సాక్షి, విజయవాడ: రేపు(శుక్రవారం) విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరుగనుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులను వాహనదారులు గమనించాలని సీపీ కాంతి రాణా టాటా స్పష్టం చేశారు. రేపు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉన్నాయని తెలిపారు.
కాగా, సీపీ కాంతి రాణా గురువారం మీడియాతో మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి 1.5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాం. రేపటి కార్యక్రమం కోసం ట్రాఫిక్ మళ్లింపు చేస్తున్నాం. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వాహనాల రాకపోకలకు మళ్లింపులు కొనసాగుతాయి. విజయవాడ సిటీలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా..
- హైదరాబాద్-విశాఖ, విశాఖ-హైదరాబాద్ వైపు వాహనాలన్నీ ఇబ్రహీంపట్నం దగ్గర మైలవరం, నూజివీడు, హనుమాన్ జంక్షన్ మీదగా దారి మళ్లింపు
- చెన్నై నుంచి వైజాగ్ వెళ్లే వాహనాలను ఒంగోలు దగ్గర డైవర్షన్.. చీరాల, బాపట్ల మీదగా మళ్లింపు
- వైజాగ్ నుంచి చెన్నై వెళ్లే వాహనాలను హనుమాన్ జంక్షన్ దగ్గర దారి మళ్లింపు
- చెన్నై నుంచి హైదరాబాద్, హైదరాబాద్- చెన్నై వెళ్లే వాహనాలను మేదరమెట్ట, అద్దంకి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ మీదగా మళ్లింపు
- ఎంజీ రోడ్‌లో ఉదయం 11 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు
- ఇతర జిల్లాల నుంచి వచ్చే వాహనాలకి పార్కింగ్ ప్రాంతాలు కేటాయించాము
- రేపు సీఎం వైఎస్ జగన్ చేతుల మీదగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుంది
- సందర్శకులకు శనివారం నుంచి అంబేద్కర్ విగ్రహాన్ని చూసేందుకు అనుమతి.
కలెక్టర్ ఢిల్లీ రావు మాట్లాడుతూ..
- రేపు సాయంత్రం 4.30 గంటల నుంచి అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ప్రారంభమవుతుంది.
- ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముందుగా సీఎం జగన్ ముఖ్య అతిథిగా బహిరంగ సభ జరుగుతుంది
- బహిరంగ సభ ముగిసిన తర్వాత సీఎం జగన్ చేతుల మీదగా ఆరు గంటలకి అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరుగుతుంది
- దాదాపు మూడు వేల వాహనాలలో లక్షన్నర మంది ప్రజలు వస్తారని భావిస్తున్నాం.
- ఈ కార్యక్రమాన్ని చూసేందుకు విజయవాడ నగరంలోని పలు జంక్షన్లలో 36 చోట్ల స్క్రీన్లు ఏర్పాటు చేశాం
- విజయవాడ సెంటర్‌లో ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో రూ.405కోట్ల వ్యయంతో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు జరిగింది.
- రేపు సందర్శకులకు అనుమతి ఉండదు
- నగర ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నాం
Comments
Please login to add a commentAdd a comment