తోటమూలలో మాట్లాడుతున్న కేశినేని నాని
గంపలగూడెం(తిరువూరు): చంద్రబాబునాయుడికి దమ్ము, ధైర్యం ఉంటే విజయవాడ ఎంపీ స్థానం నుంచి తనపై నిలబడి గెలవాలని వైఎస్సార్ సీపీ విజయవాడ పార్టీమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి కేశినేని నాని సవాల్ విసిరారు. చంద్రబాబు కుప్పంలో కూడా ఓడిపోవడం ఖాయమన్నారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం తోటమూల మ్యాంగో మార్కెట్‌లో ఆదివారం నిర్వహించిన వైఎస్సార్ సీపీ మండల ఆత్మియ సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి చివరివని జోస్యం చెప్పారు.
పేదల కోసం పనిచేసే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అయితే, పేదలకు వ్యతిరేకంగా పాలన చేసిన ఘనుడు నారా చంద్రబాబునాయుడని అన్నారు. తన పుత్రరత్నం లోకేశ్‌ను ముఖ్యమంత్రిని చేయాలన్న ఏకైక అజెండాతో చంద్రబాబు ముందుకు పోతున్నారని విమర్శించారు. సుదీర్ఘ రాజకీయం ఉన్న వ్యక్తినని చెప్పుకొనే చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్‌లో కనీసం ఇల్లు కూడా లేదని ఎద్దేవా చేశారు. అమరావతి పేరిట ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు నష్టం తెచ్చారన్నారు.
రూ.2.60 లక్షల కోట్ల మేర సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేసిన ఘనత దేశంలో ఒక్క జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే ఉందని పేర్కొన్నారు. అభ్యర్థుల డబ్బు చూసి చంద్రబాబు టికెట్లు కేటాయిస్తున్నారని విమర్శించారు. మండలంలో ప్రధాన సమస్య అయిన కట్టెలేరు వంతెన నిర్మాణానికి వచ్చే నెల 3వ తేదీన శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. తిరువూరు నియోజకవర్గంలో 10వేల మెజారిటీతో పార్టీ అభ్యర్ధులను గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలన్నారు.
ఓటు అడిగేహక్కు వైఎస్సార్ సీపీకి మాత్రమే ఉంది
రాష్ట్ర ప్రజలకు 57 నెలలుగా మెరుగైన పాలన అందించిన వైఎస్సార్ సీపీకి మాత్రమే రోబోయే సాధారణ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఉందని రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి అన్నారు. పార్టీ మేనిఫెస్టోను 99 శాతం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే దక్కుతుందని పేర్కొన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు చేసిన మంచిని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు.
తిరువూరు అభ్యర్థి ఎంపిక కోసం తలపట్టుకొంటున్నారు
తనను వైఎస్సార్ సీపీ తిరువూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నియమించిన తర్వాత తెలుగుదేశంపార్టీ అభ్యర్ధి కోసం వెతుకులాట ప్రారంభించిందని స్వామిదాసు అన్నారు. తనపై జగనన్న ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొని పనిచేస్తానని చెప్పారు. ముందుగా అయోధ్యరామిరెడ్డి, కేశినేని నాని, స్వామిదాసు తోటమూలలో అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్, వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. వినగడప పేరంటాళ్ళ గుట్ట వద్ద అచ్చం పేరంటాళ్ళకు పూజలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఎన్.సుధారాణి, ఎంపీపీ జి.శ్రీలక్ష్మీ, జెడ్పీటీసీ సభ్యులు కోట శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment