ప్రమాద స్థలంలో నాగేశ్వరరావు, రాంబాబు మృతదేహాలు. పక్కనే పడి ఉన్న హెల్మెట్ (వృత్తంలో)
సాక్షి, తూర్పుగోదావరి: సోదరికి పెళ్లి సంబంధం కుదిర్చేందుకు వెళ్తున్న వ్యక్తి, అతడి బావ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. కోరంగి ఎస్సై వై.సతీష్, మృతుల కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కాట్రేనికోన మండలం పల్లంకుర్రు పంచాయతీ గొల్లగరువుకు చెందిన సమనస రాంబాబు (45), కొత్తపల్లి నాగేశ్వరరావు (31) బావ, బావమరిది అవుతారు. తన సోదరికి పెళ్లిసంబంధం కుదిర్చేందుకు నాగేశ్వరరావు.. బావ రాంబాబుతో కలిసి శుక్రవారం మోటార్ సైకిల్‌పై కాకినాడ బయలుదేరారు. బైక్‌ను నాగేశ్వరరావు నడుపుతున్నాడు. జాతీయ రహదారి–216పై తాళ్లరేవు మండలం చొల్లంగిలోని గోడౌన్ల వద్దకు చేరారు. అదే సమయంలో కాకినాడ వైపు నుంచి వస్తున్న లారీ అకస్మాత్తుగా గోడౌన్లలోకి తిరిగింది. దీనిని ఊహించకపోవడంతో నాగేశ్వరరావు బైక్‌ను అదుపు చేయలేక లారీని బలంగా ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో బలమైన గాయాలవడంతో తీవ్ర రక్తస్రావమై నాగేశ్వరరావు, రాంబాబు అక్కడికక్కడే మృతి చెందారు.
కాకినాడ రూరల్ సీఐ ఆకుల మురళీకృష్ణ, కోరంగి ఎస్సై వై.సతీష్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టానికి కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కరప మండలం వాకాడకు చెందిన లారీ డ్రైవర్ మేడసాని నూకరాజును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు నాగేశ్వరరావుకు భార్య సత్యవతి, ఆరేళ్ల లోపు కుమార్తెలు ఇద్దరు, ఒక కుమారుడు ఉన్నారు. మరో మృతుడు రాంబాబుకు పెళ్లీడుకు వచ్చిన ఇద్దరు కుమార్తెలు, భార్య ధనలక్ష్మి ఉన్నారు. కుటుంబానికి జీవనాధారమైన వ్యక్తులిద్దరూ మృతి చెందడంతో ఇరు కుటుంబాల సభ్యులు బోరున విలపిస్తున్నారు. ప్రమాద స్థలంలో బావాబామరదుల మృతదేహాలు ఒకదానిపై ఒకటి పడి ఉండడం చూసినవారి కళ్లు చెమర్చాయి. గ్రామంలో అందరినీ కలుపుకొని వెళ్లే బావాబావమరుదులు మృత్యువాత పడ్డారనే సమాచారం తెలియడంతో గొల్లగరువులో విషాద ఛాయలు అలముకున్నాయి.
హెల్మెట్ ఉన్నా పెట్టుకోక..
ప్రమాద స్థలంలో హెల్మెట్ మృతదేహాల పక్కనే పడి ఉంది. హెల్మెట్ ఉన్నప్పటికీ దానిని ధరించకపోవడంతో ఇద్దరూ మృతి చెందారని, లేకుంటే కనీసం ఒకరైనా బతికే అవకాశం ఉండేదని పోలీసులు అంటున్నారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని వారు సూచిస్తున్నారు. చిన్నపాటి నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుందని, చొల్లంగి ప్రమాదంలో హెల్మెట్ ఉన్నప్పటికీ దానిని ధరించకపోవడంతో తలకు తీవ్రగాయమై వాహనచోదకుడు అక్కడికక్కడే మృతి చెందాడని చెబుతున్నారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు ఇకనైనా విధిగా హెల్మెట్ ధరించాలని సూచిస్తున్నారు.
వేగానికి కళ్లెం వేసే దారేదీ..!
చొల్లంగి గోడౌన్ల ప్రాంతంలో అనేక లారీలను నిత్యం జాతీయ రహదారి పైనే నిలిపివేస్తున్నారు. మరోపక్క జాతీయ రహదారి కావడంతో అనేక వాహనాలు వేగంగా దూసుకుపోతూ ప్రయాణిస్తున్నాయి. దీంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో వేగ నిరోధకాలను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment