బాబుకు నిద్రలేని రాత్రిళ్లు!.. టీడీపీలో చల్లారని టికెట్ల చిచ్చు
ఉండిలో రామరాజుకు సహకరించేది లేదన్న శివరామరాజు
అవనిగడ్డ సీటు బుద్ధప్రసాద్‌కు ఇవ్వకపోవడంపై కేడర్ నిరసనలు
పి.గన్నవరంలో మహాసేన రాజేశ్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ శ్రేణుల దాడి
నిడదవోలు సీటుపై శేషారావు వర్గం ఆగ్రహజ్వాలలు
కృష్ణాలో 4 నియోజకవర్గాల్లో తమ్ముళ్ల సిగపట్లు
చంద్రబాబు వారించినా వెనక్కితగ్గని సీనియర్లు
సాక్షి, అమరావతి/సాక్షి, నంద్యాల/సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): టీడీపీలో టికెట్ల కేటాయింపు చంద్రబాబుకు పెద్ద తలనొప్పిలా మారింది. తమ్ముళ్లకు సర్దిచెప్పలేక బాబు నిద్రలేని రాత్రిళ్లు గడుపుతున్నారు. ఉండవల్లికి పిలుపించుకుని వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా టీడీపీ శ్రేణులు వెనక్కితగ్గకపోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో పడిపోయారు.
ఇదంతా చంద్రబాబు నిర్వాకం వల్లేనని, పార్టీ కోసం కష్టపడినవారికి కాకుండా టికెట్లు అమ్ముకున్నారంటూ సీనియర్లు, కిందిస్థాయి నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. దీంతో టీడీపీలో టికెట్ల చిచ్చు ఇప్పట్లో చల్లారేలాలేదు. వేరే వారికి సీట్లు ప్రకటించారని కొన్నిచోట్ల, తమ సీట్లు జనసేనకు కేటాయించారని మరికొన్ని చోట్ల ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు రచ్చ రచ్చ చేస్తున్నారు. చంద్రబాబు తన నిర్ణయం మార్చుకోకపోతే ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని అల్టిమేటం జారీ చేశారు.
టీడీపీ కీలక నేతపై దాడి
అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం సీటును మహాసేన రాజేష్‌కు ఇవ్వడంపై అక్కడి టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. టీడీపీ కేడర్‌తో పాటు జనసేన నేతలు, కార్యకర్తలు రాజేష్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మంగళవారం టీడీపీ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి గంటి హరీష్ మాధుర్‌పై కేడర్ ఏకంగా దాడికి పాల్పడ్డారు. దీంతో చంద్రబాబు ఇరకాటంలో పడ్డారు.
అవనిగడ్డ సీటును జనసేనకు కేటాయించారనే సమాచారంతో అక్కడి టీడీపీ నేతలు ఇప్పటికే తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. కాగా, తనకు సీటు ఇవ్వకపోవడం మహదానందంగా ఉందంటూ నియోజకవర్గ ఇన్‌చార్జి మండలి బుద్ధప్రసాద్ వ్యంగ్యంగా స్పందించారు. జనసేనకు సీటు ఎలా ఇస్తారంటూ ఆయన అనుచరులు నియోజకవర్గంలో హడావుడి చేస్తున్నారు.
ఉండిలో రామరాజును ఓడిస్తా: శివరామరాజు
పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు మళ్లీ సీటు ఇవ్వడంపై మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు (కలవపూడి శివ) తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ఇప్పటికే ఆయన ప్రకటించగా.. ఆయన్ను బుజ్జగించేందుకు టీడీపీ సీనియర్ నేతలు ఎంత ప్రయత్నించినా వినేందుకు సిద్ధంగా లేరు.
మంగళవారం శివరామరాజు కార్యాలయానికి వెళ్లిన రామరాజు ఆయన మద్దతు కోరి అభాసుపాలయ్యారు. రామరాజుతో కరచాలనం చేసేందుకు శివరామరాజు ఇష్టపడకపోగా తన కార్యాలయానికి రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ రామరాజు మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించడంపై శివరామరాజు అభ్యంతరం తెలిపారు. రామరాజును ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిస్తానని ఆయన స్పష్టం చేశారు.
భగ్గుమన్న శేషారావు వర్గం
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు సీటును జనసేనకు కేటాయించారనే ప్రచారంతో అక్కడి టీడీపీ ఇన్‌చార్జి బూరుగుపల్లి శేషారావు వర్గం ఆగ్రహంతో ఉంది. శేషారావుకు టికెట్ ఇవ్వాల్సిందేనని ఆయన వర్గం డిమాండ్ చేస్తోంది. నియోజకవర్గంలోని నాలుగు మండలాల నేతలు సమావేశమై జనసేన అభ్యర్థికి సహకరించేది లేదని తీర్మానాలు చేశారు. రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక చిచ్చు కొనసాగుతోంది.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం, తిరువూరు, కృష్ణా జిల్లా పెనమలూరు, పెడన, ఏలూరు జిల్లా నూజివీడు, విజయనగరం జిల్లా గజపతినగరం, విశాఖపట్నం వెస్ట్, నంద్యాల జిల్లా డోన్, కర్నూలు జిల్లా కోడుమూరు, సత్యసాయి జిల్లా పెనుకొండ, అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె, చిత్తూరు జిల్లా చిత్తూరు తదితర నియోజకవర్గాల్లో నేతలు సీట్ల కోసం సిగపట్లు పడుతున్నారు. చంద్రబాబు వారిని తన వద్దకు పిలిపించుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నా వినేందుకు సిద్ధంగా లేరు.
సూళ్లూరుపేటలో ఆరని చిచ్చు
సూళ్లూరుపేట నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా నెలవల విజయశ్రీని ప్రకటించడంపై మాజీ ఎమ్మెల్యే పరసా వెంకటరత్నయ్య కుమార్తె షాలిని తీవ్రంగా మండిపడ్డారు. 1994 నుంచి కష్టాల్లో పార్టీకి అండగా ఉన్న వెంకటరత్నయ్యకు ఒక్కమాట చెప్పకుండా అభ్యర్థిని ప్రకటించడాన్ని ఆమె తప్పుపట్టారు. తనను గాని, తన భర్తను గాని ఐవీఆర్ సర్వేలో ఎందుకు పెట్టలేదని ఆమె ప్రశ్నించారు.
డోన్‌లో నువ్వా.. నేనా!
డోన్‌లో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంపై టీడీపీ మాజీ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి వర్గం రగిలిపోతోంది. మార్చి 1న డోన్‌లో నూతన కార్యాలయం ప్రారంభించాక ఓ ఫంక్షన్ హాలులో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశానికి కోట్ల సిద్ధమవుతుండగా.. పోటీగా సమావేశం నిర్వహించేందుకు సుబ్బారెడ్డి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కోట్ల తనయుడు మండలాల్లో కార్యకర్తలతో సమావేశమై తమకు మద్దతుగా నిలవాలని అభ్యర్థిస్తున్నారు.
తనకు టికెట్ ఇస్తామని చెప్పి.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించడంపై సుబ్బారెడ్డి సీరియస్‌గా ఉన్నారు. ప్రజా మద్దతు తనకే ఉందని అధినాయకత్వానికి చాటిచెప్పేలా మార్చి 2న సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అభిమానులు, కార్యకర్తల అభీష్టం మేరకే వచ్చే ఎన్నికల్లో రెబల్‌గా పోటీపై నిర్ణయం తీసుకుంటామని మంగళవారం బేతంచెర్లలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment