పొన్నూరు(చేబ్రోలు)/నరసరావుపేట : పేదల సొంతింటి కలను సీఎం జగన్ సాకారం చేస్తున్నారని మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణ పరిధి నిడుబ్రోలు ప్రాంతంలో బుధవారం టిడ్కో గృహ సముదాయాల ప్రారంబోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. సుమారు 21 ఎకరాల్లో నిర్మించిన 2,368 టిడ్కో గృహాల్లో మొదటి విడతగా 1,660 గృహాలను మంత్రి ప్రారంభించారు.
అలాగే పల్నాడు జిల్లా నరసరావుపేట కేసానుపల్లి పంచాయతీ పరిధిలో మొదటి దశలో భాగంగా నిర్మించిన 500 టిడ్కో గృహాలనూ మంత్రి ప్రారంభించారు. లబ్దిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు, తాళాలను అందజేశారు. ఈ సందర్భంగా నిడుబ్రోలులో జరిగిన సభకు పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య అధ్యక్షత వహించారు.
మంత్రి సురేష్ మాట్లాడుతూ పొన్నూరులో రూ.177 కోట్లతో నిర్మించిన టిడ్కో గృహాల సముదాయంతో ఇక్కడ సుమారు 12 నుంచి 15 వేల జనాభాతో జగనన్న టౌన్ షిప్‌గా అభివృద్ధి చెందుతోందన్నారు. కుల, మత, పార్టీలకు అతీతంగా, అర్హతే ప్రామాణికంగా నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమల్లో చంద్రబాబు అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
కిలారి రోశయ్య మాట్లాడుతూ పేదలకు లక్షల విలువ చేసే సొంతింటిని అందించిన సీఎం జగన్.. పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయారని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం జగన్ చిత్రపటానికి లబ్దిదారులు క్షీరాభిõÙకం చేశారు. టిడ్కో చైర్మన్ ప్రసన్నకుమార్, మేనేజింగ్ డైరెక్టర్ చిత్తూరు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
రూ.115 కోట్లతో 1,504 గృహాల నిర్మాణం
పల్నాడు జిల్లా నరసరావుపేట కేసానుపల్లి పంచాయతీ పరిధిలో జరిగిన కార్యక్రమంలో టిడ్కో గృహాల మీద ఏర్పాటు చేసిన సీఎం జగన్ కటౌట్‌కు మహిళలు పాలాభిషేకం చేశారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో రూ.115 కోట్లతో 1,504 గృహాల నిర్మాణం చేపట్టామని.. అందులో ఈ రోజు 500 గృహ ప్రవేశాలు చేసినట్టు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం రూ.14 కోట్లతో మౌలిక వసతులు కల్పించిందన్నారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించడంతో పాటు గతంలో డిపాజిట్ చేసిన నగదులో రూ.25 వేలు తిరిగి చెల్లించనున్నట్టు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment