సాక్షి, తిరుమల: హన్మంతుని జన్మస్థలంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధారాలను ప్రకటించింది. ఆంజనేయుని జన్మస్థలానికి సంబంధించిన పలు ఆధారాలను జాతీయ సంస్కృత వర్సిటీ వైఎస్ చాన్స్‌లర్ ఆచార్య మురళీధరశర్మ వెల్లడించారు. ఆయన మీడియాతో బుధవారం మాట్లాడుతూ.. తిరుమలలోని అంజనాద్రే హన్మంతుని జన్మస్థలం అని స్పష్టం చేశారు.
ఆంజనేయుని జన్మస్థానంపై నిరూపించేందుకు సంకల్పం తీసుకున్నామని, దానికై తమ అన్వేషణ కొనసాగిందని పేర్కొన్నారు. నాలుగు నెలలుగా పండితులంతా కలిసి ఆధారాలు సేకరించామని మురళీధరశర్మ గుర్తు చేశారు. వేంకటాచల మహాత్యాన్ని పౌరాణిక ఆధారంగా తీసుకున్నామని ఆయన తెలిపారు. పౌరాణిక, చారిత్రక, శాసన, భౌగోళిక ఆధారాలు సేకరించామని పేర్కొన్నారు. వేంకటాచలానికి అంజనాద్రితోపాటు 20 పేర్లు ఉన్నాయని తెలిపారు.
త్రేతాయుగంలో వేంకటాచలాన్ని అంజనాద్రిగా పిలిచారని ఆచార్య మురళీధరశర్మ చెప్పారు. అంజనాద్రికి హనుమ జన్మించాడని పురాణాలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. అంజనాదేవికి తపోఫలంగా హనుమంతుడు జన్మించాడని పేర్కొన్నారు. అంజనాదేవికి హన్మంతుడు ఇక్కడ పుట్టడం వల్లే అంజనాద్రి అని పేరు వచ్చిందని తెలిపారు. అంజనాద్రిలో పుట్టి వేంకటేశ్వరస్వామికి ఆంజనేయుడు సేవ చేశాడని మురళీధరశర్మ చెప్పారు. కర్ణాటకలోని హంపి హన్మంతుడి జన్మస్థలం కాదని స్పష్టం చేశారు. హనుమ జన్మస్థలం హంపి కాదని చెప్పడానికి తమ వద్ద ఎన్నో ఆధారాలు ఉన్నాయని చెప్పారు.
సూర్యబింబం కోసం హనుమ వేంకటగిరి నుంచే గాల్లోకి ఎగిరాడని, హనుమ తిరుమల కొండల్లోనే పుట్టాడని 12 పురాణాలు చెబుతున్నాయని మురళీధరశర్మ ఈ సందర్భంగా వెల్లడించారు. 12, 13వ శతాబ్దం నాటి ఎన్నో రచనల్లో అంజనాద్రి ప్రస్తావన ఉందని తెలిపారు. వాల్మీకి రామాయణం తర్జుమా కంబ రామాయణంలోనూ ఈ ప్రస్తావన ఉన్నట్లు తెలిపారు. అన్నమయ్య కీర్తనల్లో వేంకటాచలాన్ని అంజనాద్రిగా వర్ణించారని ఆచార్య మురళీధరశర్మ వివరించారు.
చదవండి: హనుమంతుని జన్మస్థానం తిరుమలే!
Comments
Please login to add a commentAdd a comment