్చాలని సీబీఐని ఆదేశించింది కూడా.

సీబీఐ అన్ని కోణాలనూ దర్యాప్తు చేయటం లేదని, కొందరిని దోషు­లుగా తేల్చాలన్న నిర్ణయాన్ని ముందే తీసేసుకుని దానికి తగ్గట్టుగా దర్యాప్తు చేస్తున్నట్లు కనిపిస్తోందని కేసులో నిందితుడైన శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ పిటిషన్‌ వేశారు. దానిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ పైవ్యాఖ్యలు చేసింది. దర్యాప్తు అధికారిని మార్చాలని సీబీఐని ఆదేశిస్తూ పిటిషనర్‌కు ఊరటనిచ్చింది.

దాని ప్రకారమే ఐదుగురు సభ్యుల సీబీఐ బృందం కొత్తగా ఏర్పాటైంది. కానీ మునుపటి దర్యాప్తు అధికారి ఎక్కడైతే ఆగారో అక్కడి నుంచి దర్యాప్తు చేస్తున్నట్టుగా ఈ బృందం నేరుగా వైఎస్‌ అవినాశ్‌ రెడ్డిని, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నట్టు గడిచిన రెండుమూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి.

మరి ఇలాగైతే సుప్రీంకోర్టు తీర్పువల్ల పిటిషనర్‌కు ఏం ఊరట కలిగినట్టు? అసలు పిటిషనర్‌ లేవనెత్తిన అంశాలను పరిశీలించాలన్న ఉద్దేశంతోనే కదా సుప్రీంకోర్టు కొత్త బృందాన్ని ఏర్పాటు చేయమన్నది. మరి ఆ బృందం కనీసం ఆ అంశాలవైపు చూడకుండా పాత దర్యాప్తుకు కొనసాగింపుగా చేసుకుంటూ పోతే ఏమనుకోవాలి? సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తిని సీబీఐ ఖాతరు చేయాల్సిన అవసరం లేదా? వివేకానందరెడ్డి హత్యకు బలమైన కారణాలుగా భావిస్తూ తులసమ్మ లేవనెత్తిన నాలుగు కీలక కోణాలను అసలు పట్టించుకోవడమే లేదెందుకు? ఇలాగైతే బాధ/æతులకు న్యాయం జరుగుతుందా?
 
దర్యాప్తు అసమగ్రం.. దర్యాప్తు బృందాన్ని మార్చడమే నిదర్శనం ఓ కేసులో దర్యాప్తు అధికారిని మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించడం అత్యంత అరుదు. వైఎస్‌ వివేకా హత్య కేసు దర్యాప్తులో సుప్రీంకోర్టు అటువంటి అసాధారణ నిర్ణయాన్నే తీసుకుంది. ఈ కేసు దర్యాప్తు సమగ్రంగా లేదని భావించటంతో... న్యాయసూత్రాల ఆధారంగా దర్యాప్తు ఎలా చేయాలో చెప్పటమే కాక, దర్యాప్తు అధికారిగా ఉన్న అదనపు ఎస్పీ రామ్‌సింగ్‌ను తొలగించమని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో డీఐజీ కేఆర్‌ చౌరాసియా నేతృత్వంలో ఎస్పీ వికాస్‌ సింగ్, అదనపు ఎస్పీ ముకేశ్‌ కుమార్‌లతో కొత్త బృందాన్ని సీబీఐ నియమించింది.  

పాత బృందం తప్పటడుగుజాడల్లోనే... 
పాత దర్యాప్తు బృందాన్ని మార్చమని సుప్రీంకోర్టు చెప్పిందంటేనే ... ఆ బృందం చేసిన దర్యాప్తు సక్రమంగా లేదని కదా!. వివేకాను హత్య చేసిన దస్తగిరిని అప్రూవర్‌గా మార్చి, అతని వాంగ్మూలం ఆధారంగానే పాత దర్యాప్తు బృందం విచారణ కొనసాగించింది. ఆ దర్యాప్తు నివేదికలో ఎలాంటి ఆధారాలూ లేవని సుప్రీంకోర్టు చెప్పింది. దానర్థం అప్పటివరకు దర్యాప్తులో పట్టించుకోని కొత్త కోణాలను గుర్తించి, తగిన సాక్ష్యాలను సేకరించమని సుప్రీం కోర్టు చెప్పినట్టే కదా!. కానీ అది సీబీఐకి వినిపించలేదు. సీబీఐ కొత్త దర్యాప్తు బృందం కూడా హంతకుడైన దస్తగిరి వాంగ్మూలం చూట్టూనే దర్యాప్తును పరిమితం చేస్తోంది. అసలు వాస్తవాల జోలికి పోవటమే లేదు. దానికి తార్కాణాలివిగో... 

కనీసం విచారించకుండానే అరెస్టులా...!? 
ఉదయ్‌ కుమార్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డిలను సీఐబీ అరెస్టు చేసిన తీరు సహజ న్యాయసూత్రాలకు పూర్తిగా విరుద్ధం. ఎందుకంటే ఏ నిందితుడినైనా విచారించకముందు అరెస్టు చేయటమనేది ఉండదు. కానీ ఈ దర్యాప్తు బృందం వారిని విచారించకుండానే అరెస్టు చేసేసింది. తాను విచారణకు సిద్ధంగా ఉన్నానని, పూర్తిగా సహకరిస్తానని భాస్కర్‌రెడ్డి మొదటి నుంచీ చెబుతున్నారు. పాత దర్యాప్తు బృందం ఓసారి ఆయన్ను విచారణకు రావాలని ఫోన్‌ చేసి పిలిచింది. దాంతో కడప జైలు వద్ద సీబీఐ అధికారుల కార్యాలయానికి వెళ్లారు. చాలాసేపు నిరీక్షించినా సీబీఐ ఆయన్ని విచారణకు పిలవ లేదు. పైగా నోటీసులివ్వకుండా ఎందుకు వచ్చారన్నట్టు మాట్లాడారు. వైఎస్‌ భాస్కర్‌రెడ్డి పుట్టినరోజు, పెళ్లి రోజు ఒకేరోజు. గత 20ఏళ్లుగా ఆ రోజున తీర్థయాత్రకు వెళుతున్నారు.

ఈ ఏడాది కూడా సీబీఐ అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకుని వెళ్లారు. అంటే సీబీఐ అధికారుల విచారణకు ఆయన మొదటి నుంచీ పూర్తిగా సహకరిస్తూనే ఉన్నారు. అటువంటి భాస్కర్‌రెడ్డిని కొత్త దర్యాప్తు బృందం కనీసం విచారించకుండానే నేరుగా వచ్చి అరెస్టు చేయడం విస్మయపరుస్తోంది. నోటీసులిచ్చి విచారించిన తరువాతే తదుపరి చర్యలు తీసుకోవాలన్న కనీస నిబంధనను కూడా పట్టించుకోలేదు. పైగా ఆయన విచారణకు సహకరించడం లేదని కోర్టులో చెప్పటం చూస్తే... విచారణ ఏ రీతిన సాగుతోందో అర్థమవుతుంది. అసలు ఆయన్ని విచారించేందుకు నోటీసే ఇవ్వని సీఐబీ ఆయన విచారణకు సహకరించడం లేదని ఎలా చెబుతుంది? పైగా వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని ఏకపక్షంగా అరెస్టు చేశాక.. విచారణ కోసం 10 రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరడం ఉద్దేశపూర్వకంగా వేధించటానికేనని స్పష్టంకాక మానదు.  

– ఉదయ్‌ కుమార్‌రెడ్డిని కూడా అదే రీతిలో... 
ఈ కేసులో ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి ప్రమేయం ఉన్నట్టుగా చెప్పాలని దర్యాప్తులో భాగంగా రామ్‌సింగ్‌ తనను వేధించారని గతంలో ఉదయ్‌కుమార్‌ రెడ్డి ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలో కొత్త దర్యాప్తు బృందం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని ఎవరైనా భావిస్తారు. కానీ కొత్త బృందం ఉదయ్‌ని కనీసం విచారించకుండా... ఆయన ఆరోపణకు ఆధారం ఏమిటో అడగకుండా పులివెందులలోని ఆయన ఇంటికి నేరుగా వచ్చి... తమతో కడప రావాలని చెప్పి దార్లో అరెస్టు చేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌కు తరలించారు. 

ఒక్క కొత్త ఆధారాన్ని సేకరించనే లేదు...  
సుప్రీం కోర్టు కొత్త దర్యాప్తు బృందాన్ని నియమించమని ఆదేశించిందంటే... పాత దర్యాప్తు బృందం సరిగా విచారించ లేదని తేల్చినట్టే. కాబట్టి కొత్త బృందం ఈ కేసులో అప్పటివరకు విస్మరించిన కోణాలేమైనా ఉంటే వాటిని పరిశీలించాలి. అప్పటివరకు వెలుగుచూడని సాక్ష్యాలుంటే వెలికితీయాలి. కానీ డీఐజీ చౌరాసియా నేతృత్వంలో బృందం ఈ అంశాలు వేటినీ పట్టించుకోనే లేదు. ఈ కేసులో ఒక్క కొత్త ఆధారాన్నీ సేకరించలేదు. సాక్షులెవరినీ విచారించనేలేదు. అంతకుముందు రామ్‌సింగ్‌ బృందం ఏకపక్షంగా చేసిన దర్యాప్తునకు కొనసాగింపుగానే వ్యవహరిస్తోంది. ఆ తప్పటడుగుల్లోనే నడుస్తోంది. అంటే సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తిని బేఖాతరు చేస్తోంది.  

రాజకీయ కోణానికి ఆధారాలేవి? 
వివేకా హత్య వెనుక రాజకీయ కోణం ఉందని నిరూపించే ఒక్క ఆధారాన్నీ సీబీఐ చూపించలేకపోయిందని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. కొత్త దర్యాప్తు బృందం కూడా ఆ దిశగా ఒక్క సాక్ష్యాన్ని కూడా సేకరించనే లేదు. కానీ భాస్కర్‌రెడ్డి అరెస్టు రిమాండ్‌ రిపోర్ట్‌లో మాత్రం రాజకీయ అంశాలను ఏకపక్షంగా ప్రస్తావించేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన వైఎస్‌ వివేకానందరెడ్డి గతంలో భాస్కర్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారని పేర్కొనడం హాస్యాస్పదమే. పాత బృందం ఇదే మాట అంటే అసలు రాజకీయ కోణం ఉన్నదనడానికి ఆధారాలేవని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దానికి ఒక్క ఆధారమూ చూపకుండానే ఈ బృందం కూడా అవే వ్యాఖ్యలను ఏకంగా రిమాండ్‌ రిపోర్టులో ప్రస్తావించిందంటే ఏమనుకోవాలి? 

భాస్కర్‌రెడ్డికి వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యమూ లేదు... 
ఈ కేసులో భాస్కర్‌రెడ్డికి వ్యతిరేకంగా ఒక్కరు కూడా సాక్ష్యం చెప్పనే లేదన్నది కీలకం. పైగా వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిల ప్రమేయం ఉనట్టుగా చెప్పాలని తమను సీబీఐ వేధిస్తోందని పలువురు సాక్షులు పేర్కొన్నారు. భాస్కర్‌రెడ్డిని ఏ ప్రాతిపదికన అరెస్టు చేశారంటే... దస్తగిరి అప్రూవర్‌గా ఇచ్చిన వాంగ్మూలాన్నే చూపిస్తుండటం చిత్రాతిచిత్రం. ఎందుకంటే వివేకానందరెడ్డిని స్వయంగా హత్యచేసింది దస్తగిరి. ‘నేనే నరికి చంపా’ అని అంగీకరించింది దస్తగిరి. అలాంటి దస్తగిరిని అప్రూవర్‌గా మార్చడమే సీబీఐ చేసిన పెద్ద పొరపాటు.

ఇక దస్తగిరిని ఢిల్లీ తీసుకువెళ్లి చిత్రహింసలు పెట్టి మరీ అప్రూవర్‌గా మార్చారని ఈ కేసులో మరో నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి గతంలోనే చెప్పారు. మరోవైపు ఈ కేసులో ఇతర నిందితులను అరెస్టు చేస్తూ... వారికి బెయిల్‌ ఇవ్వడానికి వీల్లేదని వాదిస్తున్న సీబీఐ... వివేకానందరెడ్డిని స్వయంగా హత్యచేశానని ఒప్పుకున్న నిందితుడు దస్తగిరి బెయిల్‌ పిటీషన్‌ను వ్యతిరేకించకపోవడం విడ్డూరమే. ఈ అంశాలన్నింటినీ కొత్త దర్యాప్తు బృందం కనీసం విశ్లేషించనే లేదు. హంతకుడైన దస్తగిరి బయట తిరుగుతుంటే... అప్రూవర్‌గా అతనిచ్చిన అహేతుకమైన వాంగ్మూలం ఆధారంగా పలువురిని అరెస్టు చేస్తుండటమే విస్మయకరం.  

ఆ నాలుగు కోణాల్లో దర్యాప్తే చేయని సీబీఐ!
ఈ కేసులో సీబీఐ అరెస్టు చేసిన శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ కీలకమైన నాలుగు అంశాలను ప్రస్తావిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ కోణాల్లో దర్యాప్తు జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్న ఆమె వాదనను న్యాయస్థానం నమోదు చేసింది కూడా. ఆమె లేవనెత్తిన అంశాలు ఇవీ... 
1. వైఎస్‌ వివేకానందరెడ్డి రెండో వివాహంతో ఆ కుటుంబంలో ఆర్థిక విభేదాలు తలెత్తాయి.  
2. వివేకానందరెడ్డికి కొందరితో ఉన్న ఆర్థిక లావాదేవీలు, సెటిల్‌మెంట్‌ వ్యవహారాలున్నాయి.  
3. వివేకానందరెడ్డి అక్రమ లైంగిక సంబంధాలున్నాయి. దీనిపై ఆయన పట్ల కొందరు వ్యక్తిగత కక్ష పెంచుకున్నారు.  
4. వివేకా రాజకీయ వారసత్వం కోసం ఆయన సొంత కుటుంబ సభ్యుల మధ్య విభేదాలున్నాయి.  
కాకపోతే ఈ అంశాలపై కొత్త సీబీఐ బృందం కనీసం దృష్టి కూడా  పెట్టలేదు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement