‘పశ్చిమ’ం, కృష్ణా, కోనసీమ జిల్లాల్లో దుండగుల ధ్వంసం
నరసాపురం రూరల్/వెంట్రప్రగడ (పెదపారుపూడి) /అమలాపురం రూరల్ : పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలోని సారవ గ్రామంలో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వైఎస్సార్ విగ్రహాన్ని, శిలాఫలకాలను ధ్వంసం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, అప్పటి ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు హయాంలో గ్రామ సచివాలయం, రైతుభరోసా కేంద్రం, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవనాలను గ్రామంలో నిర్మించారు.
వీటి ప్రారంభోత్సవ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాలను, అక్కడే ఏర్పాటుచేసిన వైఎస్సార్ విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేశారు. ఈ ఘటనతో గ్రామంలో అలజడి రేగింది. ఈ విధ్వంసానికి పాల్పడిన దోషులను శిక్షించాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు కడలి రాంబాబు ఆధ్వర్యంలో శనివారం పెద్దఎత్తున ఆందోళనకు సమాయత్తమయ్యారు.
గ్రామ కార్యదర్శి యర్రంశెట్టి సత్యనారాయణ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విధ్వంసానికి పాల్పడిన దోషులను వెంటనే అరెస్టుచేయాలని వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు దొంగ మురళీకృష్ణ డిమాండ్ చేశారు.
కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలంలో..
అలాగే, కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలంలోని వెంట్రప్రగడ శివారు శివాపురం వద్ద రోడ్డు పక్కనున్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని కూడా శుక్రవారం రాత్రి దుండగులు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ పార్టీ గ్రామ కన్వీనర్ మండవ జానకరామయ్య (మున్నా) మాట్లాడుతూ.. అర్థరాత్రి సమయంలో ఎవరో వైఎస్సార్ విగ్రహం చేతుల భాగం విరగ్గొట్టారన్నారు. ఈ ఘటనను మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. గ్రామంలో పార్టీల పరంగా పరస్పర ఆరోపణలు మినహా ఎప్పుడూ ఇటువంటి చిల్లర రాజకీయాలు జరగలేదన్నారు.
సచివాలయ శిలాఫలకం ధ్వంసం..
ఇదిలా ఉంటే.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం రెడ్డిపల్లిలో గ్రామ సచివాలయం శిలాఫలకాన్ని కూడా గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. సచివాలయ నూతన భవనాన్ని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించారు.
దీనిని అప్పటి రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఈ ఏడాది మార్చిలో ప్రారంభించి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దీనిని గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి ధ్వంసం చేయగా.. శనివారం ఉదయం కార్యాలయానికి వచ్చిన సచివాలయ ఉద్యోగులు దీనిని గుర్తించారు. వెంటనే సర్పంచ్ కరాటం ప్రసన్న, కార్యదర్శి కట్టా సత్తిబాబు దృష్టికి విషయం తీసుకెళ్లగా వారిరువురూ అమలాపురం తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సంఘటన స్థలాన్ని ఎస్సై శేఖర్‌బాబు పరిశీలించి గ్రామంలో విచారణ జరిపారు. గ్రామంలో ఇటువంటి సంఘనలు గతంలో ఎప్పుడూ జరగలేదని, బయటి నుంచి వచ్చిన వ్యక్తులే చేసి ఉండవచ్చని స్థానికులు అనుమానాలు వ్యక్తంచేశారు. ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నామని ఎస్సై శేఖర్‌బాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment