
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇటీవల ఎన్నికల కమిషన్ ప్రకటించిన 2021 ముసాయిదా ఓటర్ల జాబితాలో ఈ విషయం స్పష్టమైంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అనంతపురం జిల్లా మినహా మిగతా 12 జిల్లాల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. సర్వీసు ఓటర్లను మినహాయిస్తే థర్డ్ జండర్ ఓట్లు 4,083 కలుపుకుని మొత్తం ఓటర్లు 4,00,79,025 మంది ఉన్నారు.
ఇందులో మహిళా ఓటర్లు 2,02,83,145 మంది కాగా, పురుష ఓటర్ల సంఖ్య 1,97,91,797. ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా 4,91,348 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. కాగా, 2020 ముసాయిదా ఓటర్ల సవరణ జాబితా నుంచి ఈ ఏడాది నవంబర్ 16వ తేదీ నాటికి అదనంగా 1,41,631 ఓటర్లు నమోదయ్యారు. ఒక్క అనంతపురం జిల్లాలో మాత్రం పురుష ఓటర్లు 16,52,036 మంది ఉండగా, మహిళా ఓటర్లు 16,48,024 మంది ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 42,72,107 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 18,65,266 మంది ఓటర్లు ఉన్నారు.