
సాక్షి, తిరుపతి: తిరుమలకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ మొత్తం భక్తులతో నిండిపోయి ఉంది. బయట క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పడుతోంది. ఇక.. ఇవాళ తిరుమల మాడవీధులలో ఉట్లోత్సవం నిర్వహించనున్నారు. దీంతో ఇవాళ ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ. ఆయా సమయాల్లో ఉట్లోత్సవం, మలయప్ప స్వామివారి ఊరేగింపు ఉంటుందని పేర్కొంది.
తిరుమలలో ఈ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య ఆలయ నాలుగు మాడ వీధులలో అత్యంత వైభవంగా ఉట్లోత్సవం నిర్వహించనున్నారు. తిరుమాడ వీధులలో ఉట్లోత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై తీసుకొస్తారు. ఈ ఉట్లోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ్టి.. కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది.
శ్రావణ మాసం ముగింపు కావడంతో.. భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ క్యూ కాంప్లెక్స్ నిండిపోయి.. భక్తులు బయట క్యూ లైన్‌లలో నిల్చున్నారు. టోకెన్ లేని భక్తులు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న(సెప్టెంబర్ 7, 2023) 58,855 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అందులో.. 29,014 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండి ఆదాయం రూ. 4.65 కోట్లుగా లెక్కతేలింది.
Comments
Please login to add a commentAdd a comment