రాష్ట్రంలోని ప్రధానాలయాల్లో ఉగాది వేడుకలు
తిరుమల/ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ)/కాణిపాకం(చిత్తూరు రూరల్)/శ్రీశైలం టెంపుల్: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం వేడుకగా జరిగింది. ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, విష్వక్సేనుల వారికి అర్చకులు విశేష సమర్పణ చేశారు. విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోకి ప్రవేశించారు. శ్రీవారి ఉత్సవర్లను బంగారు వాకిలిలో గరుడాళ్వారుకు అభిముఖంగా సర్వభూపాల వాహనంపై, ఉత్సవర్ల పక్కనే మరో పీఠంపై శ్రీ విష్వక్సేనుల వారిని వేంచేపు చేశారు.
శ్రీవారి మూలవిరాట్‌కు, ఉత్సవమూర్తులకు నూతన వ్రస్తాలను ధరింపజేశారు. అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది. బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు ఉగాది ఆస్థానం నిర్వహించారు. ఆలయంలో టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో 10 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 60 వేల కట్ ఫ్లవర్స్‌తో ఏర్పాటు చేసిన ఫల–పుష్ప అలంకరణలు ఆకట్టుకున్నాయి. అయోధ్య రామాలయం, బాలరాముడి సెట్టింగ్, నవధాన్యాలతో రూపొందించిన మత్స్య అవతారము మైమరిపించింది. టీటీడీ గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన 150 మంది పుష్పాలంకరణ కళాకారులు, 100 మంది టీటీడీ గార్డెన్ సిబ్బంది 2 రోజులు శ్రమించి ఈ ఆకృతులను రూపొందించారు.
వైభవంగా దుర్గమ్మకు పుష్పార్చన..
ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవి ఈ నెల 18 వరకు జరుగుతాయి. మంగళవారం తెల్లవారుజామున అంతరాలయంలో మూలవిరాట్‌కు స్నపనాభిషేకం నిర్వహించారు. దేవస్థానం రూపొందించిన పంచాంగాన్ని దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఆవిష్కరించారు. అమ్మవారి ప్రధానాలయం, ఉపాలయాలను పుష్పాలతో అలంకరించారు. దుర్గమ్మకు విశేష పుష్పార్చన చేపట్టారు. ఉగాది సందర్భంగా ధర్మపథం వేదికపై కప్పగంతుల సోమయాజుల సిద్ధాంతి పంచాంగ శ్రవణం చేశారు. సాయంత్రం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు వెండి రథంపై నగరోత్సవాన్ని నిర్వహించారు.
కాణిపాకంలో అంగరంగ వైభవంగా..
కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో ఉగాది వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయాన్ని పలు రకాల పుష్పాలు, మామిడి తోరణాలు, అరటి బోదెలతో శోభాయమానంగా అలంకరించారు. వేకువజామున స్వామికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈవో వెంకటేశు స్వామి వారికి పట్టువ్రస్తాలను సమరి్పంచారు. శివకుమార్ శర్మ రచించిన కాణిపాక దేవస్థానం పంచాంగాన్ని ఆవిష్కరించారు. పురోహితులు మోహన్, రామలింగం పంచాంగ శ్రవణం చేశారు. భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. రాత్రి సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామి ఉత్సవ విగ్రహాలను కాణిపాకం పురవీధుల్లో వైభవంగా ఊరేగించారు.
శ్రీశైలంలో వేడుకగా రథోత్సవం...
శ్రీశైలంలో మల్లన్న రథోత్సవం వైభవంగా సాగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో ఆశీనులను చేయించి ఊరేగింపుగా రథశాల వద్దకు తోడ్కొనివచ్చి రథంపై అధిష్టింపజేశారు. అర్చకులు ఉత్సవమూర్తులకు ప్రత్యేక హారతులిచ్చి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ రథోత్సవం గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు సాగింది. అమ్మవారి ఉత్సవమూర్తిని రమావాణీ సేవిత రాజరాజేశ్వరీ అలంకారంలో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ ఏడాది దేశం పారిశ్రామికరంగంలో అభివృద్ధి చెందుతుందని శ్రీశైలం దేవస్థాన ఆస్థాన సిద్దాంతి పండిత బుట్టే దైవజ్ఞ తెలిపారు. ఉగాది సందర్భంగా ఆయన ఆలయ ప్రాంగణంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment