
సాక్షి, అమరావతి:తెలంగాణలో ఓటు వేసిన వారు ఏపీలో ఓటు వేయకుండా ఎన్నికల కమిషన్ కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాలని మంత్రి మేరుగు నాగార్జున, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డితో కూడిన వైఎస్సార్‌సీపీ ప్రతినిధుల బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్‌కు విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్‌లో ఓటు వేసిన వారు ఏపీలో ఓటు వేసేందుకు సిద్ధంగా ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.
రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనాను కలిసి ఓటర్ల నమోదుకు సంబంధించి టీడీపీ చేస్తున్న అక్రమాలపై మంగళవారం ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో టీడీపీ, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీకి సంబంధించి ఓటర్ల నమోదు, రిజిస్ట్రేషన్ డ్రైవ్ నిర్వహించడంపై ఫిర్యాదు చేసి, ఆధారాలు సమర్పించారు. మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు హైదరాబాద్ ప్రగతి నగర్‌లో బ్యానర్లు కట్టి మరి ఓటర్ల రిజిస్ట్రేషన్ చేస్తున్నారని వివరించారు.
ఎమ్మెల్యే లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. మాజీ ఎన్నికల కమిషనర్ రమేషు్కమార్ సిటిజన్ ఫర్ డెమోక్రసీ పేరుతో సంస్థ పెట్టి, దానికి కార్యదర్శిగా ఉంటూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో లేని వారిని తీసుకువచ్చి టీడీపీ ఇక్కడ ఓటర్లుగా చేర్పిస్తోందన్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.