సాక్షి, విజయవాడ: పెత్తందారుల పత్రికలు చరిత్రను కూడా వక్రీకరిస్తున్నాయని.. ఎల్లో మీడియాను చూస్తే పాత్రికేయం ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సామాజిక సమతా సంకల్ప సభలో మాట్లాడుతూ, పేదవాడి పిల్లలు ఎప్పటికీ పనివాళ్లుగా ఉండిపోవాలా? అంటూ ప్రశ్నించారు.
సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే..
విజయవాడ– సామాజిక చైతన్యాలవాడ
ఈ రోజు మన విజయవాడను చూస్తుంటే.. సామాజిక చైతన్యాలవాడగా ఇవాళ కనిపిస్తుంది. భారతరత్న, బాబాసాహెబ్ డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ మహావిగ్రహం, స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఆవిష్కరణ సందర్భంగా ఇవాళ ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి అవ్వాతాతకు, ప్రతి సోదరుడికీ, స్నేహితుడికీ, మొత్తం దళిత జాతికి, బహుజనులకు, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రతి గుండెకు ఈ రోజు మీ జగన్ ఈ వేదికపైనుంచి అభినందనలు తెలియజేస్తున్నాడు.
సామాజిక న్యాయ మహాశిల్పం– దేశంలో మారుమోగనున్న విజయవాడ.
ఈ మహా విగ్రహం స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయ మహాశిల్పం. అమెరికాలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ మనకు కనిపిస్తుంది. దాని గురించి మనం మాట్లాడుతాం. కానీ ఇక మీదట నుంచి స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇండియాలో విజయవాడ పేరు మారుమోగుతుంది. ఈ విగ్రహం మనందరి ప్రభుత్వం ఈ 56 నెలల్లో అనుసరించిన సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం. ఇది ఈ విజయవాడలో ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది.
ఆశ్చర్యం ఏమిటంటే.. అంబేద్కర్ జన్మించి 133 సంవత్సరాల తర్వాత, అంబేద్కర్ మరణించిన 68 సంవత్సరాల తర్వాత కూడా ఈ విగ్రహాన్ని స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్– సామాజిక న్యాయ మహా శిల్పం కింద ఈ రోజుకి ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎందుకు చేస్తున్నామంటే కారణం... ఈ విగ్రహం వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను, ఆర్ధిక చరిత్రను, మహిళా చరిత్రను మార్చిన ఓ సంఘసంస్కర్త, ఓ మరణం లేని మహనీయుడు విగ్రహం విజయవాడలో ఆవిష్కారం అవుతోంది.
అంబేద్కర్ నిరంతర స్ఫూర్తి...
బాబాసాహెబ్ మన భావాల్లో ఎప్పుడూ బ్రతికే ఉంటాడు. ఎప్పటికీ మన అడుగుల్లోనూ, బ్రతుకుల్లోనూ కనిపిస్తాడు. ఈ దేశంలో పెత్తందారీతనం మీద, అంటరానితనం మీద, కుల అహంకారవ్యవస్ధల దుర్మార్గులు మీద, ఆ దుర్మార్గాల మీద, అక్కచెల్లెమ్మలపై వివక్ష మీద పోరాటాలకు ఆ మహామనిషి నిరంతరం స్ఫూర్తి ఇస్తూనే ఉంటాడు.
75వ రిపబ్లిక్‌డేకు వారం రోజుల ముందే...
విజయవాడలో.. అది కూడా స్వాతంత్య్ర సమర చరిత్ర ఉన్న మన స్వరాజ్య మైదానంలో, 75వ రిపబ్లిక్ డేకు సరిగ్గా వారం రోజుల ముందు మనం అంబేద్కర్ మహా విగ్రహం ఆవిష్కరిస్తున్నాం. ఈ విగ్రహం చూసినప్పుడల్లా పేదలు, మహిళలు హక్కులకు, మానవ హక్కులకు, ప్రాథమిక హక్కులకు, సమానత్వ ఉద్యమాలకు, రాజ్యాంగ హక్కులకు నిరంతరం స్పూర్తి ఇస్తూనే ఉంటుంది.
అంటరానితనంపై తిరుగుబాటు.
అంటరానితనం మీద, ఆధిపత్య భావజాలం మీద ఓ తిరుగుబాటుగా ఆయనను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకున్నా మనకు కనిపిస్తుంటాడు. ఈరోజు ఆయన సమసమాజ భావాలకు నిలువెత్తు రూపంగా ఎప్పుడూ మనందరికీ ఆయన గురించి ఆలోచన చేసినప్పుడు కనిపిస్తుంటాడు.
రాజ్యాంగ హక్కుల ద్వారా, రాజ్యాంగ న్యాయాల ద్వారా నిరంతరం మనల్ని కాపాడే ఒక మహాశక్తిగా ఆయన మనందరికీ స్పూర్తి నిస్తూనే ఉంటాడు. తమ గొంతు విప్పలేని దళిత వర్గాలకు, అల్పసంఖ్యాకులకు, వాయిస్ లెస్ పీపుల్‌కు.. గొంతు వినిపించలేని అట్టడుగునున్న ఉన్న వర్గాలకు, ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలని, రిజర్వేషన్ కల్పించాలని చరిత్ర గతిని మార్చిన పూనాపాక్ట్ జరగడానికి కారకులు అంబేద్కర్. ఈ రోజు దళిత జాతి నిలబడిందన్నా, అల్ప సంఖ్యాకులు నిలబడగలుగుతున్నారన్నా కూడా రిజర్వేషన్లు కల్పించి ఒక్క తాటిపై నిలబెట్టే కార్యక్రమం జరిగిందంటే అది అంబేద్కర్ గారి స్పూర్తి. ఇవాళ ప్రతి వాడలో ఉన్న ఆయన విగ్రహం అణగారినవర్గాలకు నిరంతరం ధైర్యాన్ని, శక్తిని, అండను ఇస్తుంది. మహా శక్తిగా తోడుగా నిలబడుతుంది.
పోరాటానికి ప్రతిరూపం– బాబాసాహెబ్
చదువుకునేందుకు వీల్లేదని తరతరాలుగా అణచివేసిన వర్గాల్లో తాను జన్మించి, చదువుకొనేందుకు మాకు మాత్రమే హక్కుందని అని చెప్పి అనుకొనే వర్గాలకన్నా... కూడా గొప్పగా చదువుకున్న విద్యా విప్లవం అంబేద్కర్ గారు. ఆయన బడిలో చదువుకుంటున్న రోజుల్లో ఆయన దళితుడు కాబట్టి ఆ తరగతి గదిలో మంచి నీరు తాగాలంటే కుండలో నుంచి గ్లాసు ముంచుకొని నీరు తాగడానికి వీల్లేదట. బడిలో ప్యూను దళిత విద్యార్థులకు నీటిని ఆయన తెచ్చుకున్న గ్లాసులో పై నుంచి పోసేవాడట. ఒక్కసారి ఆంబేద్కర్ గారి మాటల్లో వింటే... బడికి ఏరోజైనా ప్యూన్ రాకపోతే ఆరోజు తాగడానికి మంచినీళ్లు లేనట్టే అనే మాటలు బాధ కలిగిస్తాయి. అలాంటి నిజాలను చూసినప్పుడు ఇంకా మనం ఎక్కడ ఉన్నామని అనిపించే మాటలివి.
అంటరాని తరాన్ని స్వయంగా అనుభవించి దాని మీద ఒక తిరుగుబాటును, ఓ విప్లవాన్ని, ఓ స్వాతంత్య్ర పోరాటాన్ని వీటన్నింటినీ ఉమ్మడిగా చూస్తే, ఉమ్మడి చేస్తే...ఆ పోరాటానికి రూపమే అంబేద్కర్. అటువంటి పరిస్థితులు స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా వేర్వేరు రూపాల్లో ఇవాళ్టికీ ఉన్నాయి.
రూపం మార్చుకున్న అంటరానితనం..
అంటరానితనం రూపం మార్చుకుంది అంతే.. అంటరానితనం అంటే కేవలం ఫలానా వ్యక్తుల్ని కేవలం భౌతికంగా ముట్టుకోకూడదు, దూరం పెట్టడమే మాత్రమే అంటరానితనం కాదు. అంటరానితనం అంటే పేదలు ఏ బడిలో చదువుకుంటున్నారో, ఆ గవర్నమెంట్ బడిని పాడుపెట్టడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే అని తెలియజేస్తున్నాను. డబ్బులున్న వారి పిల్లలకు ఒక మీడియం, పేద పిల్లలకు మరో మీడియం అని వివక్ష పాటించి, పేద పిల్లలు తెలుగుమీడియంలోనే చదవాలని, వారు ఇంగ్లీషు మీడియంలో చదవరాదని బరితెగించి వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే.
ఈ రోజు కూడా ఈ అహంకారులు, ఈ పెత్తందార్లు తమ పత్రికలో రాశారు. పొద్దున్నే పత్రిక చదివాను. అంబేద్కర్ తెలుగు మీడియం మాత్రమే ఉండాలి అని అన్నారట. ఈ పెత్తందార్ల పిల్లలు, మనవళ్లు మాత్రం ఇంగ్లీషు మీడియంలోనే చదువుతారట. వీళ్ల మాటలు చూస్తే ఒక నిజం చెప్పకూడదు, అబద్ధాలు ఏ స్థాయిలో చెబుతున్నారో చూస్తే బాధనిపిస్తుంది. వాస్తవం ఏమిటంటే.. అంబేద్కర్ చదువుకున్నది ఇంగ్లీషు మీడియంలో, ఆయన పిల్లవాడిగా 4వ తరగతి ఇంగ్లిషు మీడియంలో పాసైనప్పుడు బంధుమిత్రులంతా పండగ చేసుకున్నారట. కానీ ఈ పెత్తందార్ల పత్రిక, ఆ ఈనాడు పత్రిక ముసుగులో.. తాము పాటించే ఈ అంటరానితనాన్ని అబద్ధాలతో అందమైన మేకప్ వేయాలనుకున్న ఇలాంటి దుర్మార్గులు, నీచులు మన దళితులకు, బహుజనులకు వ్యతిరేకులు.
చరిత్రను వక్రీకరిస్తూ రాతలు..
చివరికి చరిత్రను కూడా ఇలాంటి వాళ్లు వక్రీకరిస్తూ రాతలు రాస్తున్నారంటే ఏ స్థాయికి పాత్రికేయం పడిపోయిందని ఆలోచన చేయమని కోరుతున్నాను. పేద కులాల వారు ఎప్పటికీ తమ పొలాల్లో పనివారుగా ఉండిపోవాలట. తమ ఇళ్లల్లో పనివారుగా, తమకు సేవకులుగా ఉండిపోవాలట. చిన్న, చిన్న వృత్తులు, చిన్న చిన్న వ్యాపారాలు మాత్రమే వాళ్లు చేసుకోవాలట. తమ అవసరాలు తీర్చేవారుగానే మాత్రమే వాళ్లు మిగిలిపోవాలట. ఇలాంటి ఆలోచనలు కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే.
పేదలు ఏ ఆస్పత్రిలోకి వైద్యం చేయించుకుంటున్నారో. ఆ గవర్నమెంట్ ఆస్పత్రుల్లో ఎక్కడైతే పేదలకు ఉచితంగా వైద్యం అందుతోందో, అటువంటి ఆస్పత్రులు నీరుగార్చడం, పేదలు ఏ బస్సుల్లో ఎక్కుతున్నారో.. ఆ ఆర్టీసీని కూడా ప్రయివేటుకు అమ్మేయాలనుకోవడం ఇవన్నీ కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. ఏ పౌర సేవ కావాలన్నా, ఏ పథకం పేదవాడికి కావాలన్నా, వారు లంచాలు ఇచ్చుకుంటూ వివక్షకు లోనవుతూ, కార్యాలయాల చుట్టూ తిరుగుతూ, జన్మభూమి కమిటీల చుట్టూ తిరగేలా... వారి సహనాన్ని పరీక్షించడం కూడా.. రూపం మార్చుకున్న అంటరాని తనమే.
అవ్వాతాతలకు పెన్షన్, రైతన్నలకు ఎరువులు కావాలన్నా పొద్దున్నే లేచి పొడువాటి లైన్లలో నిలబడి, చివరకి ఆ క్యూలైన్లలోనే మనుషులు చనిపోతున్నా కూడా పాలకుల గుండె కరక్కపోవడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. ఈ అంటరానితనంలో పేదల మీద పెత్తందారీ భావజాలంలో ఇవన్నీ కూడా భాగాలే.
ఎస్సీల అసైన్డ్ భూముల్ని కూడా కాజేసి తాము గజాల లెక్కన అమ్ముకోవాలనుకున్న రియల్ ఎస్టేట్ రాజధానిలో పేద సామాజికవర్గాలకు చోటు లేకుండా తాము మాత్రమే ఒక కోట కట్టుకోవాలన్న కుతంత్రాలు చేయడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. రూపం మార్చుకున్న ఈ అంటరానితనం అంటే పేదల ఇళ్ల నిర్మాణానికి భూములిస్తే సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని ఏకంగా కోర్టులకు వెళ్లి, కేసులు వేసి సిగ్గు లేకుండా వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే.
మన ఎస్సీలు, మన ఎస్టీలు, మన బీసీలు, మన మైనార్టీలు, మన నిరుపేద పిల్లలు చదువుకునే ఆ గవర్నమెంట్ బడులలో ఇంగ్లీషు మీడియం చదువులు చెప్పడానికి వీల్లేదని కోర్టులకు సైతం వెళ్లి పిటిషన్లు వేయడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. పేద వర్గాల పిల్లలకు ట్యాబులిస్తే అందులో వారు చూడకూడనివి చూస్తున్నారంటూ.. వాళ్ల పిల్లల చేతుల్లో కూడా సెల్ ఫోన్లు ఉన్నాయని, ట్యాబులున్నాయన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగా కూడా మర్చిపోతూ, డిజిటల్ లిటరసీని మన పేద పిల్లలకు ఇవ్వటానికి వీల్లేదని కుట్రపూరితంగా రాతలు రాయడం, వాదించడం కూడా రూపంమార్చుకున్న అంటరానితనమే.
56 నెలల మన సామాజిక, ఆర్దిక, రాజకీయ యుద్దానికి నిదర్శనం.
స్వాతంత్య్రం వచ్చి 77 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ అలాగే మిగిలిపోయిన ఈ రూపం మార్చుకున్న అంటరానితనంపై.. 56 నెలలుగా మనం చేస్తున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ యుద్ధానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ అంబేద్కర్ గారి విగ్రహం ఎప్పటికీ కనిపిస్తుంటుంది.
ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం
ఈ విగ్రహం దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం అని చెప్పడానికి గర్వపడుతున్నాను. 81 అడుగుల వేదిక ఏర్పాటు చేసి, దాని మీద 125 అడుగుల మహా విగ్రహం. అంటే 206 అడుగుల ఎత్తయిన ఈ విగ్రహం.. దేశంతో కాదు మనం పోటీ పడేది ప్రపంచంతోనే పోటీ పడుతున్నామని తెలియజేస్తున్నాను.
తరతరాలు ఈ ఆకాశమంత మహానుభావుడిని గుర్తుచేసుకోవాలి
తరతరాలు కూడా ఈ ఆకాశమంతటి మహానుభావుడి, ఈ ఆకాశమంతటి వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రతి పిల్లాడూ, ప్రతి పాపా ఆయన జీవిత చరిత్ర నుంచి స్పూర్తిని తెచ్చుకోవాలి. ఎందుకంటే అభివృద్ధికి, అభ్యుదయానికి మధ్య అవినాభావ సంబంధం అంబేద్కర్ గారి భావజాలం. ఇలాంటి భావజాలం మన పెత్తందార్లకు మాత్రం నచ్చదు. పెత్తందార్లంటే ఎవరో మీ అందరికీ బాగా ఈ పాటికి అర్థమయ్యుంటుంది.
చంద్రబాబు దళితులకు చేసింది శూన్యం
దళితులకు చంద్రబాబు నాయుడు సెంటు భూమిని ఇళ్ల నిర్మాణాలకు ఇచ్చింది లేదు, అంబేద్కర్ గారి విగ్రహం నిర్మించింది అంతకంటే లేదు. ఎందుకంటే చంద్రబాబు రక్తంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మీద ఏ కోశానా, ఏనాడూ కూడా ఈ మనిషికి ప్రేమే లేదు.
ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి నోరు పారేసుకుంటే గ్రామాల్లో ఆ ఎస్సీలు ఎలా బతకగలుగుతారనే కనీస ఆలోచన చేయకుండా అంత చులకనగా మాట్లాడే స్వభావం. బీసీల తోకలు కత్తిరిస్తా కబడ్దార్ అన్న వ్యక్తి, పేద సామాజిక వర్గాలంటే గిట్టని ఈ వ్యక్తి మన మాదిరిగా పేద అక్కచెల్లెమ్మలు, కుటుంబాలు బాగుండాలని ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు, రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా, దేశంలో ఎప్పుడూ చూడని విధంగా అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేయాలని ఆ పెద్ద మనిషికి ఎందుకు అనిపిస్తుంది ?.
పెత్తందారీ పార్టీలకు, నాయకులకు చదువుకొనే మన పేద పిల్లలకు అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, గోరుముద్ద, విద్యాకానుక, ట్యాబులు ఇవ్వాలని, ఇంగ్లీషు మీడియంలో చదువులు చెప్పించాలని, బైలింగువల్ బుక్స్ ఇవ్వాలని, మన గవర్నమెంట్ బడుల్లో మన తరగతి గదుల్లో డిజిటలైజేషన్ జరగాలని, ఐఎఫ్ పీలు ఏర్పాటు చేయాలని, నాడునేడుతో మన చదువులు మార్చాలని ఇటువంటి పెత్తందారీ నాయకులకు, పార్టీలకు ఎందుకు అనిపిస్తుంది?
పెత్తందారీ పార్టీలకు, నాయకులకు మన అక్కచెల్లెమ్మలకు ఒక దిశా యాప్ తేవాలని, అమ్మ ఒడి, ఆసరా, సున్నావడ్డీ, చేయూత ఇవ్వాలని, అక్కచెల్లెమ్మలపేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, 22 లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చి.. వారి ముఖాలలో చిరునవ్వులు చూడాలని పెత్తందారీ పార్టీలకు, నాయకులకు ఎందుకు అనిపిస్తుంది? ఆలోచన చేయండి.
మన రైతన్నలకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, రైతు భరోసాతో రైతన్నలకు ఆదుకోవాలని, వారికి చేయిపట్టుకుని నడిపించే ఆర్బీకే వ్యవస్థను పెట్టాలని ఎందుకు అనిపిస్తుంది?. పెత్తందారీ పార్టీలకు, నాయకులకు.. పేదలకు వైద్యం, ఆరోగ్యం కోసం వారికి మెరుగైన ఆరోగ్యశ్రీ ఇవ్వాలని, ఆరోగ్య ఆసరాతో ఆదుకోవాలని, 104, 108 ఫోన్ కొడితే చాలు కుయ్.. కుయ్.. కుయ్ అంటూ పేద వాడి ముంగిటకు వచ్చి, పేదవాడికి అండగా నిలబడే పరిస్థితి రావాలని, గ్రామ స్ధాయిలో విలేజ్ క్లినిక్ రావాలని, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకురావాలని, ఆస్పత్రులు రూపు రేఖలు మారాలని, వైద్యం కోసం పేదవాడు వెళితే 53 వేల మంది డాక్టర్లు, నర్సులను ఆసుపత్రులలో రిక్రూట్ చేయాలని ఎందుకు అనిపిస్తుంది?
ఆ పెత్తందారీ పార్టీలకు, పెత్తందారీ నాయకులకు గ్రామ స్థాయిలోనే ఒక లంచాలు లేని, వివక్ష లేని వ్యవస్థను తీసుకురావాలని, ఓ వాలంటీర్ వ్యవస్థ తీసుకురావాలని, సచివాలయం తేవాలని ప్రతి పేదవాడికీ అందుబాటులతో ఉండాలని ఎందుకు అనిపిస్తుంది?. పెత్తందారీ పార్టీలకు, నాయకులకు నామినేటెడ్ పోస్టుల్లోనూ, నామినేషన్ మీద ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ 50 శాతం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ 50 శాతం పదవులు ఇచ్చేట్టుగా ఏకంగా చట్టం చేయాలని వాళ్లకు ఎందుకు అనిపిస్తుంది?
మంత్రిమండలిలో ఏకంగా 4 డిప్యూటీ సీఎం పదవులు, నా అంటూ.. నా ఎస్సీలకు,ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు మనం ఇస్తే, మంత్రి మండలిలో 68 శాతం మంత్రి పదవులు ఇస్తూ... సామాజికపరంగా రాజకీయ పదవుల్లో దేశ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ఈ 56 నెలల్లో అడుగులు పడ్డాయి.
శాసనసభ స్పీకర్ గా బీసీ, శాసన మండలి చైర్మన్ గా ఒక ఎస్సీ, మండలి డిప్యూటీ చైర్ పర్సన్‌గా ఒక మైనార్టీ అక్కకు పెద్దపీట వేసిన ఏకైక ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. మనందరి ప్రభుత్వం వచ్చాక రాజ్యసభకు 8 మందిని పంపిస్తే అందులో నలుగురు నా వాళ్లు అనుకుంటున్న నా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల వారే. మండలిలో మన పార్టీ వారు 43 మంది సభ్యులుంటే అందులో 29 మంది నా అని నేను పిల్చుకుంటున్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలే.
రాష్ట్రంలో 13 జెడ్పీ చైర్మన్ పదవులుంటే అందులో 9 నా అంటూ నేను పిల్చుకుంటున్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలే. 17 మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే అందులో 12 నా అంటూ నేను పిల్చుకుంటున్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములే కనిపిస్తున్నారు.
రాష్ట్రంలో 87 మున్సిపాలిటీలుంటే అందులో 84 మీ బిడ్డ గెలుచుకుంటే.. అందులో ఏకంగా 58 నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలే కనిపిస్తున్నారు. 196 మార్కెట్ కమిటీ చైర్మన్లు ఉంటే అందులో ఏకంగా 117 ఏకంగా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అన్నదమ్ములు అక్కచెల్లెమ్మలే ఉన్నారు. 137 కార్పొరేషన్ చైర్మన్ పదవులుంటే 79 నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అన్నదమ్ములు అక్కచెల్లెమ్మలే. మొత్తంగా రాజకీయ నియామకాలు, పదవుల్లో సగానికిపైగా నా అక్కచెల్లెమ్మలున్నారని గర్వంగా చెప్పగలుగుతున్నాను.
మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 56 నెలల కాలంలోఏకంగా 2.10 లక్షలకు పైగా.. గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తే అందులో... 80 శాతం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అన్నదమ్ములు అక్కచెల్లెమ్మలే ఉగ్యోగాల్లో ఉన్నారు. ఇలాంటి సామాజిక న్యాయం మనందరి ప్రభుత్వంలో కాకుండా మరెక్కడైనా చూశారా? ఈరోజు ఈ పెత్తందారీ పార్టీలకు, పెత్తందారీ నాయకులకు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు.. వారి కోసం నవరత్నాల పాలన అందించాలని, కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి అవ్వాతాత వరకు అందరి పట్ల ప్రేమ, మమకారం చూపాలని వీళ్లకు ఏరోజైనా అనిపించిందా?
మీ బిడ్డ పాలనలో ఈ 56 నెలల కాలంలో రూ.2.47 లక్షల కోట్లు నేరుగా బటన్ నొక్కుతున్నాను. నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పోతున్నాయి. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు. మరి రాష్ట్రాన్ని దోచుకొనేందుకుమాత్రమే పదవులు కావాలని ఆకాంక్షిస్తున్న పెత్తందారీ పార్టీలు, నాయకులకు ఏరోజైనా ఇలా బటన్ నొక్కడం, తద్వారా రూ.2.47 లక్షల కోట్లు పేద అక్కచెల్లెమ్మలకు పోతుందని ఏరోజైనా అనిపించిందా? ఆలోచన చేయండి.
సామాజిక న్యాయంలో పుట్టిన వ్యవస్ధలు.
ఇవన్నీ కూడా సామాజిక న్యాయాన్ని అందించడంలో విప్లవంగా పుట్టిన వ్యవస్థలు. ఇవాళ గ్రామ స్థాయిలో చిక్కటి చిరునవ్వుతో మన పిల్లలు కనిపిస్తారు. 2 వేల జనాభాకు ఒక సచివాలయం, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్.. లంచాలు, వివక్షలేకుండా ప్రతి పేదవాడు, రైతన్నను, అక్కచెల్లెమ్మను చేయి పట్టుకొని నడిపిస్తూ గ్రామ స్వరాజ్యం అంటే ఇదీ, అంబేద్కర్ గారి కలలుగన్న రాజ్యం ఇది అని ఆ చెల్లెమ్మలు, తమ్ముళ్లు దేశానికే చూపిస్తున్నారు.
ఇవన్నీ సామాజిక న్యాయాన్ని అందించడంలో విప్లవంగా పుట్టిన వ్యవస్ధలు. కాబట్టి మనం ఆచరించిన విధానాలకు ప్రతీకగా ఈ సామాజిక న్యాయ మహాశిల్పం అనేదాన్ని మనం నిర్మించుకున్నాం. ఈ రోజు ఆవిష్కరణ కూడా చేస్తున్నాం. మనందరి ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం, మీ కష్టం తెలిసిన మీ అన్న ప్రభుత్వం ఇంటింటా ప్రతి గ్రామం నుంచి, కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామాన్నయినా తీసుకోండి. ప్రతి గ్రామంలో మార్పులు కనిపిస్తాయి. ప్రతి గ్రామంలో ఇంటింటా చదువుల విప్లవం, మహిళా సాధికార విప్లవం కనిపిస్తుంది. ప్రతి గ్రాంలో పరిపాలన సంస్కరణలు కనిపిస్తాయి. ఒక వ్యవసాయ విప్లవం కనిపిస్తుంది. ప్రతి గ్రామంలో పారిశ్రామిక మౌలిక సదుపాయాల విప్లవం కనిపించేటట్టుగా జిల్లాలో ఎప్పుడూ చూడని అభివృద్ధి కనిపిస్తుంది.
వైద్య, ఆరోగ్య రంగంలో ఎప్పుడూ ఊహించని విధంగా గ్రామ స్థాయిలో మార్పు చెందిన మరో విప్లవం మన పిల్లలకు కనిపిస్తుంది. నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తాయి. ప్రతి అంశంలోనూ పేదల అభ్యున్నతికి తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు కలకాలం ఉండాలని కోరుకుంటూ... ఆ మహానుభావుడి విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమానికి ఇక్కడి నుంచి అందరం బయలుదేరి అక్కడికి పోదాం అని పిలుపునిస్తూ... సీఎం జగన్ తన ప్రసంగం ముగించారు.
ఇదీ చదవండి: స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్: విజయవాడ ప్రతిష్ట ఆకాశమంత ఎత్తుకు..
.
Comments
Please login to add a commentAdd a comment