
సాక్షి, ప్రతినిధి, గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబు నీచ రాజకీయ చరిత్రలో మరో పేజీ ఇది. రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా రాజకీయానికి వాడుకొనే ఆయన.. బాపట్ల జిల్లాలో జరిగిన బాలుడి హత్యనూ అందుకే వాడుకొన్నారు. రాజకీయాలకు, కులాలకు ఏమాత్రం సంబంధంలేని హత్యకు రాజకీయ రంగు పులిమారు. రెండు కుటుంబాల మధ్య వివాదాన్ని కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. బాధలో ఉన్న కుటుంబానికి సాంత్వన కలిగించేలా ప్రవర్తించాల్సిన ఆయన.. అందుకు భిన్నంగా వ్యవహరించారు. మాజీ సీఎం అయి ఉండీ,.. వారిని మరింత రెచ్చగొట్టేలా వ్యవహరించడం అందరినీ విస్మయపరిచింది. ఘటన జరిగిన వెంటనే తన పార్టీ శ్రేణులతో అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ.. సోమవారం తానే ఆ గ్రామానికి వచ్చి పరామర్శ పేరుతో నీచ రాజకీయానికి తెరలేపారు.
మృతుని సోదరికి ప్రభుత్వ ఉద్యోగం
రెండు రోజుల క్రితం బాపట్ల జిల్లాలో పదో తరగతి విద్యార్థి అమర్‌నాథ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. వెంటనే పోలీసులను రంగంలోకి దింపింది. గంటల వ్యవధిలోనే పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నాలుగో నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారికి కఠిన శిక్షలు పడేలా పోలీసు అధికారులు ఛార్జ్‌షీట్ సిద్ధం చేస్తున్నారు. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్వయంగా ఘటన స్థలాన్ని పరిశీలించి నిందితులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ప్రకటించారు.
మరోవైపు ప్రభుత్వం కూడా ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. అదే రోజు సమాచారం తెలిసిన వెంటనే రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు ఆ గ్రామానికి వెళ్లారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు. తక్షణ సాయం కింద లక్ష రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆ సాయం బాధిత కుటుంబానికి అందకుండా అడ్డుపడ్డారు. మృతదేహానికి పోస్టుమార్టం చేసి తీసుకువచ్చే సమయంలోనూ టీడీపీ నాయకులు అడ్డుకుని రాజకీయం చేశారు. మృతదేహంతో నడిరోడ్డుపై భైఠాయించారు.
మరుసటి రోజే రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్, ఎంపీ మోపిదేవి ఆ కుటుంబం వద్దకు వెళ్లి రూ. 10 లక్షల చెక్కు అందించారు. వారికి ఇంటి స్థలం కేటాయించడంతో పాటు, ప్రస్తుతం వారు ఉంటున్న చోట ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. మృతుని సోదరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. దానికి ఆ కుటుంబం కూడా అంగీకరించింది. ప్రస్తుతం సోదరి ఇంటర్మీడియట్ చదువుతుండటంతో అంగన్‌వాడీ ఆయా పోస్టు ఇస్తామని చెప్పారు. ఈమేరకు ప్రభుత్వం ఆర్డర్స్ కూడా ఇచ్చింది. ఒకవేళ చదువుకుంటానంటే చదువు పూర్తి అయిన తర్వాత దానికి తగ్గ ఉద్యోగం ఇస్తామని చెప్పినట్లు మృతుని సోదరి మీడియా ముందు చెప్పింది. తొలిరోజు జరిగిన ఘటనల్లో తమ తప్పు ఉంటే మన్నించాలని కూడా ఆ కుటుంబం కోరింది.
కులాల మధ్య చిచ్చు పెట్టేలా
ఇది రెండు కుటుంబాల మధ్య జరిగిన వివాదమన్నది సుస్పష్టం. ప్రభుత్వమూ వెంటనే స్పందించిన విషయమూ స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. అయినా ప్రతి ఘటననూ రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలనే చంద్రబాబు.. ఈ విషాదాన్ని కూడా అదే విధంగా కలుషితం చేసే ప్రయత్నం చేశారు. దీనిని రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం చేయాలని టీడీపీ శ్రేణులను ఆదేశించారు. దీంతో టీడీపీ శ్రేణులు బాధిత కుటుంబం చుట్టూ చేరి, ప్రభుత్వ చర్యలను అడ్డుకోవడం ప్రారంభించాయి. ఆదివారం జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌తో కూడా బాబు ఇదే అంశంపై మాట్లాడించారు.
సోమవారం ఆయనే స్వయంగా పరామర్శ పేరుతో గ్రామానికి వచ్చారు. పూర్తిగా రాజకీయమే చేశారు. పోలీసులు ఆలస్యంగా స్పందించారంటూ నిందలు వేశారు. బీసీ బిడ్డకు అన్యాయం జరిగిందంటూ కుల ప్రస్తావన చేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరించారు. వాస్తవానికి ఈ ఘటనలో నలుగురు నిందితుల్లో ముగ్గురు ఒక సామాజిక వర్గానికి చెందిన వారైతే, నాలుగో వ్యక్తి మృతుని సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. ఈ హత్యతో రాజకీయాలకు, కులాలకు సంబంధం లేదు. అక్కని వేధించడంపై నిలదీశాడని కక్ష పెంచుకుని వారు హత్య చేశారు.
అయినా చంద్రబాబు ఈ ఘటనకు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేశారు. సీఎం ఇంట్లో ఆడబిడ్డలు లేరా, వారికీ ఇలా జరిగితే.. వైసీపీ ఎంపీ, మంత్రుల ఇంట్లో వాళ్లకు ఇలా జరిగితే ఊరుకుంటారా.. అంటూ నోటికొచి్చనట్లు మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చే ఆయా ఉద్యోగం చేసుకుంటావా, నీ తమ్ముడిని చంపిన వారిపై పగ తీర్చుకుంటావా అంటూ మృతుని సోదరిని రెచ్చగొట్టారు. ఇలా ఆయన గ్రామంలో ఉన్నంతసేపూ రెచ్చగొట్టేలా వ్యవహరించారు. గతంలో పల్నాడులో జరిగిన హత్య, ఇతర ఘటనలపైనా ఇదే విధంగా నీచ రాజకీయానికి ఒడిగట్టారు. ఇప్పుడూ అలానే వ్యవహరించి, తన సహజ లక్షణాన్ని బయటపెట్టుకున్నారు.
ఇది కూడా చదవండి: నేడు ‘జగనన్న ఆణిముత్యాలు’కు సత్కారం
Comments
Please login to add a commentAdd a comment