వాగును పూడ్చి కార్యాలయాన్ని కట్టి | TDP Occupied Govt Place For Party Office | Sakshi
Sakshi News home page

వాగును పూడ్చి కార్యాలయాన్ని కట్టి

Published Thu, Oct 29 2020 7:48 PM | Last Updated on Thu, Oct 29 2020 7:48 PM

TDP Occupied Govt Place For Party Office - Sakshi

సాక్షి, అమరావతి బ్యూరో : కృష్ణా కరకట్టపై అక్రమ భవనాన్ని నివాసంగా మార్చుకున్న ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు టీడీపీ రాష్ట్ర  కార్యాలయాన్ని సైతం వాగును పూడ్చి, పట్టా భూమిని ఆక్రమించి నిర్మాణం చేశారు. వాగు పోరంబోకుతోపాటు రైతులకు పట్టాలిచ్చిన భూములను ఆక్రమించి టీడీపీ కార్యాలయాన్ని నిర్మించడంపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం విచారణకు తిరస్కరించింది. దీనిపై ఎమ్మెల్యే ఆర్కే సుప్రీంకోర్టుకు వెళ్లడంతో మంగళవారం విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేయడం టీడీపీలో కలకలం రేపుతోంది. 

ఎకరం రూ.వెయ్యి లీజుతో...
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీ రాష్ట్ర కార్యాలయం కోసం మంగళగిరి మండలం ఆత్మకూరులోని కొండ, కాలువ పోరంబోకు స్థలాన్ని చంద్రబాబు ఎంపిక చేశారు. పక్కన ఉన్న కాలువలను పూడ్చి ప్రభుత్వ భూమిని ఆక్రమించడంతో పాటు పట్టాలిచ్చిన భూములను కూడా ఆక్రమించి నిర్మాణం చేపట్టారు. జాతీయ రహదారి వెంట సర్వే నెంబర్‌ 392లో 3.65 ఎకరాల భూమిని టీడీపీ కార్యాలయం కోసం 99 ఏళ్ల పాటు గత సర్కారు లీజుకు కేటాయించింది. సుమారు రూ.50 కోట్ల విలువైన భూమిని ఏడాదికి ఎకరాకు రూ.1,000 లీజుపై కేటాయిస్తూ 2017లో జీవో జారీ చేసింది. మరోవైపు అప్పటికే అదే భూమికి సంబంధించి 1974లోనే బొమ్ము రామిరెడ్డి పేరుతో 0.65 సెంట్లు, కొల్లా రాఘవరావు పేరుతో 1.75 ఎకరాలు, కొల్లా భాస్కరరావు పేరుతో 1.75 ఎకరాల పట్టా భూమిని ప్రభుత్వం మంజూరు చేయడం గమనార్హం.
 
రైతుల ఆక్రోశం..
తాము వ్యవసాయం చేసుకుంటున్న భూమిని అధికారం అండతో బలవంతంగా లాక్కుని టీడీపీ కార్యాలయానికి కేటాయించారని రైతులు ఆక్రోశించినా గత సర్కారు పట్టించుకోలేదు. దీనిపై రైతులు కోర్టును ఆశ్రయించగా స్టే ఆర్డర్‌ ఇచ్చినా పట్టించుకోకుండా గత సర్కారు ఏకపక్షంగా భూమిని టీడీపీ కార్యాలయానికి కేటాయించింది. ఇదే భూమిలో చిన్నపాటి నిర్మాణాలకు అనుమతించాలని రైతులు కోరితే వాగు పోరంబోకులో నిర్మాణాలు చేపట్టరాదని, కొండపై నుంచి వచ్చే నీటికి ఆటంకం కల్పించరాదని అభ్యంతరం తెలిపిన నీటి పారుదల శాఖ అధికారులు టీడీపీ కార్యాలయం కోసం భారీ భవనానికి ఎలా అనుమతులు మంజూరు చేశారనేది ప్రశ్నార్థకంగా మారింది. 

అక్రమంగా ఏడంతస్తులు..
కోర్టు ఆదేశాలను బేఖాతర్‌ చేస్తూ టీడీపీ కార్యాలయం కోసం భారీ భవనాన్ని నిర్మించారు. స్టేటస్‌ కో ఉత్తర్వులు ఉన్నాయని రైతులు ఎంత మొర పెట్టుకున్నా ఆలకించలేదు. టీడీపీ కార్యాలయానికి 3.65 ఎకరాలను కేటాయించగా పక్కనే ఉన్న బొమ్ము రామిరెడ్డికి చెందిన 0.65 సెంట్ల భూమితోపాటు వాగును పూర్తిగా పూడ్చి నిర్మాణం చేపట్టారు. మరోవైపు భవన నిర్మాణ నిబంధనలను కూడా అతిక్రమించడం గమనార్హం. రెండు బేస్‌మెంట్లు, మూడు అంతస్తులకు మాత్రమే అనుమతులు తీసుకుని మూడు బేస్‌మెంట్లు, నాలుగు అంతస్తులు నిర్మిస్తుండడం గమనార్హం. మొత్తం ఏడంతస్తుల నిర్మాణం జరుగుతోంది.

ఇచ్చింది వెయ్యి గజాలు.. ఆక్రమణ 1,500 గజాలు
రాష్ట్ర విభజన అనంతరం తొలుత గుంటూరు అరండల్‌పేటలోని పిచుకుల గుంటలో టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. వెయ్యి గజాల స్థలాన్ని కార్పొరేషన్‌ నుంచి లీజుకు తీసుకుని అదనంగా మరో 1,500 గజాల స్థలాన్ని ఆక్రమించి పార్టీ భవనాన్ని నిర్మించారు. జీ ప్లప్‌ –1కి అనుమతి తీసుకుని జీప్లస్‌ –2 భవన నిర్మాణం చేపట్టారు. మున్సిపల్‌ స్థలాన్ని సాధారణంగా లీజుకు ఇవ్వరు. టీడీపీ హయాంలో అధికారులపై ఒత్తిడి తెచ్చి కౌన్సిల్‌ తీర్మానం చేసి ఆక్రమించిన స్థలంతో కలిపి 2,500 గజాల స్థలాన్ని క్రమబద్ధీకరించాలని దరఖాస్తు చేసుకున్నారు. భవనానికి, ఆక్రమించిన స్థలానికి ఎలాంటి పన్నులు చెల్లించడం లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement